
ప్రపంచ కుబేరుల జాబితాలో రెండో స్థానానికి ప్రముఖ వ్యాపారవేత్త ఎలాన్ మస్క్ (49) చేరుకున్నారు. మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ ను సైతం మస్క్ వెనక్కినెట్టారు. మస్క్ నికర సంపద విలువ 127.9 బిలియన్ డాలర్లకు పెరిగింది. బిల్ గేట్స్ ఆదాయం 127.7 బిలియన్ డాలర్లు. టెక్నాలజీతో నూతన ఆవిష్కరణలు, రోదసి యానం, విద్యుత్ ఆధారిత కార్లు వంటి వ్యాపారాలతో లాభాల బాటలో దూసుకుపోతున్నారు.
ఇటీవల మస్క్ నేతృత్వంలోని టెస్లా, స్పేస్ ఎక్స్ సంస్థల మార్కెట్ విలువ భారీగా పెరిగింది. స్టాక్ మార్కెట్లలో మస్క్ కు చెందని సంస్థల షేర్ల విలువ మరింత మెరుగైంది. ఈ ఒక్క ఏడాదికే మస్క్ ఆస్తి 100 బిలియన్ డాలర్లు పెరిగిందంటే టెస్లా, స్పేస్ ఎక్స్ ల ప్రస్థానం ఎంత ఉజ్వలంగా ఉందో అర్థమవుతుంది. ఇక ప్రపంచ నెంబర్ వన్ కుబేరుడిగా అమెజాన్ అధినేత జెఫ్ బెజోస్ కొనసాగుతున్నారు. ఆయన సంపద విలువ ప్రస్తుతం 190 బిలియన్ డాలర్లు.