Apr 14,2021 17:55

బీజింగ్‌ : టిక్‌టాక్‌...ఈ పేరు తెలియని కుర్రకారు ఉండనే ఉండరు. అంతగా చేరువైంది ఈ చైనా యాప్‌. అయితే గత ఏడాది భారత్‌, అమెరికా దేశాలు వినియోగదారుల గోప్యతకు ఉల్లంఘిస్తున్నాయంటూ కొన్ని యాప్‌లను నిషేధం విధించాయి. అందులో టిక్‌ టాక్‌ కూడా ఒకటి. అయినా..ఇప్పుడు టిక్‌టాక్‌కు అనుమతి లేదు కదా..ఎందుకు దీని ఊసు అనుకుంటారా....చెబుతామండీ...ఈ యాప్‌ను స్థాపించిన వ్యవస్థాపకుడు జాంగ్‌ యిమింగ్‌ (38) ప్రపంచ కుబేరుల జాబితాలో స్థానం సంపాదించాడు. అగ్ర దేశాలు పగపట్టినా....ఆంక్షలు విధించిన తట్టుకుని..తన యాప్‌ను విజయ తీరాల వైపు నడిపించడంలో జాంగ్‌ విజయవంతమయ్యాడు. అదే అతడిని అందలం ఎక్కించేలా చేసింది.
జాంగ్‌ యిమింగ్‌.. దక్షిణ చైనా నగరమైన లాంగ్యాన్‌, జాంగ్‌లో జన్మించారు. ఉన్నతోద్యోగుల ఏకైక కుమారుడు. టియాంజిన్‌.. నంకై విశ్వవిద్యాలయంలో ప్రోగ్రామింగ్‌ చదివారు. తన స్నేహితులు కంప్యూటర్‌ పోగ్రామింగ్‌ చేస్తుంటే.. తాను కంప్యూటర్‌ ప్రోగ్రామింగ్‌ నేర్చుకోవాలని మైక్రోసాఫ్ట్‌ క్రాప్‌లో జాయిన్‌ అయి... నేర్చుకున్నారు. ఆ తర్వాత ఉద్యోగంలో చేరినా.. బోరింగ్‌గా ఫీలయి.. సగం రోజే పని చేసి.. సగం రోజు పుస్తకాలను చదివేవారని స్థానిక మీడియా తెలిపింది. అలాగే అతను రియల్‌ ఎస్టేట్‌ సెర్చ్‌ పోర్టల్‌తో సహా పలు వెంచర్లను అభివృద్ధి చేశారు. చైనాలో కేవలం నాలుగు పడకగదిలో అపార్టుమెంట్‌లో పనిచేస్తున్నప్పుడు.. 2012లో బైట్‌డాన్స్‌ యాప్‌తో మొట్టమొదటిసారిగా విజయాన్ని అందుకున్నారు. ఈ యాప్‌.. చిన్న వీడియో ప్లాట్‌ఫారమ్‌లైన టిక్‌టాక్‌.. చైనీస్‌ ట్విన్‌ యాప్‌ డౌయిన్‌తో కలిసి ప్రపంచవ్యాప్తంగా ఒక బిలియన్లుకు పైగా వినియోగదారులను సంపాదించుకుంది. అయితే దీనికంటే ముందే ఈ యాప్‌.. న్యూస్‌ అగ్రిగేషన్‌కు మారింది. అయితే ఇది ప్రపంచవ్యాప్తంగా ప్రాచుర్యం పొందిన తర్వాత.. పెట్టుబడిదారులు కూడా ఇందులో పెట్టుబడులను పెట్టడానికి ఆసక్తి చూపారని.. బైట్‌డాన్స్‌ ప్రధాన అధికారి చెవ్‌ షౌ జీ తెలిపారు.
షార్ట్‌ వీడియోస్‌కు ప్రసిద్ధి చెందిన యాప్‌ బైట్‌డాన్స్‌ ద్వారా.. ఇ- కామర్స్‌, ఆన్‌లైన్‌ గేమింగ్‌ వంటి రంగాలకు విస్తరించిన తర్వాత గత సంవత్సరం కంటే ఈ ఏడాది ఆదాయం రెట్టింపు అయింది. ప్రపంచవ్యాప్తంగా ఈ కంపెనీ షేర్లు.. 260 బిలియన్‌ డాలర్లు కంటే ఎక్కువగా ఉంటే.. అందులో నాలిగింట ఒకవంతు 60 బిలియన్ల కంటే ఎక్కువ షేర్లు జాంగ్‌కి ఉన్నాయి.
ఇంతటి విజయాన్ని సాధించిన జాంగ్‌ యిమింగ్‌ని ప్రశ్నిస్తే.. 'మానసిక ప్రశాంతంగా ఉంటాను.. ఆకలైనప్పుడు తింటాను. నిద్ర వచ్చినప్పుడు నిద్రపోతాను'.. అని చాలా సాదాసీదాగా జావాబిచ్చారు.