May 16,2021 08:21

ప్రజాశక్తి- హైదరాబాద్‌ బ్యూరో : తెలుగు సాహిత్యాభివృద్ధికి ఎంతో కృషి చేసిన ప్రముఖ భాషా సాహితీవేత్త, విమర్శకులు, కెకెఆర్‌గా సుపరిచితులైన డాక్టర్‌ కె.కె.రంగనాథాచార్యులు (80) శనివారం హైదరాబాద్‌లో కన్నుమూశారు. ఆంధ్ర సారస్వత పరిషత్తు ప్రాచ్య కళాశాల ప్రిన్సిపల్‌గా, హైదరాబాద్‌ కేంద్రీయ విశ్వవిద్యాలయం తెలుగు విభాగాధిపతిగా విశేష సేవలందించారు. తెలుగు, సంస్కృత భాషల్లో ఎంఎ చేసిన ఆయన భాషా శాస్త్రంలో పిహెచ్‌డి చేశారు. తెలుగులో అనేక పుస్తకాలు రాశారు. రంగనాథాచార్యులుకు భార్య, ఒక కుమారుడు, ఒక కుమార్తె ఉన్నారు. ఆయన అంత్యక్రియలను అంబర్‌పేట శ్మశాన వాటికలో నిర్వహించారు. రంగనాథాచార్యులు మరణం పట్ల తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు తీవ్ర సంతాపాన్ని ప్రకటించారు. తెలుగు భాషా పండితునిగా పలు ఉన్నత పదవులను నిర్వహించిన ఆయన సాహిత్య వికాసానికి ఎంతో కృషి చేశారని కొనియాడారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.
 

                                                        సాహితీ స్రవంతి సంతాపం

   రంగనాథాచార్యులు కన్నుమూత అత్యంత విచారకరమని సాహితీ స్రవంతి రాష్ట్ర గౌరవాధ్యక్షులు తెలకపల్లి రవి పేర్కొన్నారు. ఈ మేరకు శనివారం ప్రకటన విడుదల చేశారు. కెకెఆర్‌గా సుపరిచితులైన ఆయన ప్రగతిశీలవాది, సాహిత్య సమాజ మౌలికాంశాలను వెదికి పట్టుకోవడంలో దిట్టని తెలిపారు. జీవితాంతం అధ్యయనానికి అంకితమైన మేధావి అని పేర్కొన్నారు. స్వతంత్ర వ్యక్తిత్వం, భావస్పష్టత కెకెఆర్‌ సొంతమని, ఆయన మార్గదర్శకంతో ఎందరో ప్రేరణ పొందారని వివరించారు. వివిధ సాహిత్య ఉద్యమాలతో సన్నిహిత సంబంధంగల కెకెఆర్‌ సాహితీ స్రవంతిని ఎంతో ప్రోత్సహించేవారన్నారు. సాహిత్య సభల్లో పాల్గొంటూ సాహిత్య ప్రస్థానంలో విలువైన వ్యాసాలు రాశారని తెలిపారు.