Mar 28,2021 13:12

హోలీ రోజు ఒకరిపై ఒకరు చల్లుకునే ఏడు రంగులతో పుడమితల్లి తడిసి ముద్దయి, రంగుల గంగతో పులకించిపోతుంది. చలికాలం అయిపోయి, వచ్చే వేసవి వేళలో వసంత ఋతువుకి హోలీ ఆహ్వానం పలుకుతుంది. అయితే ఒక్కో ప్రాంతంలో ఒక్కో విశిష్టతతో జరుపుకుంటారు. మన దేశంలోని పశ్చిమ బెంగాల్‌లో దీన్ని దోల్‌యాత్రా (దోల్‌ జాత్రా) లేదా బసంత-ఉత్సబ్‌ (వసంతోత్సవ పండుగ) అని అంటారు. దీపావళి తర్వాత దేశంలో అంత వేడుకగా జరుపుకునే పండుగల్లో ఇదీ ఒకటి. గతంలో ఈ పండుగ రోజున పువ్వులను ఒకరిపై ఒకరు చల్లుకుంటూ ఉత్సవాన్ని జరుపుకునేవారు. ప్రస్తుతం వాటి స్థానంలో రకరకాల రంగులు వచ్చి చేరాయి. ఈ రంగులను నీళ్లల్లో కలిపి, ఒకరిపై ఒకరు చల్లుకుంటున్నారు. ఇలా చల్లుకోవడం ఓ ఆనందకేళి.
 

ఇదీ విశిష్టత...
చలికాలం తర్వాత వేసవిలోకి ప్రవేశించే సమయంలో వాతావరణంలో కొన్ని మార్పులు చోటుచేసుకుంటాయి. ఈ సమయంలో వచ్చే అనారోగ్యాలను అరికట్టడానికి హోలీకేళీ ఓ ఆయుర్వేద చికిత్స. వేప, నిమ్మ, కుంకుమ, తులసి, కొన్ని మొక్కల బెరడు, పసుపు వంటి వాటితో తయారుచేసిన నీటిని జల్లుకొనేవారు. ప్రస్తుతం క్షణం తీరిక లేని జనం కృత్రిమ రంగులను ఉపయోగించి, అనారోగ్యాన్ని కొనితెచ్చుకుంటున్నారు. వ్యాపారులూ తమ స్వలాభం కోసం రసాయనాలతో తయారుచేసిన రంగులనే అమ్ముతున్నారు. సహజమైన వర్ణాల స్థానంలో రసాయనిక రంగులు వాడుతూ ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. కెమికల్స్‌తో నిండిపోయిన రంగులు అనేక అనారోగ్యాలకు దారితీస్తున్నాయి.
 

ఒక్కో ప్రాంతంలో ఒక్కోలా...
హోలీని రంగుల పండుగ అని అంటారు. ఇది మన దేశంలో మాత్రమే కాక నేపాల్‌, బంగ్లాదేశ్‌ వాళ్ళూ జరుపుకుంటారు. కొన్నిచోట్ల ఈ పండుగని కేవలం ఒక్కరోజే చేసుకుంటారు. అయితే కొన్ని ప్రదేశాల్లో మూడు నుండి పదహారు రోజుల వరకూ జరుపుకుంటారు. అయితే ఈ ఉత్సవం వసంతం ముందు వస్తుంది కనుక 'బసంతి ఉత్సబ్‌' అని పిలుస్తారు. అంతేకాకుండా దీనిని 'దోల్‌ యాత్ర' అనీ అంటారు. కృష్ణుడుకి సంబంధించిన కొన్ని ప్రదేశాల్లో హోలీ పండుగని బాగా జరుపుకుంటారు. వాటిలో మధుర, బృందావనం, నందగావ్‌, బర్సానా మొదలైన ప్రదేశాల్లో హోలీని అంగరంగ వైభవంగా జరుపుతారు. అయితే హోలీ పుట్టుపూర్వోత్తరాల గురించి విభిన్నగాథలు ప్రచారంలో ఉన్నాయి. ఉత్తర భారతంలో ప్రధాన ఆహారధాన్యమైన గోధుమలు కోతకు వచ్చే తరుణమూ ఇదే. ఆ కోతల కోలాహలమే- హోహోకారమై హోలీ అయ్యిందని కొందరి అభిప్రాయం.

ప్రకృతి వర్ణ శోభితం.. హోలీ సంబరం..


తెలుగు రాష్ట్రాల్లో..
దక్షిణ భారతదేశంతో పోల్చుకుంటే ఉత్తర భారతదేశంలో హోలీని బాగా జరుపుకుంటారు. అయితే ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణలో ఒక్కరోజు మాత్రమే జరుపుకుంటారు. కొన్నిచోట్ల భోగి మంటల సంప్రదాయమూ ఉంది. తెలుగు రాష్ట్రాల్లో ఉండే బంజారాలు, గిరిజనులు హోలీని ఎంతో బాగా జరుపుకుంటారు. చక్కని నృత్యాలలతో సాంస్కృతిక, సాంప్రదాయాల్ని గుర్తు చేసుకుంటారు. ఉత్సాహంగా రకరకాల వాటర్‌గన్‌ / ట్యూబ్‌లు, బెలూన్లు, కలర్‌ షవర్స్‌తో రంగులను చల్లుకుంటారు. దాండియా, కోలాటం వంటి నృత్యాలను చేస్తూ సందర్భోచిత పాటలను పాడుతూ ఆనందంగా గడుపుతారు.

హంపిలో..
కర్నాటకలో ఉండే హంపీలో సాంప్రదాయమైన హోలీని చూడవచ్చు. రకరకాల రంగుల మధ్య చారిత్రక కట్టడాల అలంకరణ అద్భుతంగా ఉంటుంది. రంగులతో పాటు డోలు శబ్దాలతో రెండురోజుల పాటు ఇక్కడ వేడుకలు జరుగుతాయి.
 

గోవాలో..
వేసవిలో హ్యాపీగా హోలీని ఎంజారు చేయడానికి గోవా ఓ అద్భుతమైన ప్రదేశం. వారంపాటు సెలబ్రేట్‌ చేసుకునే ఈ పండుగ సమయంలో గోవా సందర్శించడం భలే ఆనందంగా ఉంటుంది. గోవాలో హోలీని షిగ్మో అంటారు. బాండ్స్‌, పరేడ్స్‌, రాత్రి వేళల్లో జరిగే మ్యూజికల్‌ ఈవెంట్స్‌ను గోవా ప్రభుత్వం హాలీడే ప్యాకేజ్‌లుగా అందిస్తుంది.
 

ముంబైలో..
మహారాష్ట్రలోని అతి పెద్ద నగరం ముంబైలో హోలీ వేడుకలు అద్భుతంగా జరుగుతాయి. ముంబయి వీధులన్నీ రంగులు, సంగీతంతో హోరెత్తిపోతుంది. ఇక్కడ హోలీ వేడుకలను బాగా ఎంజారు చేస్తారు. అయితే కరోనా నేపథ్యంలో ఈ ఏడాది వేడుకలను అక్కడి ప్రభుత్వం నిషేధించింది.
 

ప్రకృతి వర్ణ శోభితం.. హోలీ సంబరం..

పురులియా, పశ్చిమ బెంగాల్‌లో..
కలర్‌ఫుల్‌ రంగులతో పాటు సంప్రదాయ నృత్యంతో పురిలియాలో హోలీ వేడుకలు అంగరంగ వైభవంగా జరుపుకుంటారు. ఇలాంటి నృత్యం మనం ఇప్పటివరకూ చూసి ఉండం. ఈ నృత్యం అక్కడి ప్రజలు హోలీ సందర్భంలోనే చేస్తారు.
 

పంజాబ్‌లో..
ఆనంద్‌పూర్‌లో హోలీ అంటే కేవలం రంగులు మాత్రమే కాదు, భౌతిక కార్యక్రమాలు కూడా. మార్షల్‌ ఆర్ట్స్‌, శారీరక సామర్థ్యం వంటి ప్రదర్శనలతో వేడుకలు జరుగుతాయి. వీటిని చూసేందుకు రెండు కళ్లూ సరిపోవంటే అతిశయోక్తి కాదు.
 

ఉదయపూర్‌, రాజస్థాన్‌లో..
ఉదయపూర్‌లో రాచరిక పద్ధతిలో హోలీ వేడుకలు నిర్వహిస్తారు. ఇక్కడ మేవార్‌ రాజ కుటుంబానికి చెందిన గుర్రాల ప్రదర్శన చూసినవాళ్లు అద్భుతం అనాల్సిందే. హోలీ వేడుకకు సరిగ్గా ముందు ఈ ప్రదర్శన జరుగుతుంది. ఆ తర్వాత నుంచి పట్టణం అంతా రంగులమయం అయిపోతుంది.
 

జైపూర్‌లో..
రాజస్థాన్‌ రాష్ట్రంలోని జైపూర్‌లో హోలీకి ప్రత్యేకత ఉంటుంది. వారి వేడుకలలో ఏనుగులు కూడా ఒక భాగం కావడం విశేషం. రంగురంగుల వస్త్రాలు అనేక రంగుల అలంకరణలతో ఏనుగులు చూడముచ్చటగా ఉంటాయి. ఏనుగులతో నిర్వహించే టగ్‌ ఆఫ్‌ వార్‌ ఇక్కడి ప్రత్యేకత. హోలీ అంటే ఇష్టపడేవారు జైపూర్‌ హోలీ ప్యాకేజ్‌తో సంబరాలను సందర్శించవచ్చు.
 

ప్రకృతి వర్ణ శోభితం.. హోలీ సంబరం..

ఇండోర్‌లో...
హోలీ పండుగ రోజు మనసులతోనూ నృత్యం చేయించాలంటే ఇండోర్‌ వెళ్లాల్సిందే. అంతగా ఇక్కడి హోలీ వేడుకలు మనసులను హత్తుకుంటాయి. నగరం అంతా ఒక్కచోటకు చేరి, డ్యాన్స్‌ చేసే సన్నివేశం కళ్ల నుండి చెదిరిపోవడం అసాధ్యం.
 

బర్సనలో..
శ్రీకృష్ణుని ప్రేయసి రాధ పుట్టిన ప్రదేశంగా చెప్పుకునే బర్సనలో.. హోలీ సందర్భంగా నందగామ్‌ నుంచి వచ్చిన అబ్బాయిలు, అమ్మాయిలతో ఆటలు ఆడతారు. రంగులకు బదులుగా కర్రలతో పలకరించుకోవడం చూడముచ్చటగా ఉంటుంది. ఇక్కడ హోలీ పండుగను 'లాథ్‌ మార్‌ హోలీ' అని పిలుస్తారు.
 

రసాయనాలతో ప్రమాదం..
హోలీ కోసం విక్రయించే రంగులు రసాయనాలతో తయారువుతున్నాయి. ఈ రంగుల్లో క్రోమియం, సిలికా సీసం, లోహ ఆక్సైడ్‌ వంటి హానికరమైన రసాయనాలు ఉంటాయి. ఇవి క్యాన్సర్‌కూ కారణమవుతాయి. కాబట్టి రసాయన రంగుల వల్ల ప్రమాదం పొంచి ఉంది. అందుకే ఇలాంటి రంగులు కళ్లలో పడకుండా జాగ్రత్తపడాలి. ఇష్టంలేని వారి మీద, అలర్జీ తదితర చర్మవ్యాధులున్న వారిమీద, కొత్తదుస్తులు ధరించిన వారిమీద రంగులు పూయకుండా ఉండడమే మంచిది.

ప్రకృతి వర్ణ శోభితం.. హోలీ సంబరం..


సహజ రంగులే వాడదాం!
హోలీకి సహజ సిద్ధమైన రంగులు సొంతంగా తయారుచేసుకోవడంతో ఉండే ఆనందమే వేరు. ఎర్ర చందనం, ఎర్ర మందారం, టమాటా, క్యారెట్‌తో ఎంచక్కా ఎరుపు రంగును తయారు చేసుకోవచ్చు. ఇది ఒంటిమీద పడినా ఎలాంటి హానీ కలుగదు. గోరింటాకులతో ఆకుపచ్చని రంగు ద్రావణాన్ని, బీట్‌రూట్‌తో గులాబీ రంగు ద్రావణాన్ని తయారుచేసుకోవచ్చు. పసుపు కొమ్ములను దంచి, నీళ్లలో నానబెట్టి పసుపు వర్ణ ద్రావణాన్ని రెడీ చేసి ఎంచక్కా వాడుకోవచ్చు. మోదుగపూలను నీటిలో నానబెట్టి చేసే రంగుకు పల్లెల్లో ఎంతో ప్రాధాన్యం ఉంది. గోగుపూలు అని కూడా పిలిచే ఈ పుష్పాలతో బ్యారెళ్లకొద్దీ ఎరుపు రంగును తయారుచేస్తారు. ఇలా రకరకాల చెట్ల ఆకులు, పూలతో ఎన్నో రంగులను తయారుచేసుకోవచ్చు. దీంతోపాటు వంటకాల్లో వాడే కొన్ని రకాల ఫుడ్‌ కలర్స్‌నూ హోలీ రంగులుగా ఉపయోగించవచ్చు. ఇందుకోసం కాస్త ఉప్పులో వేర్వేరు రంగుల ఫుడ్‌ కలర్స్‌ని విడివిడిగా కలుపుతూ వివిధ రంగుల్ని తయారుచేసుకోవచ్చు. అయితే వీటిలో లేతరంగు కోసం ఫుడ్‌ కలర్‌ని కాస్త తక్కువగా, ముదురు రంగులు కావాలనుకుంటే ఫుడ్‌ కలర్‌ కాస్త ఎక్కువ మోతాదులో కలుపుకోవాలి.

తీసుకోవాల్సిన జాగ్రత్తలు..

  • సహజసిద్ధమైన రంగులు వాడటం వల్ల ఎటువంటి ఇబ్బందీ ఉండదు.
  • రసాయన మిళితమైన రంగులు వాడి, ప్రమాదం కొనితెచ్చుకోవద్దు. కళ్లకు హాని జరగకుండా కళ్లకు సన్‌ గ్లాసెస్‌ ధరించడం మంచిది.
  • రంగులు పూసుకునేటప్పుడు కళ్లు, పెదాలు మూసుకోవడం మంచిది.
  • హోలీ ఆడిన తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి.
  • రసాయనరంగుల వల్ల అనుకోని ప్రమాదం జరిగితే, వెంటనే వైద్యుడ్ని సంప్రదించాలి.
  • కోడిగుడ్లు, బురద, మురికినీటిని పిల్లలు వాడకుండా చూడాలి.

ముఖ్యంగా ఎంత సహజ రంగులు ఉపయోగిస్తున్నా సరే... ఈసారి 'కరోనా' నేపథ్యంలో ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా ఉండాల్సిందే. అందుకే - హోలీ సంబరాల్లో మునిగిపోయి, కరోనా సోకకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు మాత్రం మర్చిపోవద్దు !
                                                                  * ఉదయ్‌ తేజశ్విని ఆకుల