Oct 26,2021 07:01

ఈ ఖరీఫ్‌లో ఎదురైనంతగా రైతులకు అవస్థలు ఇటీవలి కాలంలో ఎన్నడూ ఎదురు కాలేదు. సరిగ్గా కరోనా రెండవ దశ ఉధృతి వేళ సీజన్‌ మొదలైంది. వర్షాభావం, తుపాన్లు, వరదలు, అకాల వర్షాలు ఒకదాని తర్వాత మరొకటి దాడి చేసి రైతును చిత్తు చేశాయి. ఇంకా చేస్తున్నాయి. నైరుతి రుతుపవనాలు జూన్‌ 10 నాటికి రాష్ట్ర వ్యాప్తంగా విస్తరించగా తొలకరిలో అంతగా వర్షాలు పడలేదు. 670 మండలాలకుగాను జూన్‌లో 313 మండలాల్లో వర్షాభావం ఏర్పడింది. జులైలో కొంత ఆశాజనకంగా వానలు కురిసిన దరిమిలా వర్షాభావ మండలాలు 64కు తగ్గాయి. రైతులు ఊపిరి పీల్చుకునే లోపే ఆగస్టులో సరైన వర్షాల్లేక 271 మండలాలకు వర్షాభావం విస్తరించింది. సెప్టెంబర్‌లో 247 మండలాల్లో వర్షాభావం తిష్ట వేసింది. ఉత్తరాంధ్ర, ప్రకాశం, నెల్లూరు, కర్నూలులో అదనుకు వానలు పడలేదు. మొత్తమ్మీద రాష్ట్ర సగటు వర్షపాతం ఖరీఫ్‌లో సాధారణ స్థాయిలో నమోదైనా ఒక్కో నెలలో ఒక్కోలా వానలు పడటంతో సేద్యం ఒక అడుగు ముందుకు రెండడుగులు వెనక్కి అన్న చందాన నడిచింది. వర్షానికి వర్షానికి మధ్య మూడు వారాల అంతరం ఉన్నా, ఆ సమయంలో పడాల్సిన సాధారణ వర్షంలో యాభై శాతం కంటే తక్కువ కురిసినా డ్రైస్పెల్‌గా పరిగణిస్తారు. ఖరీఫ్‌ సమయం జూన్‌-సెప్టెంబర్‌లో 370 మండలాల్లో డ్రైస్పెల్స్‌ వచ్చినట్లు ప్రభుత్వమే పేర్కొంది. నైరుతి నిష్క్రమించి ఈశాన్య రుతుపవనాలొచ్చే అక్టోబర్‌లో వర్షాభావం ఇంకా పెరిగింది. మొదటి రెండు వారాల్లో 50 శాతం లోటు ఏర్పడింది. ఇప్పటికైతే 38 శాతం మైనస్‌. వర్షాభావ మండలాలు పెరుగుతున్నాయి. ఆ ప్రభావం ఖరీఫ్‌ పంటలపై తప్పకుండా పడుతుంది.
వర్షాభావంతో పాటే అధిక వర్షాలు, తుపాన్‌ సంభవించి పంటలకు నష్టం చేశాయి. ఆగస్టులో అధిక వర్షాలకు 40 వేల ఎకరాల్లో పంటలు దెబ్బతినగా, గులాబ్‌ తుపాన్‌ విలయానికి రెండు లక్షల ఎకరాల్లో పంటలకు నష్టం వాటిల్లినట్లు ప్రాథమికంగా తేలింది. వర్షాభావం, అధిక వర్షాలు రెండింటి వలన వరి, మిర్చి, పత్తి, ఇత్యాది పంటలకు చీడ పీడలు సోకుతున్నాయి. ఆసాంతం దిగుబడులు తగ్గుతాయని రైతులు ఆందోళనగా ఉన్నారు. అసలే ఈ ఏడాది లక్షల ఎకరాల్లో సాగు తగ్గింది. ఈ విషయం గ్రామాలకెళితే ప్రత్యక్షంగా తెలుస్తుంది. వర్షాభావం వలన పంటలు సాగు చేయకపోవడం ఒక ఎత్తు. సాగునీటి వనరులు పుష్కలంగా ఉన్న ప్రాంతాల్లో సైతం రైతులు సాగు పట్ల అనాసక్తి కనబర్చడం సంక్షోభానికి సంకేతం. చేతిలో పెట్టుబడుల్లేక పోవడం, ధరల పెరుగుదల, కరోనా విలయం, అన్నింటి కంటే సాగు చేసినా గిట్టుబాటు కావట్లేదన్న నిరాశ నిస్పృహ రైతును సాగుకు దూరం చేస్తున్నాయన్నది అసలైన యధార్ధం. కల్తీ విత్తనాలు, ఎరువుల కొరత, బ్లాక్‌ మార్కెటింగ్‌ రైతులను మరింత కుంగదీస్తున్నాయి.
వ్యవసాయ రాష్ట్రమైన ఎ.పిలో రైతులను ఆదుకునే చర్యలను చేపట్టడం ప్రభుత్వ బాధ్యత. సాంకేతిక గణాంకాలను కాకుండా వాస్తవ పరిస్థితుల ఆధారంగా కరువు మండలాలను ప్రకటించి రైతులకు పరిహారం, కంటెంజెన్సీ ప్రణాళికలు, పంటలేసుకోడానికి కొత్త అప్పులు, విత్తనాలు అందించాలని అన్నదాతలు కోరుతున్నారు. ఎరువులను అందుబాటులో ఉంచమంటున్నారు. వర్షాల వలన పంట దెబ్బతిన్న రైతులకు పరిహారం, బీమా కోసం ఎదురు చూస్తున్నారు. ఖరీఫ్‌ పంటలకు గిట్టుబాటు ధరలు దక్కేలా చర్యల కోసం డిమాండ్‌ చేస్తున్నారు. ప్రభుత్వం ఆ దిశగా ఇసుమంతైనా కదలట్లేదు. సరిగ్గా ఇప్పుడే రాష్ట్రంలో అధికార వైసిపి, ప్రధాన ప్రతిపక్షం టిడిపి నడుమ సాగుతున్న పరస్పర నిందారోపణలు, దూషణల పర్వాలు, పోటీ దీక్షల హోరులో రైతు, ప్రజా సమస్యలు కొట్టుకు పోవడం దిగ్భ్రాంతి గొల్పుతోంది. ఆ రెండు పార్టీల రాజకీయ గలాభాలో ప్రజల ఎజెండా మరుగున పడటం జనానికి చేటు. విమర్శల గందరగోళంలో ప్రజా సమస్యల పరిష్కార బాధ్యత నుండి తప్పించుకోడానికి, పాలనా వైఫల్యాలను కప్పిపుచ్చుకోడానికి అధికార వైసిపికి సులువుగా దారి దొరకినట్లయింది. ప్రజల సమస్యలపై ప్రభుత్వాన్ని నిలదీసి వాటి పరిష్కారానికి కృషి చేయాల్సిన ప్రధాన ప్రతిపక్షం ఆ పని మానేసింది. రెండు ప్రధాన పక్షాలను ప్రజల దృక్కోణానికి మరలించే కార్యాచరణకు ప్రజలే కార్యోన్ముఖులు కావాలి.