Jun 11,2021 13:24

ప్రజాశక్తి-రాజంపేట అర్బన్‌ (కడప) : ప్రజలపైన భారం మోపే జీవోలను వెంటనే ఉపసంహరించుకోవాలని కార్మిక, ప్రజా సంఘాలు డిమాండ్‌ చేశాయి. సిపిఐ, సిపిఎం, కాంగ్రెస్‌ పార్టీ, భవన యజమానుల సంఘం, ఎఐటియుసి, సిఐటియు, పిడిఎస్‌యు, ప్రజా సంఘాల నాయకులు సంయుక్తంగా శుక్రవారం మున్సిపల్‌ కార్యాలయం వద్ద నిరసన తెలిపారు. అనంతరం మునిసిపల్‌ డిఈ వేణుగోపాల్‌ కు వినతిపత్రాన్ని అందించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ... ఇంటి పన్ను, చెత్త పన్ను, నీటి పన్నులను పెంచుతూ జారీచేసిన జీవో నెంబర్‌ 196, 197, 198 లను వెంటనే ఉపసంహరించుకోవాలని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం సంక్షేమ పథకాలను అమలు చేయలేక ప్రజలపై పన్నులు మోపి వసూలు చేయాలనుకోవడం చాలా దురదఅష్టకరమన్నారు. ప్రజలు ప్రభుత్వాన్ని నమ్మి రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్‌ ఎన్నికల్లో వైసిపి కి మెజార్టీ ఇచ్చారని, ఎన్నికలు పూర్తయి పాలకమండళ్లు ఏర్పాటవగానే రాష్ట్రంలోని మునిసిపాలిటీలు, కార్పొరేషన్లలో ఆస్తి పన్ను, చెత్త పన్ను, నీటి పన్ను, యూజర్‌ చార్జీల పెంపు వంటి అనాలోచిత నిర్ణయాల అమలుకు తీర్మానాలు చేయడం సరికాదన్నారు. పన్నులు గురించి బత్స సత్యనారాయణ అవాస్తవాలు చెబుతూ ప్రజలను మభ్య పెట్టాలని చూస్తున్నారని విమర్శించారు. మున్సిపాలిటీలలో రూ.60, స్పెషల్‌ గ్రేడ్‌ మున్సిపాలిటీలలో రూ.90, కార్పొరేషన్లలో నెలకు రూ.120 చొప్పున పన్నులను వసూలు చేయాలని చూడడం దారుణమన్నారు. పారిశుద్ధ్య నిర్వహణ నుంచి పూర్తిగా తప్పుకుంటూ చెత్తపై పన్ను వేయడం దుర్మార్గమన్నారు. దేశంలో గత రెండు సంవత్సరాలుగా కరోనా మహమ్మారితో ప్రజలు అల్లాడిపోతున్న పరిస్థితులలో ఆస్తి పన్నులు పెంచాలి అనుకోవడం తగదన్నారు. వెంటనే పెంచదలచిన ఆస్తి పన్నును విరమించుకోవాలని నేతలు డిమాండ్‌ చేశారు. ప్రజలపై భారాలు పడే పనులను విరమించునేంతవరకు కలిసొచ్చే పార్టీలు ప్రజా సంఘాలను శక్తులను కలుపుకొని పోరాటాలు నిర్వహిస్తామని నేతలు స్పష్టం చేశారు.