Nov 30,2020 20:03

వివాదాస్పదంగా జిల్లాలో పోలీసుల తీరు
ముందస్తు అరెస్టుల పేరుతో వేధింపులు
104 యూనియన్‌ నాయకుని ఇంటి వద్ద రాత్రిపూట హల్‌చల్‌
మహిళలు ఒక్కరే ఉన్నా తనిఖీల పేరుతో ఇబ్బందులు
ఫోన్‌ లాక్కెళ్లిన వైనం.. డిఎస్‌పికి ఫిర్యాదుతో వెనక్కిచ్చిన ఫోన్‌
ప్రజాశక్తి - ఏలూరు ప్రతినిధి

ఇటీవల రాష్ట్రంలోని పలు ఘటనలకు సంబంధించి పోలీసుల తీరుపై హైకోర్టు ఘాటు వ్యాఖ్యలే చేస్తోంది. పోలీస్‌ ఉన్నతాధికారుల తీరును సైతం తప్పుబడుతున్న పరిస్థితి నెలకొంది. పలు కేసుల్లో పోలీసులు వ్యవహరించిన తీరుతో వారే దోషులుగా అరెస్టవుతున్న పరిస్థితి సైతం ఉంది. అయినప్పటికీ పోలీసుల తీరులో ఏమాత్రం మార్పు రావడం లేదనే విమర్శలు విన్పిస్తున్నాయి. జిల్లాలో చోటుచేసుకుంటున్న పరిణామాలే అందుకు నిదర్శనంగా చెప్పొచ్చు. ప్రజాస్వామ్య దేశంలో ప్రతిఒక్కరికీ ప్రశ్నించే హక్కు ఉంది. ప్రజలు తమ సమస్యలపై నిరసన తెలిపే హక్కును రాజ్యాంగం కల్పించింది. అందుకు పూర్తి విరుద్దంగా లాఅండ్‌ఆర్డర్‌ పేరుతో జిల్లాలో పోలీసులు వ్యవహరిస్తున్న తీరు వివాదాస్పదమవుతోంది. ముందస్తు అరెస్టుల పేరుతో పోలీసులు తీవ్ర వేధింపులకు పాల్పడుతున్నారని ప్రజాసంఘాల, ఉద్యోగ, కార్మిక యూనియన్ల నాయకులు మండిపడుతున్నారు. తాజా ఘటనే అందుకు నిదర్శనంగా చెబుతున్నారు. 13 ఏళ్లుగా 104 విభాగంలో పని చేస్తున్న ల్యాబ్‌ టెక్నీషియన్‌, ఫార్మాసిస్టు, స్టాఫ్‌నర్స్‌, ఎఎన్‌ఎం, సెక్యూరిటీకి సంబంధించిన ఉద్యోగులను ప్రభుత్వం పక్కన పెట్టింది. ఐదు నెలలుగా వారంతా వేతనాలు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. విజయవాడలో ధర్నా నిర్వహించేందుకు 104 రాష్ట్ర యూనియన్‌ పిలుపునిచ్చింది. దీంతో 104 యూనియన్‌ జిల్లా అధ్యక్షులు ఎ.సునీల్‌ను ముందస్తు అరెస్టు పేరుతో నిర్బంధించేందుకు మినీబైపాస్‌లోని ఎన్‌టిఆర్‌ కాలనీకి ఆదివారం రాత్రి ఏలూరు రూరల్‌ పోలీసులు వెళ్లారు. ఇంట్లో సునీల్‌ భార్య, తల్లి, పిల్లలు మాత్రమే ఉన్నారు. దీంతో సునీల్‌ గురించి చెప్పాలని రాత్రి 11 గంటలకు ఇంట్లోకి ప్రవేశించిన పోలీసులు తెల్లవారుజాము మూడు గంటలకు వరకూ తనిఖీల పేరుతో తమను తీవ్ర ఇబ్బందులకు గురిచేశారని కుటుంబ సభ్యులు తీవ్ర ఆవేదనకు గురవుతున్నారు. అంతేకాకుండా సెల్‌ఫోన్‌ లాక్కుని వెళ్లిపోయారు. మళ్లీ ఉదయం వచ్చి తీవ్ర ఇబ్బందులు పెట్టినట్లు వారు తీవ్ర వేదనకు లోనవుతున్నారు. సునీల్‌ తల్లి అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఏదైనా సమస్య వస్తే ఫోన్‌ చేసుకునే అవకాశం కూడా లేకుండా చేశారని కన్నీటి పర్యంతమవుతున్నారు. పిల్లలను సైతం వివిధ ప్రశ్నలతో ఇబ్బందులకు గురిచేసినట్లు కుటుంబ సభ్యులు చెబుతున్నారు. సిఐటియు నాయకులు జోక్యం చేసుకుని ఏలూరు డిఎస్‌పి దిలీప్‌కిరణ్‌ దృష్టికి సునీల్‌ ఇంట్లో నుంచి ఫోన్‌ లాకెళ్లిన విషయం తీసుకెళ్లారు. డిఎస్‌పి వెంటనే స్పందించడంతో సోమవారం సాయంత్రం నాలుగు గంటల సమయంలో ఫోన్‌ తీసుకొచ్చి పోలీస్‌ సిబ్బంది ఇచ్చి వెళ్లారు. తాము ఏం తప్పు చేశామని, మహిళలమని చూడకుండా పోలీసులు తమను వేధించారని కుటుంబ సభ్యులు తీవ్ర ఆవేదనకు లోనవుతున్నారు.
అన్నింటికీ ముందస్తు అరెస్టులే..
సిఎం జిల్లా పర్యటనకు వస్తున్నారంటే సిపిఎం, సిపిఐతోపాటు వామపక్షాలు, ప్రజాసంఘాల నాయకులను ముందస్తు అరెస్టుల పేరుతో పోలీసులు నిర్బంధిస్తున్నారు. సిఎం జిల్లా నుంచి వెళ్లే వరకూ నాయకులను ఇంట్లోనే బంధిస్తున్నారు. నాయకులు ఇంటి వద్ద లేకపోతే కుటుంబ సభ్యులపై రుబాబు చేస్తున్న పరిస్థితి నెలకొంది. తాము ఏ కార్యక్రమానికీ పిలుపు ఇవ్వలేదని చెబుతున్నా విన్పించుకోవడం లేదు. ఇటీవల టిడ్కో గృహాలను లబ్ధిదారులకు అప్పగించాలని సిపిఐ ఆందోళనకు పిలుపునిచ్చింది. సిపిఐ నాయకులనే కాకుండా సిపిఎం, ఇతర వామపక్ష నాయకులను ముందస్తు అరెస్టుల పేరుతో నిర్బంధించారు. దేశవ్యాప్తంగా సాగుతున్న సార్వత్రిక సమ్మె సందర్భంగాను పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించి నాయకులపై అరెస్టుల పర్వం సాగించారు. సమస్యలపై మాట్లాడకుండా అడ్డుకోవడం ఏమిటో ఏ ఒక్కరికీ అర్థం కావడం లేదు. గత టిడిపి ప్రభుత్వ హయాంలో ముందస్తు అరెస్టులపై వైసిపి తీవ్ర విమర్శలు చేసింది. ఇప్పుడు అధికారంలోకి వచ్చాక అంతకంటే దారుణంగా వ్యవహరిస్తుందనే చర్చ సాగుతోంది. దీంతో ఇది ప్రజాస్వామ్యమా.. లేక పోలీస్‌ రాజ్యమా అనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రజలు తమ సమస్యల గురించి చెప్పే వెసులుబాటు లేకుండా ముందస్తు అరెస్టుల పేరుతో జిల్లా పోలీసులు సాగిస్తున్న నిర్బంధకాండ సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. ఇప్పటికైనా పోలీసులు తమ తీరు మార్చుకోవాలని ప్రజాసంఘాల నాయకులు కోరుతున్నారు.