Nov 26,2021 06:42

    జన చైతన్యం కోసం జీవితాలను త్యాగం చేసిన వైజ్ఞానిక రంగ కార్యకర్తలు మన దేశంలో ఎందరో ఉన్నారు. వారిలో డాక్టర్‌ అమిత్‌సేన్‌ గుప్తా (1958-2018) పేరు తప్పక చెప్పుకోవాలి. తన కృషిని ఈ దేశానికి మాత్రమే పరిమితం చేయకుండా దాన్ని దేశ సరిహద్దులు దాటించిన వాడాయన !
    జన స్వాస్థ్వ అభియాన్‌కు కన్వీనర్‌గా ఉంటూ, అసోసియేట్‌ గ్లోబల్‌ కో ఆర్డినేటర్‌గా ప్రజారోగ్య ఉద్యమానికి ఊపునిచ్చిన వారు. కార్యకర్తగానే కాక, మంచి వక్తగా, సైన్సు రచయితగా గొప్ప స్థాయినందుకున్న వారు. అసలైతే డా|| అమిత్‌ మంచి పేరున్న వైద్యుడు. ఢిల్లీ లోని మౌలానా ఆజాద్‌ వైద్య కళాశాల నుండి పట్టా తీసుకుని, కొన్ని సంవత్సరాలు ప్రయివేట్‌ ప్రాక్టీస్‌ చేశారు. అయితే, దానిలో ఆయనకు సంతృప్తి కలగలేదు. ఒళ్ళు కదలకుండా ప్రాక్టీస్‌ చేసి, డబ్బు సంపాదించుకుని, సుఖంగా జీవించగలిగే అవకాశం ఉండి కూడా, ప్రజల కోసం ఆయన వాటిని వదలుకున్నారు. పూలబాటను వదిలి, ముళ్ళబాటను పట్టారు. జనాన్ని చైతన్య పరచాలనుకున్నారు. ఒక వైద్యుడిగా కొంత మందికి వైద్యం అందించడం కాదు, ఎక్కువ మందిలో అవగాహన పెంచాలన్న ఉద్దేశంతో సైన్సు కార్యకర్తగా మారి, ప్రజా క్షేత్రంలో అడుగుపెట్టారు.
    వైద్య శాస్త్రంలో డిగ్రీ తీసుకుని ప్రాక్టీసు చేస్తున్న దశలోనే ఢిల్లీ లోని సైన్స్‌ ఫోరం (డిఎస్‌ఎఫ్‌) సంస్థాపక సభ్యుడయ్యారు. ఆ తర్వాత 1990ల లోనే ఆల్‌ ఇండియా పీపుల్స్‌ సైన్స్‌ నెట్‌వర్క్‌ (ఏఐపీఎస్‌ఎన్‌) వారి ఉద్యమాలలో పాల్గొనసాగారు. అందులో చురుకుగా పాల్గొంటూనే జన స్వాస్థ్య అభియాన్‌కు రూపకల్పన చేశారు. ఒక డాక్టరు కార్యకర్తగా మారడం వెనక కొన్ని సంస్థలు, కొన్ని సంఘాలు పనిచేశాయి. తర్వాత కాలంలో వాటికి ఆయనే నాయకుడై నడిపించారు. గ్లోబలైజేషన్‌ ప్రభావం వల్ల ప్రజారోగ్యం ఎలా చెడిపోతోంది? అనే అంశం మీద ఆయన విస్తృతంగా ఉపన్యాసాలిచ్చేవారు. అంతే కాదు, ప్రజారోగ్యానికి హాని చేసే మందులు-డ్రగ్స్‌తో జరిగే వ్యాపారాలు ఆగిపోవాలని సుప్రీంకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం వేశారు. ప్రజారోగాన్ని ప్రయివేట్‌ కార్పొరేట్లకు అప్పగించడాన్ని ఆయన తీవ్రంగా నిరసించారు. ప్రజల ఆరోగ్యం - ప్రభుత్వ బాధ్యత - అన్నది ఆయన వాదన !
    ప్రజారోగ్య సమస్యలకు అంతర్జాతీయ వేదికను సమకూర్చి పరిష్కారాల కోసం పోరాడడమన్నది సామాన్యమైన విషయం కాదు. ప్రజారోగ్యమంటే...అందులో సామాజిక, ఆర్థిక, రాజకీయ, పారిశ్రామిక, వాణిజ్య...అంశాలెన్నో ఇమిడి ఉంటాయన్నది డా|| అమిత్‌ సేన్‌ గుప్తా గ్రహించారు. అందుకే విద్య, ఆరోగ్యం, సంక్షేమం వంటి శాఖలు ప్రభుత్వ ఆధీనంలోనే ఉండాలని పోరాడారు. డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ, గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖల సహాయ సహకారాలతో గ్రామీణ పారిశ్రామీకరణ - ప్రజారోగ్యం - సమస్యలు వంటి విషయాలపై ఆయన దృష్టి పెట్టారు. వృత్తిరీత్యా వైద్యుడైనా, ఆయన ఆ పరిధిలోనే ఉండిపోలేదు. సమాజంలోని ఏ వర్గంవారి సమస్యలైనా సరే, వాటి పరిష్కారానికి ఈ డాక్టరు గారు ముందు నిలబడేవారు. అందుకే వ్యవసాయ కార్మికుల ఉద్యమాలకు కూడా నాయకత్వం వహించి ముందు నిలబడిన సందర్భాలున్నాయి.
    క్షేత్ర స్థాయిలో ఉద్యమకారుడిగా పనిచేస్తూనే జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో డాక్టర్‌ అమిత్‌సేన్‌ గుప్తా సదస్సులు నిర్వహిస్తూ ఉండేవారు. 2018లో ఆయన చనిపోవడానికి ముందు చెప్పుకోతగ్గ రెండు అతి పెద్ద సదస్సులు నిర్వహించారు. ఒకటి - ఛత్తీస్‌గఢ్‌-రాయపూర్‌లో 'నేషనల్‌ హెల్త్‌ అసెంబ్లీ''ని సెప్టెంబర్‌లో నిర్వహిస్తే, దానికి దేశంలోని 22 రాష్ట్రాల నుండి 1300 మంది ప్రతినిధులు హాజరయ్యారు. అలాగే నవంబర్‌లో 'పీపుల్స్‌ హెల్త్‌ అసెంబ్లీ'ని ఢాకాలో నిర్వహిస్తే, దానికి 75 దేశాల నుండి 1400 మంది ప్రతినిధులు హాజరయ్యారు. ఆయన తన కార్యక్రమాలన్నింటా యువతకు ఎక్కువ ప్రోత్సాహమిచ్చేవారు. కారణం భవిష్యత్‌ యువతీ యువకులదేనన్నది ఆయన అభిప్రాయం.
    వేదికల మీదైనా, వేదికల కింద మామూలు సంభాషణల్లోనైనా ఎప్పుడూ నవ్వుతూ, ఎంతో ఆశాభావంతో మాట్లాడేవారు అమిత్‌సేన్‌ గుప్తా. ఆయన నవ్వు ముఖం, మాటల్లోని స్థిరత్వం ఎదుటివారిని ఇట్టే ఆకర్షించి ప్రభావితం చేసేదని ఆయనతో కలిసి పనిచేసిన పరిశోధకులు, డాక్టర్లు, సైన్సు కార్యకర్తలు చెప్తుంటారు. ముఖ్యంగా కమ్యూనిటీ మెడిసిన్‌లో ప్రొఫెసరయిన డాక్టర్‌ మోహన్‌రావు చెప్పింది అక్షరాలా నిజమే అయి ఉంటుంది. ఎందుకంటే ఆయనకు డా|| అమిత్‌తో పరిచయం సుమారు 35 ఏళ్లు. దేశ కాల పరిస్థితుల్ని చూసి, ఈ బలవంతపు హిందూత్వ దేశభక్తి గురించి చాలా బాధపడిపోయేవాడినని, దేశం ఏమైపోతుందోనని ఆందోళన పడేవాడినని చెప్తారు డా|| మోహన్‌రావు. అలాంటిది ఆప్తమిత్రుడు డాక్టర్‌ అమిత్‌సేన్‌ గుప్తా మాత్రం హిందూత్వవాదుల మూఢత్వంపై పొట్ట చక్కలయ్యేట్టు నవ్వేవారని, తననూ నవ్వమనేవారనీ చెప్పారు. ఈ అసమర్థుల పాలన ఎక్కువ కాలం కొనసాగదని-దాన్ని మార్చుకోవాలంటే వామపక్షవాదులు, అంబేద్కరిస్టులు, పెరియారిస్టులు, సైన్స్‌ కార్యకర్తలు ఆలోచనా విధానం కలిసే వారంతా ఐకమత్యంతో వివిధ రంగాల్లో నిరంతరం పనిచేస్తూనే ఉండాలని అమిత్‌ సేన్‌ గుప్తా చెపుతుండేవారట! ఆయన రచనల్లో, ఉపన్యాసాలలో, మామూలు సంభాషణల్లో ఒక బలమైన సందేశం ఉండేదని, భవిష్యత్తు పట్ల ఆశాభావం ఉండేదని ఆయన ఓదార్పు మాటలతో తను, తన లాంటి వాళ్ళూ ఎంతో మంది ఊరట పొందేవారని, కొత్త ఉత్సాహంతో పనిచేస్తూ పోయేవారమని చెప్పారు డా|| మోహన్‌రావు.
     అమిత్‌సేన్‌ గుప్తా 1978 నుండి సిపిఐ(ఎం) సభ్యుడిగా ఉన్నారు. 'పీపుల్స్‌ డెమాక్రసీకి 'సైన్స్‌ అండ్‌ డవలప్‌మెంట్‌' శీర్షికన క్రమం తప్పకుండా కాలమ్‌ రాసేవారు. ఇతర పత్రికలకు, అనేక వెబ్‌ మ్యాగజైన్‌లకు కూడా రాసేవారు. మెడిసిన్‌లో డిగ్రీ తీసుకున్న తర్వాత ఆయన తండ్రి ప్రయివేట్‌ ప్రాక్టీస్‌ పెట్టమంటే డాక్టర్‌ అమిత్‌ సైనిక ఫామ్స్‌ దగ్గర్లో ఒక కుగ్రామాన్ని ఎంచుకున్నారు. గ్రామీణ పేదలకు అందాల్సిన వైద్యం గురించి ఆయనకు అప్పటికే ఒక తపన ఉండేది. అనుకున్న విధంగా క్లినిక్‌ ప్రారంభించనైతే ప్రారంభించారు కానీ, అంతటి పేదరికంలో ఉన్న పల్లె జనం దగ్గర ఎంత ఫీజు తీసుకోవాలి? ఎలా తీసుకోవాలి? అని తనలో తాను మదనపడుతుండేవారు. తర్వాత కాలంలో మందుల తయారీ వెనక నడుస్తున్న రాజకీయాల్ని అర్ధం చేసుకుని, కార్యాచరణకు పూనుకున్నారు గనుకనే డాక్టర్‌గా మిగిలిపోక ఉద్యమకారుడయ్యారు. ఆ పనిలో భాగంగానే ఆలిండియా పీపుల్స్‌ సైన్స్‌ నెట్‌వర్క్‌ (ఏఐపీఎస్‌ఎన్‌)కు జనరల్‌ సెక్రటరీ అయ్యారు. జన స్వాస్థ్య అభియాన్‌కు, గ్లోబల్‌ పీపుల్స్‌ హెల్త్‌ మూవ్‌మెంట్‌కు ఆద్యుడయ్యారు. 2003లో ఆసియా సోషల్‌ ఫోరమ్‌ హైదరాబాద్‌లో నెలకొల్పారు. 2004లో వరల్డ్‌ సోషల్‌ ఫోరమ్‌ ముంబైలో ఏర్పాటు చేశారు. ఇంటలెక్చువల్‌ ప్రాపర్టీ రైట్స్‌ (ఐపీఆర్‌)- పేటెంట్‌కు సంబంధించిన చట్టాల గూర్చి కృషి చేశారు. పెట్టుబడిదారీ వ్యతిరేక ఉద్యమాలు లేవనెత్తారు. 1987లో భారత జన విజ్ఞాన జాతా ప్రారంభించారు. 'ఢిల్లీ సాక్షరతా సమితి'ని ఏర్పరచి నిరక్షరాస్యులైన యువకుల్ని, మహిళల్ని అక్షరాస్యులుగా తీర్చిదిద్దారు. బలమైన సంకల్పం, పట్టుదల ఉంటే ప్రతి ఒక్కరు ఎన్నెన్ని పనులు ఎన్నెన్ని రకాలుగా చేయొచ్చో అమిత్‌ సేన్‌ గుప్తా జీవితం నుండి నేర్చుకోవచ్చు. మామూలుగా పత్రికలకు వ్యాసాలు రాసి ప్రచురించడమే కాకుండా... అంత తీరిక లేకుండా గడుపుతూ కూడా, కొంత సమయం పరిశోధనకు కేటాయించేవారు. పరిశోధనా పత్రాలు కూడా ప్రచురిస్తూ ఉండేవారు. అలాంటి ఒక పరిశోధనా పత్రం ఆయన మరణానంతరం అచ్చయ్యింది. ఆయన వ్యాసాలు ఇంటర్నెట్‌లో ఉన్నాయి. వీడియోలు యూ ట్యూబ్‌లో ఉన్నాయి. ఆసక్తిగలవారు వెతుక్కోవచ్చు.
     2018 నవంబర్‌ 28న గోవాలో సముద్ర స్నానానికి వెళ్ళి డాక్టర్‌ అమిత్‌ సేన్‌ గుప్తా నీటిలో మునిగి చనిపోయారు. ఆ విషాదం నుంచి తేరుకుని, ఆయన కుటుంబం చురుకుగా పనిచేసే ఆరోగ్య కార్యకర్తలకు ఫెలోషిప్‌ ప్రకటించింది. జనంలో తిరుగుతూ వారికి వైజ్ఞానిక స్పృహ, ఆరోగ్య స్పృహ- మానవ హక్కుల స్పృహ కలిగించే యువకుడు/యువతికి లక్ష రూపాయలు స్టైఫండ్‌గా ఇవ్వాలని నిర్ణయించారు. గొప్ప ఆలోచన! దేశంలో డబ్బుగల వాళ్ళు చాలా మందే ఉన్నారు. కానీ, ఇలా సమాజానికి ఉపయోగపడే పని చేద్దామన్న స్పృహ మాత్రం చాలా కొద్దిమందికే ఉంటుంది. అలాంటి వారిని దుర్భిణి వేసి వెతుక్కోవాల్సిందే !
 

28న డా|| అమిత్‌సేన్‌ గుప్తా వర్థంతి

/ వ్యాసకర్త: సాహితీవేత్త, జీవ శాస్త్రవేత్త /

డా|| దేవరాజు మహారాజు