Oct 27,2021 22:21

మున్సిపల్‌ కార్యాలయం ఎదుట దీక్ష చేస్తున్న సిఐటియు నాయకులు, కార్మికులు (ఫైల్‌)

ప్రజా ఉద్యమాలు..మూడేళ్ల ప్రస్తానం..!
ప్రజాశక్తి- నెల్లూరు ప్రతినిధి  ప్రజా ఉద్యమాలు నిర్వహించడంలో సిపిఎంది ప్రత్యేక శైలి. మూడేళ్లకు ఒకసారి ఆపార్టీ జిల్లా మహాసభలు నిర్వహిస్తారు. జరిగిన ఉద్యమాలు, ఫలితాలపై చర్చ, భవిష్యత్తు ఉద్యమాలకు రూప కల్పన చేసుకొని అందుకు అనుగుణంగా కార్యచరణ రూపొందించుకుంటున్నారు. 2018 జనవరి 6,7 తేదీల్లో విడవలూరులో సిపిఎం 23వ జిల్లా మహాసభలు ఉత్సాహపూరిత వాతావరణంలో జరుపుకున్నారు. మూడు సంవత్సరాల 10 నెలల తరువాత ఈనెల 30,31న నగరంలోని జెట్టిశేషారెడ్డి విజ్ఞాన కేంద్రంలో సిపిఎం 24వ జిల్లా మహాసభలు జరగనున్నాయి. ఈ సభకు జిల్లా నలుమూలల నుంచి 220 మంది ప్రతినిధులు హాజరుకానున్నారు. ఈ సందర్భంగా ''ప్రజాశక్తి'' ప్రత్యేక కధనం
సింహపురిలో కమ్యూనిస్టు ఉద్యమానికి ప్రత్యేకత ఉంది. ఇక్కడ జరిగిన అనేక సామాజిక, రాజకీయ, ప్రజా ఉద్యమాలను కమ్యూనిస్టులు ముందుడి నడిపించారు. ప్రజా ఉద్యమాలకే పునాదిగా సిపిఎం బలమైన రాజకీయపార్టీగా ఎదిగింది. ఓటు, సీట్లు కాకుండా ప్రజా సమస్యల పరిష్కారమే అజెండాగా ఇప్పటి వరకు పనిచేస్తూ వస్తుంది. ఈ మూడేళ్ల కాలంలో జిల్లాలో సిపిఎం , ప్రజా సంఘాలు నిర్వహించిన ఉద్యమాలను ఒక్కసారి సింహావలోకనం చేసుకుంది. ఈ కాలంలో సిఐటియు ఆధ్వర్యంలో మున్సిపల్‌ కార్మికులు నిర్వహించిన ఉద్యమాన్ని ప్రత్యేకంగా చెప్పుకోవాలి. జిఒ నెంబర్‌ 279 రద్దు చేయాలని కోరుతూ 4సార్లు సమ్మె నిర్వహించారు. అధికారుల బెదిరింపులకు, పోలీసు కేసులకు, జైళ్ల వంటి నిర్బంధాన్ని లెక్క చేయకుండా ముందుకు సాగారు. 45 రోజులు మిలిటెంట్‌ పోరాటం చేశారు. నాయకులపై 12 కేసులు పెట్టారు. కృష్ణపట్నం పోర్టు కార్మికులు ఉద్యమం. కార్మికులకు పని భద్రత, బకాయిలు చెల్లించాలని 9 నెలలు సుదీర్ఘ పోరాటం నిర్వహించారు. పోర్టు ఏర్పడిన తరువాత ఇంతటి ఉద్యమం జరగడం ఇదే. కార్మికుల్లో మంచి గుర్తింపు వచ్చింది. నెల్లూరు కార్పొరేషన్‌ పరిధిలో రైల్వే స్థలాల్లో ఇళ్లను తొలగించిన సందర్భంలో అనేక పోరాటాలు నిర్వహించారు. సిపిఎం రాష్ట్ర కార్యదర్శి పి.మధు వచ్చి సంఘీభావం తెలిపారు. ప్రజల విశ్వాసం పొందారు. నెల్లూరు నగరంలో నిర్మించిన ఇళ్లను లబ్ధిదారులకు అప్పగించాలని కోరుతూ దశల వారీగా పెద్ద పోరాటాలు నిర్వహించారు. ఇప్పటికీ నిర్వహిస్తున్నారు. దొడ్డిదారిన ఇంటి పన్నులు పెంపుదల జిఒను వ్యతిరేకంగా సచివాలయాల వద్ద దీర్ఘకాల పోరాటం చేశారు. ఇటీవల విద్యుత్‌ ట్రూఆఫ్‌ ఛార్జీలకు వ్యతిరేకంగా విసృత ప్రచారం నిర్వహించారు. రైతు సంఘం, వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో జిల్లా రైతాంగానికి మద్దతు ధర కల్పించాలని కోరుతూ దశల వారీగా ఆందోళనలు నిర్వహించారు. ఎన్‌ఆర్‌సి,కి వ్యతిరేకంగా జరిగిన ఉద్యమంలో సిపిఎం ఆగ్రభాగాన నిలిచింది. కేంద్ర ప్రభుత్వం మత విద్వేషాలు సృష్టించడానికి ఎన్‌ఆర్‌సి తీసుకొస్తే దానికి వ్యతిరేకంగా భారీ బహిరంగ సభలు ఏర్పాటుచేసి, కేంద్ర ప్రభుత్వ విధానాలను ఎండగట్టారు. కులవివక్ష పోరాట కమిటీ ఆధ్వర్యంలో జిల్లాలో దళితులపై దాడులు జరిగిన సమయంలో వారికి అండగా నిలిచారు. కరోనా సమయంలో వైద్య సిబ్బందికి పోరాటానికి అండగా నిలిచారు. నెల్లూరు నగరంలో సర్వేపల్లి కాలువ కాంక్రీట్‌ పనుల వల్ల తూర్పు ప్రాంత నెల్లూరు ప్రజలకు జరిగే నష్టాన్ని అధికారుల దృష్టికి తీసుకెళ్లడంతోపాటు, ప్రజలను చైతన్యం చేశారు. ఫలితంగా ఉద్యమానికి తలొగ్గి అధికారులు చర్యలు తీసుకున్నారు. చంద్ర పడియ కెమికల్‌ ఫ్యాక్టరీ ఘటన విషయంలో మృతి చెందిన కార్మిక కుటుంబాలకు అండగా నిలబడ్డారు. కార్మికులకు ధైర్యం చెప్పి వారి తరుపున పోరాటం నిర్వహించారు. ఆటో కార్మికులు సమస్యలపై అనేకపోరాటాలు జరిగాయి. విఆర్‌ఎ సమస్యల పరిష్కారం కోసం పనిచేశారు. ప్రధానంగా జిల్లాలోని భూ సమస్యలపైనా పోరాటాలు కొనసాగుతున్నాయి. దళితుల భూముల ఆక్రమణ జరిగిన ప్రతి చోట పార్టీ, ప్రజా సంఘాలు దళితులు అండగా నిలిచారు. అందులో ప్రధానమైనది సంగం మండలం, అన్నారెడ్డిపాళెంలో భూ సమస్య కీలకమైంది. పొగాకు రైతుల సమస్యపై గత మూడేళ్ల నుంచి మర్రిపాడు కేంద్రంగా మద్దతు ధర కోసం పోరాటం సాగుతోంది. చుక్కల భూములు 1.50 లక్షల ఎకరాలున్నాయి. వీటిపై 2018 నుంచి దశల వారీగా పోరాటం సాగుతోంది. 2018 అక్టోబర్‌లో ఆత్మకూరు నుంచి నెల్లూరు వరకు పాదయాత్ర నిర్వహించారు. కోవూరు చెక్కర పరిశ్రమపై తొలి నుంచి సిపిఎం అలుపెరగని పోరాటం నిర్వహిస్తుంది. రైతు సంఘం వివిధ రూపాల్లో ఆందోళన చేస్తుంది. జిల్లాలోని ప్రజా సమస్యలు, వివిధ రంగాల కార్మికులు, మహిళల సమస్యపై సిపిఎం, అనుబంధ ప్రజా సంఘాలు నిరంతరం పోరాటాల బాట సాగుతున్నారు. తామున్నామంటూ భరోసా కల్పిస్తున్నారు.
ఉద్యమాలకు సంఘీభావం..!
జిల్లాలోని అనేక ఉద్యమాలు నిర్వహిస్తూనే జాతీయ, రాష్ట్రస్థాయిలో జరిగే ఉద్యమాలకు సంఘీభావంగా నిలుస్తున్నారు. ఢిల్లీలో జరుగుతోన్న రైతాంగం నల్ల చట్టాల వ్యతిరేక పోరాటం జిల్లాలోని పెద్ద ఎత్తన సంఘీభావం తెలిపారు. అనేక సార్లు పెద్ద ఎత్తున నిరసనలు తెలిపారు. బంద్‌ను విజయవంతం చేశారు. ఎన్‌ఆర్‌సి, సిఎఎకు వ్యతిరేకంగా జరిగిన పోరాటంలోనూ జిల్లాలో సిపిఎం ముందుండి నడిపించింది. ఇతర పార్టీలను కలుపుకొని బిజెపి విధానాలకు ఎండగట్టింది. ప్రజా ఉద్యమాలకే ప్రజా పునాదిగా సిపిఎం మూడేళ్ల కాలంలో అనేకపోరాటాలు నిర్వహించి ప్రజల మన్ననలు పొందింది. తమకు కష్టమొస్త్తే ఎర్రజెండా అండగా ఉంటుందనే భరోసా కల్పించింది. ఈనెల 30,31న జరిగే మహాసభల్లో ప్రజా సమస్యలు చర్చించి, ఉద్యమాలకు రూపకల్పన చేయాలని ప్రజలు ఆశిస్తున్నారు.