Nov 27,2020 10:13

గ్రేటర్‌ హైదరాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ ఎన్నికల్లో ప్రజలను చీల్చి లబ్ధి పొందేందుకు బిజెపి, ఎంఐఎం విద్వేషాన్ని రెచ్చగొట్టడం దారుణం. బిజెపి అగ్రనేతలంతా మైనార్టీలను, పాత బస్తీని లక్ష్యంగా చేసుకుని చెలరేగుతుంటే దానికి ప్రతిగా మజ్లిస్‌ నాయకులు మరింత రెచ్చగొట్టేలా వ్యవహరిస్తున్నారు. విద్వేష ప్రచారం మూలంగా ప్రజల మౌలిక సమస్యలు, అభివృద్ధి అంశాలకు తావు లేకుండా పోతోంది. పరస్పరం రెచ్చగొట్టుకునే ప్రచారాల ఫలితంగా ప్రజల మధ్య తరతరాలుగా కొనసాగుతున్న సౌహార్ధత ఛిద్రమవుతుంది. నాలుగు దశాబ్దాల క్రితం వరకు మత కల్లోలాలకు ఆలవాలంగా నిలిచిన భాగ్యనగరం ఈ కాలంలో సామరస్య పూరిత వాతావరణం నెలకొంది. ప్రజల ప్రశాంత జీవనానికి తూట్లు పొడవాలని, తద్వారా తమ ప్రయోజనాలు నెరవేర్చుకోవాలనీ మతతత్వ శక్తులు కుట్రలు పన్నుతున్నాయి. విద్వేష వ్యూహాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి.


పాతబస్తీలో పాకిస్తానీయలు, రోహింగ్యాలు ఉన్నారని, గెలిస్తే ఆ ప్రాంతంపై సర్జికల్‌ స్ట్రైక్‌ చేస్తామంటూ బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజరు రెండు రోజుల క్రితం చేసిన విద్వేష వ్యాఖ్యలకు కొనసాగింపుగా బుధవారం నగరంలో ప్రచారం చేసిన కేంద్రమంత్రి స్మృతి ఇరానీ రోహింగ్యాలకు, అక్రమ చొరబాటుదార్లకు పాతబస్తీలో ఓటుహక్కు ఉందని చెప్పడం మంటను మరింత ఎగదొయ్యడమే! దేశానికి రెండో రాజధాని వంటి నగరంగా చెప్పబడే హైదరాబాద్‌పై సర్జికల్‌ స్ట్రైక్‌ చేస్తామని ఒక ఎం.పి, కేంద్రంలో అధికారం వెలగబెడుతున్న పార్టీకి రాష్ట్ర అధ్యక్షునిగా వున్న పెద్దమనిషి ఎలా అంటాడు? ఆయనకు ఇంగితం లేకపోతే సరిదిద్దవలసిన కేంద్ర మంత్రి మరింత విద్వేష పూరితంగా ఎలా మాట్లాడగలరు? సర్జికల్‌ స్ట్రైక్స్‌ అంటూ చేస్తే అవి శత్రు భూభాగం పైనే అన్న విషయం ఆ ఎం.పి కి తెలియదా? రోహింగ్యాలు లేదా పాకిస్తానీయులు అక్రమంగా దేశంలోకి చొరబడితే దాన్ని అదుపు చేయవలసింది కేంద్ర ప్రభుత్వమేననీ, మంత్రిగా తనకూ బాధ్యత వుందన్న విషయం తెలియనంత అమాయకురాలా స్మృతీ ఇరానీ? ఎంత మాత్రమూ కాదు. వారిద్దరికీ ఈ రాజ్యాంగబద్ధ అంశాలు తెలుసు కానీ జనాన్ని రెచ్చగొట్టడానికి అలా మాట్లాడారన్నది విదితం. హుస్సేన్‌ సాగర్‌ ఒడ్డున ఉన్న ఎన్‌టిఆర్‌ ఘాట్‌, పి.వి ఘాట్ల గురించి ఎంఐఎం శాసనసభ పక్షనేత అక్బరుద్దీన్‌ ఒవైసీ చేసిన అనుచిత వ్యాఖ్యలు మరో దుమారానికి దారి తీశాయి. దశాబ్దాల పర్యంతంగా వున్న ఆ స్మారక కేంద్రాలపై ఇప్పుడు వివాదం రేపడం అర్ధరహితం. వివిధ ఎన్నికల ప్రచారాల్లో విద్వేష ప్రసంగాలు చేసిన చరిత్రగల యోగి ఆదిత్యనాథ్‌, జె.పి నడ్డా, అమిత్‌ షా వంటి వారంతా భాగ్యనగర పర్యటనకు వస్తున్నారు. ఇంకెంత రెచ్చగొడతారోనని లౌకిక శక్తులు ఆందోళన పడుతున్నాయి.


ఇదిలా వుండగా ప్రార్ధనా మందిరాల వద్ద వికృత చేష్టలకు పన్నాగం పన్నుతున్నారనీ, ఎన్నికలను వాయిదా వేయించేందుకు వారి ఎత్తుగడ అని సాక్షాత్తూ తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు పోలీసు ఉన్నతాధికార్ల సమీక్షలో పేర్కొనడం ఆందోళన కలిగిస్తోంది. అదే నిజమైతే ఆ కుట్రను ఛేదించి, దోషులను శిక్షించాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానిదే. ధ్వంసరచన చేసిన వారెంతటి వారైనా వారికి అరదండాలు వేసి కటకటాల వెనక్కు నెట్టాల్సిందే. ఆ పని చేయడానికి వెనుకాడకుండా రాష్ట్ర ప్రభుత్వం నిక్కచ్చిగా వ్యవహరించాలి. కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలపై రుద్దుతున్న పట్టణ సంస్కరణల మలి దశలో ప్రజలపై పడనున్న పెను భారాల నుండి ప్రజల దృష్టిని మళ్లించడానికి ఈ విద్వేష రాజకీయాలు ముందుకొచ్చాయని ఓటర్లు గ్రహించాలి. దానికి తోడు పేదల గృహ నిర్మాణం, త్రాగునీరు, డ్రైనేజి, వాహన రద్దీ, కాలుష్యం వంటి పౌర సమస్యలేవీ చర్చకు రాకుండా పోయాయి. అందుకే విద్వేష వ్యూహాలను రచించే మతతత్వ శక్తులను తిరస్కరించాలి. నిరంతరం ప్రజల సమస్యల పరిష్కారానికి పోరాడే వామపక్ష, అభ్యుదయ శక్తులను బలపర్చాలి.