Feb 24,2021 00:25

టోకూరు గ్రామం

ప్రజాశక్తి-విశాఖపట్నం ప్రతినిధి
సమస్య పరిష్కారమయ్యే వరకు సిపిఎం సాగించిన ప్రజాపోరాటాలకు టోకూరు ఓటర్లు పంచాయతీ ఎన్నికల్లో పట్టం కట్టారు. కాంగ్రెస్‌, టిడిపికి కంచుకోటగావున్న అనంతగిరి మండలం టోకూరు పంచాయతీలో సిపిఎం మండల కార్యదర్శి కిల్లో మొసియను సర్పంచ్‌గా గెలిపించారు. టోకూరు పంచాయతీలో 21 ఆవాసాలున్నాయి. వీటిలో ఏ గ్రామాలకూ రహదారి సౌకర్యం లేదు. బగ్‌మారువలస, పిసాగూడ, బొరిబొరి, కుమ్మరివలసలో గిరిజనులకు తారునీరులేక బావులు, గెడ్డనీటిని తాగుతూ వ్యాధులబారిన పడుతుండేవారు. అంతర్గత రోడ్లులేక వర్షం పడితే వీధులు బురదగా వుండేవి. పంచాయతీ ఆవిర్భావం నుంచి సర్పంచ్‌ పదవులు అలంకరించడం తప్ప గిరిజనులు పడుతున్న బాధలు కాంగ్రెస్‌, టిడిపికి పట్టలేదు. గిరిజనులు అనారోగ్యంతో బాధపడుతున్నా వారి గుండె చలించలేదు. ప్రజల బాధపట్టని పార్టీ మద్దతుదారుల కంటే ప్రజలను అంటిపెట్టుకొని ప్రజా సమస్యలపై పనిచేస్తున్న మొసియను సర్పంచ్‌గా గెలిపించుకున్నారు. టోకూరు పంచాయతీలో 1443 ఓట్లలో సిపిఎం మద్దతుదారు మొసియకు 527 ఓట్లురాగా, టిడిపి మద్దతుదారు చంద్రరావుకు 182 ఓట్లొచ్చాయి. ఇతర పంచాయతీల్లో వైసిపి గాలి ఎంత తీవ్రంగా వీచినా, టోకూరులో మాత్రం వైసిపి మద్దతుదారు అప్పన్నకు దరావత్తు కూడా రాలేదు. 69 ఓట్లతో అప్పన్న సరిపెట్టుకోవాల్సివచ్చింది.
ప్రజా సమస్యలపై నిరంతర పోరాటం
తాగునీటి సౌకర్యం కల్పించాలని సుదీర్ఘకాలంగా సిపిఎం పోరాటం నిర్వహిస్తున్నది. ఆ పోరాట ఫలితంగా రూ.8 లక్షల నిధులతో బగ్‌మారువలసలో 30 కుటుంబాలకు ఇంటింటికి కుళాయి సౌకర్యం కలిగింది. పిసాగూడలో రూ.8 లక్షలతో 36 కుటుంబాలకు, బొరిబొరివలసలో రూ.23 లక్షలతో 40 కుటుంబాలకు, కుమ్మరివలసలో రూ.3 లక్షలతో 12 కుటుంబాలకు తాగునీరు సరఫరా చేసేలా పోరాటం కొనసాగించింది. దొరగుడ, బల్లెగుడ, కొత్తవలస, చిట్టింపాడు, నందనపురం, కంబవలసలో పోడు వ్యవసాయం చేస్తున్న గిరిజనులకు అటవీ హక్కుల చట్టం కింద పట్టాలు మంజూరు చేసి, పట్టాదార్‌ పాస్‌పుస్తకాలు అందజేయాలన్న పోరాటం ద్వారా రెండోదశల్లో 111 మంది లబ్ధిపొందారు. 18 గ్రామాల్లో సిమెంట్‌ రోడ్లు వేయించగలిగింది.
వ్యాధులతో బాధపడుతున్న గిరిజనులను ఎవరూ పట్టించుకోని పరిస్థితుల్లో శారదట్రస్ట్‌, గిరిజన సంఘం నేతృత్వంలో ములియగుడలో రెండుసార్లు ఉచిత వైద్య శిబిరాలు సిపిఎం ఏర్పాటు చేసింది. స్థానిక గిరిజన సమస్యలపై పనిచేస్తూనే 1/70 అమలు కోసం గిరిజనుల పక్షాన పోరాడుతోంది. పదవి, అధికారం లేకపోయినా గిరిజనుల పక్షానవుంటూ పనిచేస్తున్న సిపిఎంను టోకూరు ప్రజలు గుర్తించారు. ఇటీవల జరిగిన పంచాయతీ ఎన్నికల్లో సిపిఎం మద్దతుదారైన మొసియను సర్పంచ్‌గా గెలిపించారు.
సమస్యలపై ప్రత్యేక దృష్టి
టోకూరు, పీసాగూడ, మొలియగుడలో కాలువలు నిర్మాణం చేపట్టాలి. బోడగుడలో తాగునీటి సౌకర్యం కల్పించాలి. రహదారిలేని గ్రామాలకు రోడ్డు సౌకర్యం కల్పించాలి. నందనపురం కొత్తవలస రోడ్‌ ఏర్పాటు చేయాలి. పారిశుద్ధ సమస్యపై ప్రత్యేక దృష్టి పెట్టి, పర్యావరణ పరిరక్షణలో భాగంగా మొక్కలు పెంచి గ్రీన్‌ టోకూరుగా తీర్చిదిద్దాలి. ఈ సమస్యలపై ప్రత్యేకంగా దృష్టి సారిస్తాను.
- కిల్లో మొసియ, టోకూరు సర్పంచ్‌