Mar 02,2021 23:01

బియ్యం పంపిణీని పరిశీలిస్తున్న శశిధర్‌

ప్రజాశక్తి - శ్రీకాకుళం అర్బన్‌ / ఆమదాలవలస : నిత్యావసర సరుకుల పంపిణీలో ఎదురవుతున్న లోపాలను త్వరలోనే పరిష్కరిస్తామని పౌర సరఫరాల శాఖ కమిషనర్‌ కోన శశిధర్‌ అన్నారు. జిల్లా పర్యటనలో భాగంగా ఆమదాలవలసలోని వెంగళరావునగర్‌, కొర్లకోట, శ్రీకాకుళం నగరంలోని రెల్లవీధిలో బియ్యం పంపిణీని మంగళవారం ఆయన పరిశీలించారు. అనంతరం కలెక్టరేట్‌లో జిల్లా ఉన్నతాధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బియ్యం పంపిణీ వాహనాల రాకను ముందుగా ప్రజలకు తెలియజేయాలని సూచించారు. జిల్లాలో పైలట్‌ ప్రాజెక్టుగా చేపట్టిన బియ్యం పంపిణీని ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా చేపట్టినట్లు తెలిపారు. ప్రస్తుతం కొత్త ఫార్మాట్‌లో చేపట్టిన దాన్ని వివరించాలని సూచించారు. గతంలో ప్యాకెట్ల రూపం నుంచి మార్పు చేసి తూనిక వేసి అందించనున్నట్లు తెలిపారు. తద్వారా నాణ్యతను ప్రత్యక్షంగా ప్రజలు పరిశీలించేందుకు వీలవుతుందన్నారు. గతంలో కొన్నిచోట్ల ప్యాకెట్లను పక్క ఇంట్లో, ఇతర ప్రదేశాల్లో పెట్టేవారని, తర్వాత బయోమెట్రిక్‌ తీసుకునేవారని చెప్పారు. ప్రస్తుతం అందుకు అవకాశం లేదని, వాహనం ఉన్నప్పుడే రేషన్‌ తీసుకోవాలని స్పష్టం చేశారు. వాలంటీర్లు క్రియాశీలకంగా ఉన్న చోట్ల పంపిణీ సక్రమంగా నిర్వహిస్తున్నారని చెప్పారు. రాష్ట్రంలో ఎక్కడైనా రేషన్‌ను తీసుకోవచ్చన్నారు. కొండ తదితర ప్రాంతాల్లో వాహనాలను సాధ్యమైనంత దగ్గరగా గ్రామాలకు తీసుకెళ్లాలని ఆదేశించారు. సక్రమంగా చేస్తే 15 రోజుల్లో సరుకులు అందించడం పూర్తి చేయొచ్చని చెప్పారు. ఏప్రిల్‌ ఒకటో తేదీ నుండి అన్ని వాహనాలు ఒకసారి పంపిణీ ప్రారంభించడానికి చర్యలు చేపట్టాలని సూచించారు. దుకాణాలు రేషనలైజేషన్‌ చేయాలని, ఆసక్తి లేని వాహనదారులను మార్చవచ్చని తెలిపారు. నిత్యావసర సరుకుల పంపిణీలో వాలంటీర్లు, ఆపరేటర్లకు ఉన్న సమస్యలను అడిగి తెలుసుకున్న ఆయన కొత్త పథకాలు అమలయ్యే సమయంలో చిన్న చిన్న సమస్యలు తలెత్తడం సహజమని, వాటిని త్వరలోనే పరిష్కరిస్తామని ఆయన చెప్పారు. సెల్‌ఫోన్లు కావాలని కోరారని, వాటిపై త్వరలోనే చర్చించి నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. ఐటిడిఎ పిఒ సిహెచ్‌.శ్రీధర్‌ మాట్లాడుతూ గిరిజన ప్రాంతాల్లో ఇంధన ఖర్చు రూ.వెయ్యి వరకు పెంచాల్సిన అవసరం ఉందన్నారు. సమావేశంలో కలెక్టర్‌ జె.నివాస్‌, జాయింట్‌ కలెక్టర్‌ సుమిత్‌ కుమార్‌, సబ్‌ కలెక్టర్‌ సూరజ్‌ ధనుంజరు, సహాయ కలెక్టర్‌ ఎం.నవీన్‌, ఆర్‌డిఒలు ఐ.కిశోర్‌, టి.వి.ఎస్‌.జి కుమార్‌, డిఎస్‌ఒ డి.వి రమణ, పౌరసరఫరాల సంస్థ డిఎం ఎన్‌.నరేంద్రబాబు, విజిలెన్స్‌ అధికారి శైలజ తదితరులు పాల్గొన్నారు.