Nov 21,2020 20:00

అతి సాధారణ పదాలను పదునైన బాణాల్లా ప్రయోగించే అక్షరయోధుడు తను. జర్నలిజానికి కవిత్వపు సోయగాన్ని అద్దాడు. కవిత్వానికి సామాజిక బాధ్యతను పొదిగాడు. అతడు ప్రసిద్ధ కవీ, పాత్రికేయుడూ, సంపాదకుడూ దేవిప్రియ. 1945 ఆగస్టు 15న పుట్టి... 2020 నవంబరు 21న కన్నుమూసిన ఒక తరపు సాహితీ శిఖరం.
         దేవిప్రియ.. పరిచయ వాక్యాలు అక్కర్లేని పేరు. తెలుగు సాహిత్యంలో, తెలుగు జర్నలిజంలో కొత్తదనం గురించి రాయాల్సి వచ్చినప్పుడు మస్తిష్కంలో వెలుతురు పిట్టలా రెక్కలల్లార్చే పేరు. మూడు దశాబ్దాలకు పైగా కవిగా, జర్నలిస్టుగా సాహిత్య, పత్రికా రంగాలను ప్రభావితం చేసిన బహుముఖ ప్రజ్ఞాశాలి కలం పేరు దేవిప్రియ. ఆయన అక్షర ప్రవాహాల్ని సృష్టించే నీటిపుట్ట... తెలుగు పదాలను ప్రేమగా పొదివి పట్టుకుని ఆకాశ వీధుల్లోకి పావురాలుగా వదిలే అమ్మచెట్టు. వర్తమాన సమాజానికి రన్నింగ్‌ కామెంటరీ.

ప్రజా పాత్రికేయుడు .. సదా కవిత్వ ప్రియుడు ...
ఇరవై ఏళ్లకే కవీ, జర్నలిస్టూ ...
         గుంటూరు జిల్లా తాడికొండ నుంచి ఎగుడు దిగుడుల దారిలో ఆయన ప్రయాణం మొదలైంది. 1962లో కథా రచయితగా తన సాహితీయానం ప్రారంభించారు. కథలు, డిటెక్టివ్‌ నవలలు, జానపదాలు, వృత్తాలు, మాత్రా ఛందస్సు ... ఇలా తనకు నచ్చిన ప్రతి ప్రక్రియలో ప్రయత్నించి.. అక్షరాల మధ్యే ఈ జీవితం అనుకుంటూ పెరిగారు దేవిప్రియ. డాక్టర్‌ సి.నారాయణరెడ్డి రచించిన కర్పూర వసంతరాయలు చదివి.. ఆ ప్రేరణతో ఆయన వనజారాయలు అనే పద్య కావ్యాన్ని రచించారు. కాలేజీ చదువులతో కుస్తీ పడుతూనే మరోవంక గుంటూరు న్యూస్‌, స్వతంత్ర ప్రదేశ్‌, తెలుగు సీమ వంటి పత్రికల్లో పనిచేశారు. అలా ఇరవయ్యేళ్ల వయసులోనే సాహిత్యం, జర్నలిజాలనే రెండు పట్టాల మీద ప్రయాణం సాగించారు. మిత్రుడు ఎం.కె.సుగమ్‌బాబుతో కలసి విప్లవం సంకలనంలో ఓ కవిత రాశారు. ఆ తరువాత కంచికచర్లలో ఓ దళిత యువకుడి సజీవ దహనం సంఘటనకు కకావికలమై రాసిన 'జ్వాల' అనే సుదీర్ఘ కవితతో రాజకీయ కవిగా తెర ముందుకు వచ్చారు. మూడున్నర దశాబ్దాల కిందట సఅజన పత్రికలో దేవిప్రియ ప్రచురించిన కవితలు, అమరవీరుల సంస్మరణ గీతాలు... అడవి/ నువ్వంటే నాకిష్టం అని నినదించిన దేవిప్రియ వామపక్ష ఉద్యమ పునాదుల మీదే తన సాహితీ భువనాన్ని నిర్మించుకున్నారు. కానీ, కవిత్వంలో ఎక్కడా నినాదప్రాయంగానో, ఉత్త వచనంలానో తేలిపోయిన దాఖలాలు లేవు. కవిత్వ వ్యూహ నిర్మాణ రహస్యాలు బాగా తెలిసినవాడు ఆయన. రాజకీయ కవిత్వాన్ని వైయక్తిక పరివేదనగా మలచడంలో విజయం సాధించారు. గాయకుడు గద్దర్‌కు ప్రతీకగా తుపాను తుమ్మెద పదబంధాన్ని సంధించినప్పుడు కూడా రాజకీయ తాత్వికతను కవిత్వం చేయడంలోని ఆ నైపుణ్యమే స్ఫురిస్తుంది. కవిత్వాన్ని శుద్ధ సామాజిక విశ్లేషణ సాధనంగానే కాకుండా సౌందర్యాత్మక దఅష్టిని, భాష మీది మమకారాన్ని, హఅదయ సంస్పదనల్ని విస్మరించలేని మానవీయ బలహీనతలకు వాహికగా మార్చుకున్నాడాయన. అందుకనే దేవిప్రియ కవిత్వం నిత్యవసంతం. ఈ పైగంబర కవి నిలువ నీరులాగా ఎన్నడూ లేడు. నిరంతర ప్రవాహంలా కొత్త ఆకాశాన్ని ప్రతిఫలిస్తూ.. వినూత్న పరీవాహక ప్రాంతాల్ని సఅష్టించాడు. అమ్మచెట్టు, నీటిపుట్ట, తుపాను తుమ్మెద, పిట్ట కూడా ఎగిరిపోవలసిందే, చేపచిలుక.. ఇటీవలే వచ్చిన గంధకుటి సంపుటాలు అందుకు ప్రత్యక్షర నిదర్శనం.

ప్రజా పాత్రికేయుడు .. సదా కవిత్వ ప్రియుడు ...
మూడు దశాబ్దాల రన్నింగ్‌ కామెంటరీ
            జర్నలిస్టుగా దేవిప్రియను రన్నింగ్‌ కామెంటరీ ఎంతో ప్రభావం చూపించిందికాయన శీర్షిక కోసమే పత్రికను చదివే పాఠకులు కూడా ఉండేవారంటే ా ఆ శీర్షిక ఎంత సూపర్‌హిట్టో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. ఆంధ్రప్రభ, ఆంధ్రజ్యోతి, ఉదయం, ఇటీవలి హైదరాబాద్‌ మిర్రర్‌ వరకూ ఆయన రన్నింగ్‌ కామెంటరీ సాగుతూనే వచ్చింది. అప్పటి రాష్ట్రపతి శంకరదయాళ్‌ శర్మ పలుమార్లు గుళ్లు దర్శిస్తూంటే.. బాబాలకు బహిరంగ వేదికలలోనూ మొక్కుతుంటేా ''కనిపించిన రాయికల్ల/ మొక్కుతుంటే ప్రభువులు/ ప్రజలకెలా తొలగుతాయి/ అజ్ఞానపు పొరలు..'' అని రాశారు దేవీప్రియ. కమ్యూనిస్టు మహానాయకుడు సుందరయ్య చనిపోయినప్పుడు ఆయన రాసిన రన్నింగ్‌ కామెంటరీ ఎంతో ప్రసిద్ధి చెందింది. ''నిరంతరం ప్రజల మేలు / కోరుకున్న సుందరయ్య / నీ లాగా నిప్పులాటి / నేతలు మా కెందరయ్యా../ సోషలిజం ఈ దేశపు / బిడ్డల తల నిమిరినపుడు../ ఎర్రబడిన ఏ మబ్బుల రధం/ మీదో వచ్చి చూడు ...'' అంటూ రాసిన వాఖ్యానం ఆరోజున రాష్ట్ర ప్రజల మనోగతానికి అద్దం పట్టింది. ఈ శీర్షిక వివిధ పత్రికల్లో మూడు దశాబ్దాల పాటు నడిచింది. కాలపరీక్షకు నిలిచే వ్యాఖ్యానాలతో మూడు సంపుటాలుగా వెలువడింది.
టీవీ రంగంలోనూ అనేక ప్రయోగాలు
        ఇక దృశ్య మాధ్యమంలో దేవిప్రియ చేసిన ప్రయోగాలు అనేకం. ప్రముఖ పాత్రికేయులు కె.రామచంద్రమూర్తి అన్నట్లు దేవిప్రియ జర్నలిస్టులు చేయలేని చాలా పనులను చేయగలరు. కవులకు సాధ్యం కాని ఘనకార్యాలెన్నింటినో సాధించగలరు. జెమిని టెలివిజన్లో ప్రసారమైన తొలి తెలుగు వ్యాపార విషయాల కార్యక్రమం 'బిజినెస్‌ ట్రాక్‌'కు ఆయన వంద వారాలు స్క్రిప్టు రాసిచ్చారు. సిటీ కేబుల్‌లో 'దేవిప్రియాస్‌ ఎలక్షన్‌ షో-1999' రూపొందించారు. తెలుగు సినిమాకు అంతర్జాతీయ ఖ్యాతి తెచ్చి పెట్టిన మాభూమి చిత్రానికి తెర వెనుక కీలక పాత్రధారుల్లో దేవిప్రియ ఒకరు. రంగులకల చిత్రంలో 'జమ్‌ జమ్మల మర్రీ వెయ్యి కాళ్ళా జర్రీ..' అనే జనగీతంతో తెలుగు హృదయాల్లో ఢమరుకంగా మోగుతూనే ఉంటుంది. ప్రజా గాయకుడు గద్దర్‌ను అంతర్జాతీయ సమాజానికి పరిచయం చేసేందుకు 'ది మ్యూజిక్‌ ఆఫ్‌ ఎ బ్యాటిల్‌ షిప్‌' అనే 96 నిమిషాల డాక్యుమెంటరీని దేవీప్రియ స్వీయ దర్శకత్వంలో నిర్మించారు. ఇంకా.. ఎన్నో సినిమాలకు పాటలు రాశారు. ఇన్ని భిన్న కోణాల్లో సృజన ప్రవాహంలా చెలరేగిన దేవిప్రియ ప్రభావం తెలుగు సాహిత్యంలో, పాత్రికేయలోకంలో ఒక ప్రత్యేక అధ్యాయంగా ఉంటుంది. తనకు తానుగా ప్రకటించుకున్న ఈ కింది అక్షర అజెండా ఇప్పుడైనా, ఎప్పుడైనా ఏ ప్రజాపక్ష కవికైనా, పాత్రికేయులకైనా వర్తిస్తుంది.
''నాకు రెండు నిధులున్నాయి
నాలుక మీద కవిత్వం
తలమీద దారిద్రం!
నాకు రెండు విధులున్నాయి
కవిత్వం నిత్య నిబద్ధం
దారిద్ర విముక్తి యుద్ధం''
ఈ విధులను తలకెత్తుకొని నడవటమే దేవీప్రియకు అసలు సిసలు నివాళి.

                                                                                                            - జీవన డెస్క్‌