Apr 08,2021 20:02

గ్రేటర్‌ విశాఖ బ్యూరో : దేశంలోనే పురాతన విశ్వవిద్యాలయాల్లో ఒకటైన, 95 ఏళ్ల క్రితం ఏర్పాటైన ఆంధ్ర విశ్వకళాపరిషత్‌ (ఎయు)ను గడిచిన కొన్నాళ్లుగా అధ్యాపకుల, పరిశోధనా పండితుల కొరత పీడిస్తోంది. అధ్యాపకుల రిక్రూట్‌మెంట్‌ ఏళ్ల తరబడి జరగక కునారిల్లుతోంది. యూనివర్సిటీలో ప్రస్తుతం 660 ఖాళీలు ఉన్నాయని స్వయంగా ఎయు వైస్‌ ఛాన్సలర్‌ జివిడి ప్రసాదరెడ్డి తాజాగా వెల్లడించారు. దేశంలోని రీసెర్చి ఆలయాల్లో ఎయు 19వ స్థానంలో ఉంది. మన రాష్ట్రంలోని నాగార్జున, శ్రీవెంకటేశ్వర యూనివర్సిటీలతో పోల్చితే ఒకటో స్థానంలో ఉన్నా, ఫ్యాకల్టీల కొరతతో భవిష్యత్తు అగమ్యగోచరంగా ఉంది. ఇప్పటికే ఎయు అనుబంధ కళాశాలలకు సిలబస్‌ సెట్‌ చేయడం, పరీక్షా పత్రాలను తయారు చేయడం వంటి విషయాల్లో ఎయులో ఫ్యాకల్టీల కొరత కొట్టచ్చినట్టు కనిపిస్తోంది. ఆంధ్రా యూనివర్సిటీలో మొత్తం శాంక్షన్డ్‌ పోస్టులు 936కుగానూ ప్రస్తుతం 200 మందిలోపే అధ్యాపకులు ఉన్నారు. 2018లో 480 ఖాళీలు ఉండగా క్రమంగా ఆ సంఖ్య పెరుగుతూ వచ్చింది. అదే పరిస్థితి కొనసాగితే 2023 సంవత్సరం నాటికి 70 నుంచి 80 మంది మాత్రమే అధ్యాపకులు మిగులుతారు. త్వరలో నోటిఫికేషన్‌ ఇచ్చి భర్తీ జరగకపోతే ఎయు విశ్వవిద్యాలయం ఉన్నా ఒకటే, లేకపోయినా ఒక్కటేనంటూ విద్యార్థులు వాపోతున్నారు. ఆర్ట్స్‌, సైన్స్‌, కామర్స్‌ గ్రూపుల్లో దాదాపు 15 వేల మంది విద్యార్థులు ఉన్నారు. అర్థశాస్త్రంలో 26 మంది అధ్యాపకులుండాల్సి ఉండగా, కేవలం నలుగురే మిగిలారు. జర్నలిజం అండ్‌ మాస్‌ కమ్యూనికేషన్‌ డిపార్టుమెంట్‌లో ముగ్గురిలో ఒకరు రిటైర్డ్‌ కాగా, వచ్చే ఏడాది ఒకరు, ఆ వచ్చే సంవత్సరం మిగిలిన ఆ ఒక్కరూ ఖాళీ అవ్వనున్నారు. ఎయులోని ప్రతి విభాగంలోనూ దాదాపు ఇదే పరిస్థితి ఉంది. దీనివల్ల రీసెర్చి చదువు పూర్తి చేసి ఏళ్ల తరబడి అధ్యాపక పోస్టుల కోసం ఎదురు చూసే వారికి ఆశనిపాతంగా మారిపోయింది. ఎయు ఉన్నతాధికారులు మాత్రం రీసెర్చి జరుగుతోందని చెబుతున్నారు.

150 పోస్టుల భర్తీకి అవకాశం : జివిడి ప్రసాదరెడ్డి, ఎయు వైస్‌ ఛాన్సలర్‌
నూతన విధానాన్ని ప్రభుత్వం తయారు చేస్తోంది. 150 పోస్టులు ఈ ఏడాది భర్తీ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. అధ్యాపక పోస్టులపై వివిధ స్థాయిల్లో ఉండే 49 కేసులను క్లియర్‌ చేసుకుంటూ ప్రభుత్వం వచ్చింది. భర్తీకి నోటిఫికేషన్‌ ఇవ్వాల్సి ఉంది. ఈసారి ఇంటర్వ్యూలకు అత్యధిక మందిని పిలిచే అవకాశాలు ఉండవు. 1:5 నిష్పత్తిలో ఇంటర్వ్యూలు జరుపుతాం.

ఎపిపిఎస్‌సి ద్వారా భర్తీ చేయాలి : రేకాగ షణ్ముఖరావు, ఎపి యూనివర్సిటీల పరిశోధక విద్యార్థుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు
ఎయులో 2018 తర్వాత రీసెర్చి స్కాలర్ల నోటిఫికేషన్‌ రాలేదు. అధ్యాపక పోస్టుల భర్తీకి గతంలో నోటిఫికేషన్‌ రద్దయింది. ఎపిపిఎస్‌సి ద్వారా పోస్టుల భర్తీ చేయాలి. దీనివల్ల నాణ్యమైన అధ్యాపకులు వస్తారు. ప్రభుత్వం త్వరలో విడుదల చేయనున్న అధ్యాపక పోస్టుల భర్తీ నోటిఫికేషన్‌లో ఈ జాగ్రత్తలు తీసుకోవాలి.