Oct 27,2021 23:48

హరీష్‌, దివ్య మృతదేహాలు

ప్రజాశక్తి - రేగిడి: పెద్దలు ప్రేమ పెళ్లికి నిరాకరించడంతో ఫ్యానుకు ఉరివేసుకొని ప్రేమ జంట ఆత్మహత్య చేసుకున్న ఘటన మండలంలోని తునివాడ గ్రామంలో బుధవారం మధ్యాహ్నం చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. తునివాడకు చెందిన పల్లి హరీష్‌(22), రుంకు దివ్య(21) విజయనగరంలోని ఓ డిగ్రీ కళాశాలలలో చదువుతున్నారు. ఇద్దరూ కొన్నేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. కులాలు ఒక్కటి కావడంతో ఇంట్లోవారిని ఒప్పించి పెళ్లి చేసుకుందామనుకున్నారు. వీరి పెళ్లికి కుటుంబసభ్యులు అంగీకరించకపోవడంతో నాలుగు నెలల క్రితం ఇంటి నుంచి పారిపోయారు. బుధవారం తిరిగి స్వగ్రామం వచ్చి, ఇరు కుటుంబాలను ఒప్పించేందుకు ప్రయత్నించారు. వారు అంగీకరించకపోవడంతో హరీష్‌ తన ఇంటి మేడపై ఉన్న గదిలో ఫ్యానుకు ఇద్దరూ ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డారు. తమ పిల్లలు మృతితో హరీష్‌ తల్లి వసంత, దివ్య తల్లిదండ్రులు రుంకు శ్రీనివాసరావు, మంజులమ్మ రోదించారు. విషయం తెలుసుకున్న సిఐ శంకరరావు, ఎస్‌ఐ షేక్‌ మహ్మద్‌ అలీ ఘటనా స్థలికి చేరుకున్నారు. కేసు నమోదు చేశారు.