Jan 14,2021 06:46

భారతదేశ బ్యాంకింగ్‌ రంగంలో ప్రైవేటు రంగ యాజమాన్యం, నియంత్రణ, కార్పొరేట్‌ నిర్మాణం వగైరా అంశాలలో... ప్రస్తుతం అమలవుతున్న లైసెన్స్‌, నియంత్రణ విధానాలను పరిశీలించేందుకు...రిజర్వుబ్యాంకు నియమించిన అంతర్గత కార్యనిర్వహణ గ్రూప్‌ 2020, నవంబర్‌ 20న ఒక నివేదికను సమర్పించింది. కార్పొరేట్లకు బ్యాంకులను ఏర్పాటు చేసుకోవటానికి అవకాశం ఇవ్వాలని నివేదికలో ప్రతిపాదించారు. 1949 బ్యాంకింగ్‌ నియంత్రణ చట్టానికి కొన్ని సవరణలు చేసిన తరువాత బ్యాంకింగ్‌ రంగంలోకి ప్రవేశించేందుకు బడా కార్పొరేట్‌/పారిశ్రామిక సంస్థలను అనుమతించాలన్న అంశం వివాదాస్పదంగా ఉంది. రూ.50,000 కోట్ల ఆస్తులు ఉండి, బ్యాంకింగేతర ఆర్థిక కార్యకలాపాలు నిర్వహిస్తున్న కంపెనీలకు (ఎన్‌బిఎఫ్‌సి లు) పూర్తి స్థాయి బ్యాంకింగ్‌ కార్యకలాపాలు నిర్వహించుకునేందుకు అనుమతులు ఇవ్వాలని వర్కింగ్‌ గ్రూప్‌ మరో ముఖ్యమైన సిఫారసు చేసింది. రిజర్వ్‌బ్యాంకు దీనిని ఆమోదిస్తే బ్యాంకింగేతర ఆర్థిక కార్యకలాపాలు నిర్వహిస్తున్న బడా కార్పొరేట్లను దొడ్డిదారిన బ్యాంకింగ్‌ రంగం లోకి అనుమతించినట్లు అవుతుంది.


ఆర్థిక వ్యవస్థ అభివృద్ధి చెందుతున్న క్రమంలో కింది అంశాలను పరిశీలించేందుకు జూన్‌ 12, 2020న ఆర్‌బిఐ వర్కింగ్‌ గ్రూప్‌ని ఏర్పాటు చేసింది. 1.పెరుగుతున్న అవసరాలకు అనుగుణంగా దేశంలోని బ్యాంకింగ్‌ రంగంలో పోటీతత్వాన్ని పెంచాలి. 2. కార్పొరేట్‌ సంస్థలు ప్రైవేటు బ్యాంకింగ్‌ రంగంలోనికి ప్రవేశించడానికి ఉన్న అవకాశాలను పరిశీలించాలి. 3. భారతదేశ బ్యాంకులు ప్రపంచ ర్యాంకులు సాధించేందుకు అవసరమైన విధానాలు రూపొందించాలి. ఈ అంశాలను పరిగణనలోకి తీసుకుని, ప్రస్తుతం బ్యాంకింగ్‌ రంగంలో అమలవుతున్న లైసెన్సు విధానం, నియంత్రణ మార్గదర్శకాలను పున: పరిశీలించి, అవసరమైన మార్పులు చేసేందుకు సిఫారసులు చేయాలని ప్రసన్నకుమార్‌ మహంతి నాయకత్వం లోని వర్కింగ్‌ గ్రూప్‌ను ఆర్‌బిఐ కోరింది. ఆర్థిక పరిస్థితులపై ఎంతగానో ప్రభావం చూపే ఈ అంశాలపై చేయవలసిన సవరణల నివేదికను వర్కింగ్‌ గ్రూప్‌ కేవలం నాలుగు నెలల వ్యవధిలోనే ఆర్‌బిఐ కి సమర్పించింది. వాస్తవానికి ఇటువంటి నివేదికలు సమర్పించడానికి కనీసం 2 సంవత్సరాలు పడుతుంది.
 

ఎందుకింత తొందర?
ఈ సిఫారసుల వల్ల అనేక దేశీయ సంస్థలు బ్యాంకులను ఏర్పాటు చేసుకోవటానికి లైసెన్స్‌లు పొంది, భారీగా లబ్ధి పొందే అవకాశాలున్నాయి. అందువలన అంతరంగిక గ్రూపు చేసిన సిఫార్సులపై విస్తృతంగా చర్చలు జరగాలి. విమర్శనాత్మకంగా పరిశీలించాలి. ఆ విధంగా చేయకుండా కార్పొరేట్‌ సంస్థల ఒత్తిడికి లొంగిపోతే పెరిగిపోతున్న చెల్లించని రుణ భారం నుండి బ్యాంకింగ్‌ రంగాన్ని బయట పడవేయటానికి చేస్తున్న ప్రయత్నాలు విఫలమవుతాయి. దీర్ఘకాలంలో మొత్తం ద్రవ్య రంగ స్థిరత్వాన్ని దెబ్బ తీయటానికి అది దారితీస్తుంది.
 

కార్పొరేట్‌ బ్యాంకులు-గత అనుభవాలు
స్వాతంత్య్రం వచ్చిన తరువాత రెండు దశాబ్దాల పాటు, అంటే 1969లో జాతీయం చేయాడానికి ముందు, బ్యాంకింగ్‌ రంగం ప్రైవేటు కార్పొరేట్ల ఆధీనంలోనే ఉంది. ఆ అనుభవాలను వర్కింగ్‌ గ్రూప్‌ అధ్యయనం చేయకపోవడం ఆశ్చర్యం కలిగిస్తుంది. ప్రైవేటు బ్యాంకులు బడా వ్యాపారవేత్తల అధీనంలో ఉన్న జాయింట్‌ స్టాక్‌ కంపెనీల రూపంలోనే ఉండేవి. అంటే ఈ బ్యాంకులలో వాటాలు కొద్దిమందికే ఉన్నా, అతి పెద్ద వాటాదారులదే నిర్ణయాల అమలులో ప్రధాన పాత్ర అవుతుంది. బ్యాంకులలో ప్రజలు దాచుకున్న సొమ్ములో అధిక మొత్తాలను బ్యాంకులు స్థాపించిన కార్పొరేట్‌ సంస్థలకు తక్కువ వడ్డీకి రుణాలుగా ఇచ్చేవారు. చాలా ప్రైవేటు బ్యాంక్‌ల యాజమాన్యాలు స్వప్రయోజనాలను కాపాడుకోవడం కోసం లేదా బ్యాంకింగ్‌ రంగం లోని ఇతరులతో పోటీని ఎదుర్కోవడానికి చేసిన అవివేక నిర్ణయాలతో అతి కొద్దికాలంలోనే అనేక బ్యాంకులు దివాళా తీసేవి. 1947-58 మధ్య కాలంలో 361 బ్యాంకులు దివాళా తీశాయంటే ఆనాటి బ్యాంకింగ్‌ వ్యవస్థ ఎటువంటి దుస్థితిలో ఉందో అర్ధం చేసుకోవచ్చు. 


ప్రైవేటు బ్యాంకుల వైఫల్యాలు పెరగటం, సామాజిక బాధ్యతను నిర్వహించక పోవటం, కరువు కాటకాల కాలంలో అప్పులివ్వటానికి నిరాకరించడం, అధిక ధరల వలన ద్రవ్యోల్బణం పెరగటం తదితరాలు బ్యాంకుల జాతీయీకరణకు దారితీశాయి. 1990ల తరువాత సరళీకరణ విధానాలు బ్యాంకింగ్‌ రంగానికి కూడా విస్తరించినప్పటికీ బ్యాంకింగ్‌ రంగాన్ని ప్రైవేటీకరించటానికి ఆర్‌బిఐ రాజకీయ, ఆర్థిక కారణాల రీత్యా ఊగిసలాడింది. బ్యాంకింగ్‌ రంగంలోకి కార్పొరేట్లు ప్రవేశించడానికి 2013 మార్గదర్శకాలు వెసులుబాటు కల్పించినా, ఈ నాటికీ ఏ కార్పొరేట్‌ సంస్థకూ ఆర్‌బిఐ అనుమతి ఇవ్వలేదు.

పెరిగే పోటీ, కునారిల్లే బ్యాంకింగ్‌ వ్యవస్థ
బ్యాంకులపై కార్పొరేట్‌, పారిశ్రామిక సంస్థల యాజమాన్యం ఏర్పడటం వలన ఆర్థిక కేంద్రీకరణ మరింతగా పెరుగుతుంది. దీంతో దేశీయ ఆర్థిక వ్యవస్థ, రాజకీయ రంగాలపై దుష్ప్రభావాలు పడతాయి. అవి అసమానతలను పెంచటమే కాక, కొందరి ప్రత్యేక ప్రయోజనాలకు అనుగుణంగా విధానాలను రూపొందించటానికి దారితీస్తాయి. బడా కార్పొరేట్‌ సంస్థలు బ్యాంకుల యాజమాన్యాన్ని స్వాధీనం చేసుకొంటే వచ్చే ఇబ్బందులు ఆర్‌బిఐ కి తెలియక కాదు. రుణాలు కేటాయించటంలో తప్పులు చేయటం, తాము లాభాలు పొందేవిధంగా విధానాలను అమలు చేయటం, పోటీని నీరుగార్చేలా వ్యవహరించటం, తమ గ్రూపుల మధ్యనే రుణాలిచ్చుకొనే విధానంలోని సమస్యలు, నైతికపరమైన అంశాలు తదితరాలను గురించి వర్కింగ్‌ గ్రూపు తన నివేదికలోనే పేర్కొంది. ఇటువంటి చిక్కులను పేర్కొంటూ కూడా వర్కింగ్‌ గ్రూపు బడా కార్పొరేట్‌ సంస్థలను బ్యాంకింగ్‌ రంగం లోకి అనుమతించాలని సిఫార్సు చేయటం ఆశ్చర్యకరం.

ఆర్‌బిఐ సమర్ధత పెంచుకోవాలి
భారతదేశం 2008 నాటి ప్రపంచ ఆర్థిక మాంద్యాన్ని ఎదుర్కోగలిగినా, లావాదేవీలలో మోసాలు, చెల్లింపులలో జాప్యం వంటివి ఈ మధ్య కాలంలో అనేకం చూస్తున్నాం (పంజాబ్‌ నేషనల్‌ బ్యాంకు, ఎస్‌ బ్యాంకు, పిఎంసి బ్యాంకు, ఐసిఐసిఐ బ్యాంకు, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ లీజింగ్‌ అండ్‌ ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌ నుండి దివాన్‌ హౌసింగ్‌ ఫైనాన్స్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌ వరకు). ఇవన్నీ ఆర్‌బిఐ నియంత్రణ లోని లోపాలను ఎత్తిచూపుతున్నాయి. ఆర్‌బిఐ కళ్ళుగప్పి ఆర్థిక సంస్థలు ఎలా లావాదేవీలు నిర్వహిస్తున్నాయో తెలియ చేస్తున్నాయి. వీటన్నిటిని సవరించేందుకు చర్యలు తీసుకోవలసి ఉంది. ఆర్‌బిఐ ఇంకా పరిపక్వత సాధించలేదని జరుగుతున్న సంఘటనలు తెలియ చేస్తున్నాయి.


భారతదేశంలో బ్యాంకింగ్‌ రంగంలో నియంత్రణలకు కొదవ లేదు. వాటిని సక్రమంగా అమలు చేయకపోవడంలోనే సమస్య ఉన్నది. నియంత్రణలు ఉన్నా అనేక బ్యాంకులు స్కాములలో మునగడం ఈ విషయాన్ని తేటతెల్లం చేస్తున్నది. నియంత్రణలు పెట్టినంత మాత్రాన సరిపోదు. వాటిని సమర్ధవంతంగా అమలు చేసే యంత్రాంగాన్ని కూడా ఏర్పాటు చేసుకోవాలి. లేకపోతే నియంత్రణలు కాగితాలకే పరిమితమవుతాయి. ఆర్‌బిఐ కే గనక సరైన నియంత్రణ యంత్రాంగం ఉండి ఉంటే బినామీ సంస్థల లావాదేవీలు, మోసాలు, అప్పుల ఎగవేతలు, కార్పొరేట్‌ గ్రూపుల ఏజెంట్లకు అప్పులు ఇవ్వడం నిరంతరంగా కొనసాగుతుండేవా? ఈ ప్రశ్నకు ఆర్‌బిఐ సమాధానం చెప్పాలి. వీటిని నియంత్రించడంలో విఫలమయిందా? లేదా? విఫలమైతే మరిన్ని బాధ్యతలు తలకెత్తుకోవడంలో అర్ధం లేదు. విఫలం కాలేదనుకుంటే ఆర్‌బిఐ పర్యవేక్షణలో ఉన్నా, ఇన్ని అక్రమాలు ఎలా జరుగుతున్నాయో బ్యాంకింగ్‌ వ్యవస్థకి జవాబివ్వాలి. మొదటగా ఉన్న బాధ్యతలు సక్రమంగా నిర్వర్తించడానికి చర్యలు తీసుకోవాలి. ఆర్థిక వ్యవస్థను తారుమారు చేయటానికి అవకాశాలు ఇవ్వటం, అసలైన దోషులను పట్టుకోలేని స్థితికి వెళ్ళటం ఏమాత్రం క్షేమం కాదు.
                                                              * కవల్‌జిత్‌ సింగ్‌ ('వైర్‌' సౌజన్యంతో)