May 04,2021 08:05
  • సిఐటియు విశాఖ నగర అధ్యక్షులు కుమార్‌
  • 32 వ రోజుకు జెఎసి దీక్షలు

ప్రజాశక్తి - కలెక్టరేట్‌ (విశాఖ) : ఇటీవల జరిగిన ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో మోడీ ప్రభుత్వానికి ప్రజలు తగిన బుద్ధి చెప్పిన నేపథ్యంలో ఇప్పటికైనా స్టీల్‌ప్లాంట్‌, ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణ నిర్ణయాలను ఉపసంహరించుకోవాలని సిఐటియు నగర అధ్యక్షులు ఆర్‌కెఎస్‌వి.కుమార్‌ డిమాండ్‌ చేశారు. జివిఎంసి గాంధీ విగ్రహం వద్ద విశాఖ అఖిలపక్ష కార్మిక, ప్రజా సంఘాల వైజాగ్‌ స్టీల్‌ప్లాంట్‌, ప్రభుత్వ రంగ సంస్థల పరిరక్షణ కమిటీ ఆధ్వర్యాన నిర్వహిస్తున్న రిలే దీక్షలు 32వ రోజుకు చేరాయి. సోమవారంనాటి దీక్షలను కుమార్‌ ప్రారంభించి మాట్లాడారు. ఇటీవల ఎన్నికల్లో బిజెపికి ఓట్లు తగ్గడానికి ఆ ప్రభుత్వం అనుసరించిన వినాశకర విధానాలే కారణమన్నారు. విశాఖపట్నం స్టీల్‌ ప్లాంట్‌ కోవిడ్‌ రోగులకు ఆక్సిజన్‌, ప్రభుత్వ ఆస్పత్రులకు బెడ్లను అందజేస్తోందని, అటువంటి గొప్ప కర్మాగారం ఆయువు తీయాలని చూడడం దారుణమన్నారు. స్టీల్‌ప్లాంట్‌, ప్రభుత్వరంగ సంస్థలు దేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముకగా నిలుస్తున్నాయని, వేలాది మందికి ఉపాధి కల్పిస్తున్నాయని తెలిపారు. అలాంటి సంస్థలను అమ్ముతామంటే ప్రజలు చూస్తూ ఊరుకోరని హెచ్చరించారు. కార్యక్రమంలో సిఐటియు మద్దిలపాలెం జోన్‌ అధ్యక్షులు వి.కృష్ణారావు, నాయకులు అనపర్తి అప్పారావు, కె.కుమారి, ఎం.చంటి, శ్రీనివాసరాజు, పి.దేముడు, ఎన్‌.ఆది తదితరులు పాల్గొన్నారు.