Apr 13,2021 07:06

  సామాజిక సేవా రంగంలో ఇంత పెద్ద వ్యవస్థగా ఉన్న ఈ రంగానికి సంబంధించి చట్టబద్దత లేకపోవడంతో యాజమాన్యాల ఇష్టాలకే వదిలి వేసినట్లయింది. వున్న అరకొర చట్టాల అమలుకు కూడా విద్యా శాఖ ప్రయత్నించిందే లేదు. ఏ విధమైన చట్టబద్ద హామీలు, జాబ్‌చార్టు, సర్వీసు కండిషన్లు లేవు. వీరికి కనీస వేతనాలు , గుర్తింపు కార్డులు, హెల్త్‌కార్డులు , సెలవులు, పి.ఎఫ్‌, ఇపిఎఫ్‌ వంటి పథకాలు... ఏవీ అందడం లేదు. ప్రభుత్వం, ప్రైవేటు యాజమాన్యాలు ఏవీ పట్టించుకోవడం లేదు.
   రోనా సంక్షోభ కాలంలో వున్నపళంగా ఉపాధి కోల్పోయిన వలస కార్మికుల బతుకులు బహు దయనీయంగా మారాయి. అదే విధంగా ప్రైవేట్‌ విద్యా సంస్థలలో పని చేసే టీచింగ్‌, నాన్‌టీచింగ్‌ ఉద్యోగుల బతుకులు బజారు పాలైనాయి. ఎవరూ పట్టించుకోని సమస్యగానే ఉండిపోయింది. పాఠశాలలు, కళాశాలలు, మూతపడటంతో వృత్తికి దూరమై ఏ పని దొరికితే ఆ పనిలో కూరుకుపోయి బతకాల్సిన పరిస్థితి వచ్చింది. సగం జీతమే చెల్లించినవారు, ఏమీ చెల్లించనివారు, ఉద్యోగాల నుంచే తీసేసిన యాజమాన్యాలు ఉన్నాయి.
   రాష్ట్రంలో పాఠశాలల వరకే సుమారు లక్ష మంది ఉపాధ్యాయులు, ఇతర సిబ్బంది పని చేస్తున్నారు. కళాశాలలు, ఇంజనీరింగ్‌, వృత్తి విద్యాసంస్థలలో పని చేసే సిబ్బంది కలిపితే సుమారు 3 లక్షలు ఉంటారని అంచనా. సామాజిక సేవా రంగంలో ఇంత పెద్ద వ్యవస్థగా ఉన్న ఈ రంగానికి సంబంధించి చట్టబద్దత లేకపోవడంతో యాజమాన్యాల ఇష్టాలకే వదిలి వేసినట్లయింది. వున్న అరకొర చట్టాల అమలుకు కూడా విద్యా శాఖ ప్రయత్నించిందే లేదు. ఏ విధమైన చట్టబద్ద హామీలు, జాబ్‌చార్టు, సర్వీసు కండిషన్లు లేవు. వీరికి కనీస వేతనాలు, గుర్తింపు కార్డులు, హెల్త్‌ కార్డులు, సెలవులు, పి.ఎఫ్‌, ఇపిఎఫ్‌ వంటి పథకాలు... ఏవీ అందడం లేదు. ప్రభుత్వం, ప్రైవేటు యాజమాన్యాలు గానీ ఏవీ పట్టించుకోవడం లేదు. ఎక్కువ మంది రూ.5 వేల నుంచి 10 వేల మధ్యనే జీతాలు పొందే పరిస్థితి ఉంది.

                                                     ప్రైవేట్‌ టీచర్ల వెతలు

   అరకొర జీతాలు, అగ్రిమెంట్‌ ప్రకారం పని చేయడం, అడ్మిషన్ల టార్గెట్‌, టార్చర్‌ అదనపు పని గంటలు, అడ్మిషన్‌ వర్కు, కరెక్షన్‌ వర్కు, ఫీజులు కట్టించే బాధ్యత, చదివించే బాధ్యత, నిరంతర పరీక్షలు, స్టాఫ్‌ మీటింగ్‌ టార్చర్‌, తల్లిదండ్రులు, మేనేజిమెంట్‌కు జవాబుదారీతనం, అడ్మిషన్ల కోసం గడపగడపకు వెళ్ళడం...వంటి రకరకాల వేధింపులను ప్రైవేటు టీచర్లు ఎదుర్కొంటున్నారు.

                                            రాజ్యాంగ బాధ్యత వహించడంలో వైఫల్యం

   రాజ్యాంగ ఆదేశం మేరకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఉచితంగా ప్రాథమిక విద్య అందించాల్సి ఉంది. ఈ బాధ్యత నుండి వైదొలిగిన కారణంగానే పాఠశాల విద్యలో నేటికీ 42 శాతం విద్యార్థులు ప్రైవేటు పాఠశాలల్లో చదువుతున్నారు. అంటే 40 శాతం విద్యార్థులకు ఉచిత విద్య అందించవలసిన బాధ్యత నుండి ప్రభుత్వం తప్పించుకుంటున్నది. వీరి బాధ్యత కూడా ప్రభుత్వానిదే అనుకుంటే ఉపాధ్యాయుల నియామకాలు, ఈ విద్యార్థులకు ఉచిత పుస్తకాలు, భవన నిర్మాణాలకు కొన్ని వేల కోట్లు భరించవలసి ఉండేది. 40 శాతం విద్యార్థుల భారం తల్లిదండ్రులే భరిస్తున్నారు. ప్రైవేట్‌ రంగమే అయినా విద్య అనే సామాజిక సేవా రంగంలో పని చేసే లక్షలాది మంది టీచింగ్‌, నాన్‌ టీచింగ్‌ సిబ్బందికి ప్రభుత్వ బడ్జెట్‌ నుండి ఖచ్చితంగా సహకారం అందించాలి. వీరి బతుకుల్ని ప్రైవేట్‌ యాజమాన్యాల దయాదాక్షిణ్యాలకు వదిలి వేయండం తగదు.

                                             ప్రైవేటు అన్‌ఎయిడెడ్‌ ఉద్యోగులు

   ప్రైవేట్‌ ఎయిడెడ్‌ విద్యా సంస్థలలో వేలాది మంది అన్‌ఎయిడెడ్‌ ఉపాధ్యాయులు దశాబ్దల తరబడి పని చేస్తున్నారు. ఎప్పటికైనా ఎయిడెడ్‌కు అడ్మిట్‌ అవుతామనే ఆశతో పనిచేస్తున్నారు. రూ.5-10 వేల జీతంతో పని చేస్తున్నారు. ప్రభుత్వ పాఠశాలలు, కాలేజీలలో వర్తింపచేసిన మినిమమ్‌ స్కేలు వీరికి వర్తింపచేయడం లేదు. ప్రస్తుత ప్రభుత్వ విధానంతో వీరి పరిస్థితి పెనం మీద నుండి పొయ్యిలో పడ్డట్లు అయ్యింది. ఈ ఎయిడెడ్‌ విద్యా సంస్థలను మూసివేస్తే ఉన్న ఉపాధి ఊడిపోతుందనే భయంతో ఉన్నారు. ప్రభుత్వ ఎయిడ్‌ను తీసేస్తే, యాజమాన్యాలు తమ సంస్థలు మూసేస్తే తమకు రక్షణ ఏంటని వీరు ఆందోళన చెందుతున్నారు. వీరికి ప్రభుత్వం తగు రక్షణ కల్పించాల్సి వుంది.

                                      ప్రైవేటు ఉపాధ్యాయుల సమస్యలపై పిడిఎఫ్‌

   ప్రైవేటు ఉపాధ్యాయులు, అధ్యాపకులు, ఫ్యాకల్టీలు, నాన్‌ టీచింగ్‌ సిబ్బంది భద్రత కోసం సమగ్ర చట్టం తీసుకురావాలని ప్రోగ్రెసివ్‌ డెమోక్రటిక్‌ ఫ్రంట్‌ శాసనమండలిలో పలుమార్లు ప్రస్తావించింది. కనీస వేతనాలు, గుర్తింపు కార్డులు, హెల్త్‌ కార్డులు, పి.ఎఫ్‌, ప్రభుత్వ పథకాలు అమలు చేయాలని విజ్ఞప్తి చేసింది.
   కరోనా కాలంలో పిడిఎఫ్‌ ఎమ్మెల్సీలు...ఫీజు నియంత్రణా కమిటీ ఛైర్మన్‌ను కలిసి మేనేజ్‌మెంట్లు వేతనాలు చెల్లించేలా ఆదేశాలు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. ఆ మేరకు ఆదేశాలు ఇచ్చినా, అన్ని మేనేజ్‌మెంట్లు అమలు చేయలేదు. ఉద్యోగాల నుండి తొలిగించవద్దని విజ్ఞప్తి చేశాం. ఈలోగా ప్రభుత్వ ఉపాధ్యాయులు, అధ్యాపకులు, ఫ్యాకల్టీలకు రూ.10, 15, 20 వేలు ఆర్థిక సహకారం ప్రకటించాలని విజ్ఞప్తి చేశాం. ముఖ్యమంత్రిని స్వయంగా కలిసి విజ్ఞప్తి చేశాం. ప్రైవేట్‌ ఉపాధ్యాయుల కష్టాలకు సంబంధించి మీడియాలో ఈ కాలంలో అనేక కథనాలు వెలువడ్డాయి. అయినా ప్రభుత్వం స్పందించలేదు.

                                          ప్రభుత్వం ఆర్థిక సహకారం అందించాలి

   తెలంగాణలో ఓ ప్రైవేటు ఉపాధ్యాయుడు, అతని భార్య ఆత్మహత్యకు స్పందించిన ఆ రాష్ట్ర ప్రభుత్వం ఆపత్కాల ఆర్థిక సాయం రూ.2 వేలతో పాటు, 25 కేజీల బియ్యం ప్రకటించింది. ప్రాంతమేదైనా ఇక్కడి ఉపాధ్యాయులకు కూడా ప్రభుత్వం ఏదైనా ఆర్థిక సహకారం ప్రకటించకపోతుందా? స్పందించకపోతుందా? అని ఎదురు చూస్తున్నారు. ఈ విషయమై ఎ.పి. రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక సహకారం ప్రకటించాలని ప్రభుత్వానికి పిడిఎఫ్‌ విజ్ఞప్తి చేసింది.
   కావున రాష్ట్ర ప్రభుత్వం ప్రైవేట్‌ ఉపాధ్యాయుల, సిబ్బంది పరిస్థితులపై తక్షణమే స్పందించాలి. వారికి గుర్తింపు కార్డులు ఇప్పించాలి. కనీస వేతనం, పి.ఎఫ్‌, సెలవులు, హెల్త్‌ కార్డులు, ఇతర ప్రభుత్వ పథకాల అమలుకు చట్టబద్ధత కల్పించాలి. ప్రైవేట్‌ ఎయిడెడ్‌ విద్యా సంస్థలలో పని చేసే సిబ్బందికి కనీస వేతనాలు, వృత్తి భద్రత కల్పించాలి. వచ్చే శాసనసభ సమావేశాల్లో దీనిపై ఒక సమగ్ర చట్టం తీసుకురావాలి.
 

/ వ్యాసకర్త పిడిఎఫ్‌ ఎమ్మెల్సీ,
సెల్‌:94903 00570/
ఇళ్ళ వెంకటేశ్వరరావు

ఇళ్ళ వెంకటేశ్వరరావు