Dec 05,2021 19:46

జిల్లా మహాసభల్లో మాట్లాడుతున్న యుటిఎఫ్‌ రాష్ట్ర కార్యదర్శి వెంకటేశ్వర్లు

విజయనగరంటౌన్‌: నేడు విద్యారంగంలో వస్తున్న సంస్కరణల ఫలితంగా ప్రాథమిక విద్య నిర్వీర్యమైపోతుందని దీన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపైనా ఉందని యుటిఎఫ్‌ రాష్ట్ర అధ్యక్షులు ఎన్‌.వెంకటేశ్వర్లు పిలుపునిచ్చారు. యుటిఎఫ్‌ 16వ జిల్లా మహాసభలు ఆదివారం స్థానిక జిల్లా పరిషత్‌ సమావేశ మందిరంలో ప్రారంభమయ్యాయి. తొలుత యుటిఎఫ్‌ జెండాను జిల్లా అధ్యక్షులు రమేష్‌చంద్ర పట్నాయక్‌ ఆవిష్కరించారు. అనంతరం ఇటీవల మృతి చెందిన యుటిఎఫ్‌ రాష్ట్ర కార్యదర్శి కె.శేషగిరి చిత్రపటానికి అధ్యక్షులు వెంకటేశ్వర్లు పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం రాష్ట్ర అధ్యక్షులు మాట్లాడుతూ నూతన విద్యా విధానాన్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్నాయని, దీనివల్ల రాష్ట్రంలో 30వేల పాఠశాలలను మూసేందుకు ప్రభుత్వం సన్నద్ధమైందని అన్నారు. దీన్ని యుటిఎఫ్‌ పూర్తిగా వ్యతిరేకిస్తుందన్నారు. అలాగే హైస్కూల్‌ విద్యలో 3,4,5 తరగతులు విలీనం చేయడం అన్యాయమన్నారు. ఈ విద్యా విధానం వల్ల పేదలు, ముఖ్యంగా బాలికలు విద్యకు దూరమయ్యే పరిస్థితి వస్తుందన్నారు. ప్రాథమిక విద్యను కాపాడుకోడానికి యుటిఎఫ్‌ ఉద్యమిస్తుందన్నారు. విద్యను ప్రైవేటీకరించే ఆలోచనలో భాగంగానే రాష్ట్ర ప్రభుత్వం విద్యా రంగంలో అనేక మార్పులు తీసుకొస్తుందన్నారు. మరోవైపు రాష్ట్ర ప్రభుత్వం పిఆర్‌సి ఇవ్వడంలో, కాంట్రాక్టు ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులను రెగ్యులరైజ్‌ చేయడంలో, డిఎ ఇవ్వడంలో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని అన్నారు. మరోవైపు ఆంగ్ల మాద్యమాన్ని బలవంతంగా రుద్దే ప్రయత్నం రాష్ట్ర ప్రభుత్వం చేస్తుందన్నారు. సమాంతర విద్యా విధానం అమలు చేయాలని అందుకోసం యుటిఎఫ్‌ పోరాడుతుందన్నారు. ప్రభుత్వ విద్యను కాపాడుకోడానికి, ఉపాధ్యాయ సమస్యల పరిష్కారానికి యుటిఎఫ్‌ రాష్ట్ర కార్యదర్శి కె.శేషగిరి ఎంతో శ్రమించారన్నారు. ఆయన స్ఫూర్తితో ప్రాథమిక విద్యను కాపాడుకోవడానికి, ప్రభుత్వ విద్యను రక్షించుకోవడానికి రానున్న కాలంలో ఉద్యమించేందుకు మహాసభలు వేదిక కావాలని, అందుకు కావాల్సిన కార్యాచరణ ప్రణాళికను రూపొందించనున్నామని తెలిపారు. మహాసభలో యుటిఎఫ్‌ రాష్ట్ర నాయకులు కె.విజయగౌరి, డి.రాము, ఎస్‌.మురళీమోహన్‌, జిల్లా ప్రధానకార్యదర్శి జెఎవిఆర్‌కె ఈశ్వరరావు, పలువురు ఉపాధ్యాయులు పాల్గొన్నారు.