Nov 04,2020 00:01

ఏం జరిగిందో తెలియక సెల్‌ఫోన్‌తో ఆడుకుంటున్న చిన్నారులు

ప్రజాశక్తి - ఒంగోలు సబర్బన్‌: కాసేపటిలో ఇంటికి చేరి పెళ్లాం పిల్లలతో సంతోషంగా గడపాల్సిన ఓ యువకుడు విద్యుత్తు కాటుతో విగతజీవుడయ్యాడు. తమ తండ్రికి ఏమైందో తెలియని నిండా ఏడేళ్లు కూడా నిండని పసి కూనలు సెల్‌ ఫోన్‌తో ఆడుకుంటున్నారు. తాళి కట్టించుకున్న ఆలి ఇక నాకు దిక్కెవరంటూ గుండెలవిసేలా రోధిస్తుంది. ఆమెను ఓదార్చేందుకు చుట్టుపక్కలా ఎవరూ లేరు. ఒకరిద్దరు ఆడవాళ్లు వచ్చి ఆమెను శాంతపరుస్తున్నా ఆర్తనాదాలు ఆగే పరిస్థితి లేదు. అసలు ఏం జరిగిందో...చనిపోయిన వ్యక్తి ఎవరో కూడా తెలియక సమీపంలోని నివాసితులు తమ ఇంటి బాల్కానిల నుంచే తొంగిచూశారు. పట్టించుకోవాల్సిన బిల్డర్‌ పత్తా లేడు. పనులు పర్యవేక్షించే సూపర్‌ వైజర్‌ చేష్టలుడిగి చూస్తున్నాడు. పొట్టకూటి కోసం ఊరికాని ఊరు..వచ్చి వచ్చిన ఓ కూలి విగతజీవుడైతే ఆ దిక్కుతోచని పరిస్థితులు ఎలా ఉంటాయన్నడానికే ఈ ఘటనే తార్కాణం....
వివరాల్లోకి వెళితే.. నగరంలోని రాజీవ్‌నగర్‌ ఎక్స్‌టెన్షన్‌ ప్రాంతంలో నిర్మిస్తున్న ఓ భహుళాంతస్తు భవనం వద్ద విద్యుత్తు షాక్‌తో ఓ కూలి మంగళవారం మృతి చెందాడు. మృతుడి పేరు ఉడితే హనుమంతు నాయక్‌. వయస్సు 28 సంవత్సరాలు.సొంతూరు గుంటూరు జిల్లా మాచర్ల మండలం జమ్మల మడక గ్రామం. నాలుగేళ్లుగా ఒంగోలు నగరంలో ఉంటూ కూలి పనులు చేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. రోజూ లాగే మంగళవారం కూడా రాజీవ్‌నగర్‌లోని డిబికెఆర్‌ రెషిడెన్సీ నిర్మాణ భవనం వద్దకు పనికోసం వచ్చాడు. ఉదయం నుంచి పని జరుగుతోంది. ఐదో ప్లోర్‌కు ఇటుకలు, నిర్మాణ సామగ్రిని ఏర్పాటు చేసేందుకు కింద నుంచి రోప్‌ ద్వారా మిని లిప్ట్‌ను ఏర్పాటు చేశారు. ఈ లిప్ట్‌లో హనుమంతు ఇటుకలు పేర్చి పైకి పంపుతున్నాడు. సాయంత్రం నాలుగున్నర గంటల సమయంలో రోప్‌ వైర్‌ నుంచి మిని లిప్ట్‌కు కరెంటు వచ్చింది. లిప్ట్‌లో బరువు కొద్ది దూరం పైకి వెళ్లేదాక పట్టుకోవాల్సి ఉంది. హనుమంతు కూడా అదే పనిలో ఉన్నాడు. ఒక్కసారిగా విద్యుత్తు ప్రసరణ జరగడంతో హనుమంతు అక్కడే కుప్పకూలిపోయాడు. ఇది గమనించిన కూలీలు కిందికి దిగి వచ్చి చూడగా అప్పగికే హనుమంతు విగతజీవుడయ్యాడు. విషయాన్ని తోటి కూలీలు ఆయన భార్యకు చేరవేశారు. విషయం తెలుసుకున్న భార్య సీత నాయక్‌ ఘటనా స్థలానికి పిల్లలతో సహా పరుగు పెట్టింది. ఉలుకు,పలుకులేకుండా పడిఉన్న భర్తను చూసి గుండెలవిసేలా రోధించింది. ఇక తనకు దిక్కెవరంటూ లంబాడి బాషలో దిక్కులు పిక్కటెల్లాలా అరించింది. అసలు ఏం జరిగిందో తెలుసుకునే ఊహలేని వారి ఇద్దరు పిల్లలు లేక సెల్‌పోన్‌తో ఆటలాడుకుంటూ కనిపించడం చూపరుల కళ్లు చెమగిల్లేలా చేసింది. సగటు కూలి చనిపోతే కనీసం పట్టించుకునే వారు కూడా లేక ఆ వలస కార్మికులు పడిన బాధ వర్ణనాతీతం.