Jul 30,2021 19:38

క్రీడలు శారీరకంగానే కాదు... మానసికంగా మనిషిని బలంగా చేస్తాయి. ఆటల్లో ఎంత పోటీ ఎదురైతే అంతేస్థాయిలో మనుసు కూడా దృఢంగా తయారవుతుంది. ఇదే సూత్రాన్ని జీవితానికి కూడా అనువదించుకొని, ఆటల్లోనూ, జీవితంలోనూ గెలిచాడు రామచంద్రయ్య. అరవైలోనూ బంగారు పతకాలు సాధించి క్రీడాకారులకు స్ఫూర్తిని నింపుతున్నాడు.


నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెంకు చెందిన ఈతకోట రామచంద్రయ్యకు ఆటలు అంటే చాలా ఇష్టం. అందులో ఉండే పోటీతత్వం ఆయనికి వందరెట్ల బలాన్ని ఇస్తుంది. క్రీడా ఉపాధాయ్యుడిగా స్థిరపడినప్పటికీ రకరకాల ఆటలపోటీల్లో పాల్గొంటూ విద్యార్థుల్లో ఆటల మీద శ్రద్ధని పెంచుతున్నాడు. రామచంద్రయ్య తండ్రి నెల్లూరు జిల్లా బిట్రగుంట గ్రామంలో రైల్వే ఉద్యోగిగా పని చేసేవాడు. ఆయన ఫుట్‌ బాల్‌ ప్లేయర్‌ కావడంతో ప్రతిరోజూ ఆడేందుకు ఆటస్థలానికి వెళ్లేవాడు. ఆయనతో పాటు రామచంద్రయ్యను కూడా తీసుకెళ్ళేవాడు. చిన్న వయసులోనే ఫుట్‌బాల్‌పై మక్కువ పెంచుకున్నాడు. అతను రైల్వే టీంతో కలిసి వివిధ ప్రాంతాల్లో జరిగే టోర్నమెంట్‌లలో పాల్గొనేవాడు. ఉన్నత విద్యను బిట్రగుంటలోని జిల్లా పరిషత్‌ ప్రభుత్వ పాఠశాల పూర్తిచేసుకొని... నెల్లూరులోని వి.ఆర్‌ కళాశాలలో ఇంటర్మీడియట్‌ చేరాడు. అప్పటికే ఫుట్‌బాల్‌ నైపుణ్యం సాధించిన రామచంద్రా స్పోర్ట్స్‌ కోటాలో రైల్వే ఉద్యోగం కోసం చాలా ప్రయత్నాలు చేసినా ఫలితం కనిపించలేదు. నిరాశ పడకుండా చదువు మీద దృష్టి పెట్టి డిగ్రీలో చేరాడు. డిగ్రీ రెండో సంవత్సరం చదువుతున్న సమయంలోనే గోపాల పాలెంలోని పిఈటి శిక్షణ కేంద్రంలో సీట్‌ రావడంతో అక్కడ రెండేళ్లు శిక్షణ తీసుకున్నాడు. అనంతరం 1985లో ప్రభుత్వ క్రీడా ఉపాధ్యాయులుగా ఎంపికయ్యాడు.

పోటీతత్వమే ప్రాణంగా..


పాఠశాలలో విద్యార్థులకు ఆటలు నేర్పిస్తూ... తాను సాధన చేయసాగాడు. అథ్లెటిక్స్‌లో పాల్గొనేందుకు కఠోర శ్రమ చేసేవాడు. ప్రతిరోజు సాయంత్రం రెండు గంటల పాటు సుమారు నాలుగు కిలోమీటర్ల మేర పరిగెత్తడంతో పాటు లాంగ్‌ జంప్‌, హైజంప్‌లో సాధన చేసేవాడు. 2004లో గుంటూరులో జరిగిన అథ్లెటిక్స్‌లో పాల్గొన్నాడు. పరుగుపందెం, హై జంప్‌ లాంగ్‌ జంప్‌ పోటీల్లో నాలుగు పతకాలను సాధించాడు. అప్పటి నుంచి వెనుతిరిగి చూడలేదు. పుణెలో జరిగిన అంతర్జాతీయ అథ్లెటిక్స్‌లో, వివిధ ప్రాంతాల్లో జరిగిన రాష్ట్ర, జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొని అనేక పతకాలు సాధించారు. 2017 వరకూ ఇలా రాష్ట్ర, జాతీయ స్థాయి పోటీల్లో సుమారు 117 పతకాలను సాధించాడు. వీటిలో 70 బంగారు, వెండి 32, కాంస్య 17 పతకాలు ఉన్నాయి. 2004లో ఉత్తమ వ్యాయామ ఉపాధ్యాయుడు అవార్డ్డు అందజేసి సత్కరించారు. సింహపురి స్పోర్ట్స్‌ అకాడమీ ఆధ్వర్యంలో క్రీడా దినోత్సవం సందర్భంగా ఇచ్చే ఉత్తమ క్రీడాకారుల అవార్డు సుమారు ఆరేళ్ల పాటు ఆయనను వరించింది.

చేజారిన అంతర్జాతీయ అవకాశం..
రామచంద్ర ప్రతిభను గుర్తించిన భారత ప్రభుత్వం 2012లో సింగపూర్‌, 2013 లో శ్రీలంకలో జరిగిన కెసిఆర్‌ అంతర్జాతీయ అథ్లెటిక్స్‌ పోటీల్లో పాల్గొనేందుకు అవకాశం కల్పించింది. కానీ ఆర్థిక పరిస్థితుల కారణంగా వాటికి దూరమైనాడు.

పోటీతత్వమే ప్రాణంగా..

విద్యార్థులను ప్రోత్సహిస్తూ..
ఆటల్లో గెలుపు, ఓటమి రెండూ ఉంటాయి. ఓటమి ఎదురైనప్పుడు మరో విజయానికి మెట్టుగా భావించి... ఆటల్లో ఆయన సాధన ఉండేది. కృషి, పట్టుదలతో సావాసం చేస్తే విజయం మన వెంటే ఉంటుందని విద్యార్థులకు నిత్యం బోధిస్తూ ఉంటాడు చంద్రయ్య. రేబాల ఉన్నత పాఠశాలకు వచ్చినప్పటి నుంచి విద్యార్థులను ఉత్తమ క్రీడాకారులు తీర్చిదిద్దారు. పాఠశాల ప్రధానోపాధ్యాయులు ప్రోత్సాహంతో దాదాపు 150 పతకాలు సాధించడంలో విద్యార్థులకు శిక్షణ అందజేశారు. 10 మంది విద్యార్థులు రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ టోర్నీల్లో బంగారు, వెండి, కాంస్య పతకాలు సాధించేలా కృషి చేశాడు. అనంతరం కొడవలూరు మండలం కొత్త వంగల్లు ఉన్నత పాఠశాలకు బదిలీపై వెళ్లి సుమారు 10 మందిని జాతీయ స్థాయికి వెళ్లేలా తోడ్పడ్డారు. క్రీడల్లో ప్రతిభ ఉన్నప్పటికీ ఆర్థిక పరిస్థితుల కారణంగా ఇబ్బంది పడుతున్న పేద పిల్లలకు తాను సాయం చేస్తూ, దాతల ద్వారా సాయం చేపిస్తూ ఉన్నత శిఖరాలు అధిరోహించేందుకు సహాయం చేస్తున్నారు.

ఆడపిల్లలను ప్రోత్సహించేవారు : మేఘన, కొడవలూరు విద్యార్థిని
పోటీతత్వమే ప్రాణంగా..సార్‌ క్రీడా ఉపాధ్యాయుడుగా మా స్కూలుకి వచ్చినప్పటి నుంచి క్రీడల్లో ఆడపిల్లలు ఎక్కువమంది పాల్గొంటున్నారు. జిల్లా స్థాయి నుంచి జాతీయస్థాయి క్రీడలకు వెళ్లే విధంగా ఆయన ప్రోత్సాహం ఉండేది. ఓడిపోయినప్పడు ఆయన ఇచ్చే ధైర్యం కొత్త ఉత్సాహం నింపేది.

 

 

 

పోటీతత్వమే ప్రాణంగా..ఆర్థిక సాయం అందించి : శ్రావ్య, కొడవలూరు విద్యార్థిని
ప్రతిరోజూ మాచేత పరుగు పందెం, లాంగ్‌జంప్‌, హైజంప్‌ చేయించేవారు. సార్‌ వద్ద శిక్షణ పొంది అనేక రాష్ట్ర స్థాయితో పాటు జాతీయ స్థాయి పోటీల్లో కూడా పాల్గొన్నాను. సారే మాకు శిక్షణతో పాటు ఈ పోటీల్లో పాల్గొనేందుకు ఆర్థిక సహాయం చేసేవారు.