Nov 22,2020 20:53

చండీగఢ్‌ : విద్యుత్‌ రంగ ప్రయివేటీకరణను కేంద్ర పాలిత ప్రాంతాల్లో మొదట పూర్తి చేసేందుకు కేంద్రప్రభుత్వం వేగంగా చర్యలు తీసుకుంటోంది. తద్వారా తనకు అనుకూల కార్పొరేట్‌ శక్తులకు కట్టబెట్టేందుకు ఉవ్విళ్లూరుతోంది. అందులో భాగంగా మొదట కేంద్ర పాలిత ప్రాంతమైన చండీగఢ్‌లో ఈ కసరత్తును వేగవంతం చేసింది. ఈ ప్రాంతంలో విద్యుత్‌ రంగాన్ని చేజిక్కించుకునేందుకు పలు కార్పొరేట్‌, ప్రయివేటు కంపెనీలు పోటీపడుతున్నాయి. ఈ పోటీలో అదాని, టాటా గ్రూపులు ముందున్నాయి. మోడీ ఆశీస్సులు పుష్కలంగా ఉన్న అదానికి దక్కవచ్చునని విశ్లేషకులు పేర్కొంటున్నారు.
చండీగఢ్‌లో విద్యుత్‌ రంగాన్ని కొనుగోలు చేసేందుకు తొమ్మిది కంపెనీలు ముందుకొచ్చినట్లు కేంద్ర పాలిత ప్రాంత సలహాదారు మనోజ్‌ పరిడా తెలిపారు. వాటిలో అదాని ట్రాన్స్‌మిషన్‌ లిమిటెడ్‌, టాటా పవర్‌ కంపెనీ లిమిటెడ్‌, సిఇఎస్‌సి లిమిటెడ్‌, టోరెంట్‌ పవర్‌ లిమిటెడ్‌, స్టెరిలైట్‌ పవర్‌, జిఎంఆర్‌ జనరేషన్‌ అసెట్‌ లిమిటెడ్‌, ఇండియా పవర్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌, డిఎన్‌హెచ్‌ పవర్‌ డిస్ట్రిబ్యూషన్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌, ఎన్‌టిపిసి ఎలక్ట్రిక్‌ సప్లై లిమిటెడ్‌ ఉన్నాయి. ఇందుకోసం డిసెంబరు 1న ప్రి బిడ్‌ మీటింగ్‌ నిర్వహించాలని, తుది సమావేశం డిసెంబరు 30న నిర్వహించాలని అధికారులు నిర్ణయించారు. ఇందుకోసం నోడల్‌ అధికారిగా విద్యుత్‌శాఖ ఎగ్జిక్యూటివ్‌ ఇంజనీర్‌ పవన్‌ కుమార్‌శర్మను నియమించారు. ప్రయివేటైజేషన్‌, టెండరింగ్‌, వివిధ శాఖలతో సంప్రదింపులు, మంత్రివర్గంతో, ఇతర లావాదేవీలకు సలహదారుగానూ ఆయన వ్యవహరిస్తారు. ప్రయివేటీకరణకు రోడ్‌మ్యాప్‌ సిద్ధం చేయాలని తాజాగా జాయంట్‌ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్‌ (జెఇఆర్‌సి)కి అధికార యంత్రాంగం లేఖ రాసింది.
కేంద్ర పాలిత ప్రాంతాల్లోని విద్యుత్‌ సరఫరా కంపెనీలన్నింటినీ ప్రయివేటీకరిస్తామని గత మేలో కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ ప్రకటించారు. తొలుత కేంద్ర పరిధిలోని పవర్‌ ఫైనాన్స్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌ను విద్యుత్‌ శాఖ నుంచి తొలగించి, కార్పొరేట్లకు కట్టబెడతామని తెలిపారు.
ఇంజనీరింగ్‌ శాఖలోని విద్యుత్‌ విభాగాన్ని కార్పొరేటీకరించేందుకు సలహాదారులను నియమించాలని గత ఏడాది కేంద్ర పాలిత ప్రాంత ప్రత్యేక కార్యదర్శి (ఇంజనీరింగ్‌) సూపరింటెండెంట్‌ ఇంజనీర్‌ (ఎస్‌ఇ)కి లేఖ రాశారు. కాంపిటేటివ్‌ బిడ్డింగ్‌ పద్ధతిలో సలహాదారులను నియమించాలని ప్రత్యేక కార్యదర్శి ఎస్‌ఇని ఆదేశించారు. 2003 ఎలక్ట్రిసిటీ యాక్ట్‌ ప్రకారం రీ స్ట్రక్షరింగ్‌, రీ ఫార్మింగ్‌ చేయాలని జాయింట్‌ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్‌ అధికారులను ఆదేశించింది.
ప్రస్తుతం చండీగఢ్‌ పరిధిలో సొంత విద్యుత్‌ ఉత్పత్తి సంస్థ లేదు. విద్యుత్‌ వినియోగాన్ని బట్టి నగరానికి ఎటువంటి ఇబ్బందులు లేకుండా సరఫరా చేసేందుకు చర్యలు తీసుకుంటోంది. విద్యుత్‌ రంగంలో అవసరమైన చర్యలను స్టేట్‌ లోడ్‌ డిస్పాచ్‌ సెంటర్‌ (ఎస్‌ఎల్‌డిసి) చేపడుతోంది. భవిష్యత్తులో కూడా ఎస్‌ఎల్‌డిసి ఇదేవిధమైన చర్యలు తీసుకుంటుంది. డిస్కమ్‌ కార్పొరేట్ల చేతుల్లోకి వెళ్లనుంది.
24న భారీ ఆందోళన
విద్యుత్‌ రంగాన్ని కార్పొరేటీకరణ చేయడాన్ని నిరసిస్తూ ఫెడరేషన్‌ ఆఫ్‌ సెక్టార్‌ వెల్ఫేర్‌ అసోసియేషన్స్‌ చండీగఢ్‌ (ఎఫ్‌ఒఎస్‌డబ్ల్యుఎసి), యుటి పవర్‌మెన్‌ యూనియన్‌ (యుటిపియు) సంయుక్తంగా ట్రాన్స్‌పోర్ట్‌ చౌక్‌ వద్ద ఈ నెల 24న ఆందోళన నిర్వహించాలని నిర్ణయించారు. ఎఫ్‌ఒఎస్‌డబ్ల్యుఎసి ఛైర్మన్‌ బల్జిందర్‌ సింగ్‌ బిట్టు మాట్లాడుతూ ఇప్పటికే లాభాల్లో ఉన్న విద్యుత్‌శాఖను ఎందుకు ప్రయివేటీకరిస్తున్నారని ప్రశ్నించారు. ఈ శాఖను చేజిక్కించుకునే ప్రయివేటు కంపెనీ బిల్లులను విపరీతంగా పెంచుతుందని చెప్పారు. సర్వీసులలో ఎటువంటి మెరుగుదల లేకుండానే నివాసితులపై విపరీతంగా భారాలు వేసేందుకు కేంద్రం చర్యలు తీసుకుంటోందని విమర్శించారు.
యుటిపియు జనరల్‌ సెక్రటరీ గోపాల్‌ దత్‌ జోషి మాట్లాడుతూ ప్రయివేటీకరణ తరువాత ప్రస్తుతం పనిచేస్తున్న విద్యుత్‌ ఉద్యోగులంతా విధుల్లో ఉంటారనే గ్యారెంటీ లేదని అన్నారు. గత 20 ఏళ్లలో చాలా ప్రయివేటు కంపెనీలు ఉన్న ఉద్యోగులను తొలగించాయని చెప్పారు. ఆ స్థానంలో అతి తక్కువ వేతనాలతో కొత్తవారిని నియమించుకుని, అదే పనిచేయించాయని తెలిపారు.
కేంద్ర ప్రభుత్వ నిర్ణయంపై హైకోర్టుకు వెళ్తాం
విద్యుత్‌ రంగాన్ని ప్రయివేటీకరించాలన్న కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ సోమవారం పంజాబ్‌, చండీగఢ్‌ హైకోర్టుకు వెళ్లనున్నట్లు ఎఫ్‌ఒఎస్‌డబ్ల్యుఎసి తెలిపింది. అత్యవసర సేవలైన విద్యుత్‌ను ప్రయివేటీకరించడానికి వ్యతిరేకంగా కోర్టు ఆదేశాలిస్తుందని ఆశాభావం వ్యక్తం చేసింది.