Nov 27,2020 18:45

ప్రజాశక్తి - అమరావతి బ్యూరో : దళిత విద్యార్థుల పోస్టు మెట్రిక్‌ స్కాలర్‌షిప్‌లను తక్షణమే పునరుద్ధరించాలని కేంద్ర ప్రభుత్వాన్ని సిపిఎం రాష్ట్ర కమిటీ డిమాండ్‌ చేసింది. ఈ మేరకు పార్టీ రాష్ట్రకార్యదర్శి పి.మధు శుక్రవారం ప్రకటన విడుదల చేశారు. 60 లక్షలమంది దళిత విద్యార్థులకు సంబంధించిన పథకానికి కేంద్ర ప్రభుత్వం కోత పెట్టడాన్ని సిపిఎం రాష్ట్ర కమిటీ తీవ్రంగా ఖండిస్తోందని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం స్పాన్సర్‌ చేసే పథకాల్లో దళిత పోస్టు మెట్రిక్‌ విద్యార్థులకు స్కాలర్‌షిప్‌ ఒకటి. ఇందులో 60 శాతం వాటా కేంద్రం భరిస్తుందని పేర్కొన్నారు. దేశంలో 60 లక్షల మంది దళిత విద్యార్థులు పోస్టు మెట్రికల్‌ స్కాలర్‌ షిప్పులు సాలీన రూ.18 వేలు ఉపకార వేతనాన్ని పొందుతూ వచ్చారని తెలిపారు. చాలా సంవత్సరాలుగా అమలు జరుగుతూ వచ్చిన ఈ స్కీము ఇప్పుడు కేంద్ర ప్రభుత్వ చర్యతో మూలనబడుతోందన్నారు. కేంద్రం తన వాటా 60 శాతం నుండి 10 శాతానికి తగ్గించిన ఫలితంగా ఈ ఆర్థిక భారాన్ని భరించలేక 14 రాష్ట్రాలు ఈ పథకానికి 2017-18 నుండి స్వస్తి చెప్పడం ప్రారంభమైందని తెలిపారు. దీనివల్ల 11, 12 తరగతుల్లో ఉన్న పోస్టు మెట్రిక్‌ విద్యార్థులు స్కాలర్‌షిప్పులను కోల్పోతున్నారని అన్నారు. స్వాతంత్య్రానంతర కాలంలో సామాజికంగా అణగారిన తరగతుల విద్యాభివృద్ధికోసం ప్రవేశపెట్టబడిన ఈ పథకం ప్రమాదంలో పడిందన్నారు. కార్పొరేట్లకు ఎన్నో రకాల రాయితీలిచ్చే ఈ ప్రభుత్వం, పేద దళిత విద్యార్థులు పొందే స్కాలర్‌షిప్పులకు కోత పెట్టడం గర్హనీయమన్నారు. కేంద్ర ప్రభుత్వం వెంటనే ఈ పథకాన్ని పునరుద్ధరించి 60 లక్షల మంది దళిత విద్యార్థులు పోస్టు మెట్రిక్‌ స్కాలర్‌షిప్పులు పొందే విధంగా చర్యలు తీసుకోవాలని సిపిఎం రాష్ట్ర కమిటీ కోరుతోందని మధు పేర్కొన్నారు.