
అమరావతి: విశాఖ ఉక్కుకు సంబంధించి పోస్కోతో దొంగచాటు ఒప్పందాన్ని ఎందుకు చేసుకోవాల్సివచ్చిందని సిఐటియు ప్రశ్నించింది. ఈ రహస్య ఒప్పందాన్ని ఎవరు చేశారో,ఎందుకు చేశారో చెప్పాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. ఈ మేరకు సిఐటియు రాష్ట్ర అధ్యక్షులు సిహెచ్ నర్సింగరావు, ప్రధాన కార్యదర్శి ఎంఎ గఫూర్ విడుదల చేసిన ప్రకటనలో పోస్కో కంపెనీకి నీరు, విద్యుత్, రోడ్, రైలు, సముద్రమార్గ రవాణాలు కల్పించడంతో పాటు పర్యావరణ అనుమతులు సాధించే బాధ్యతను కూడా విశాఖ స్టీల్పైనే పెట్టారని తెలిపారు. ఈ పరిశ్రమ కేంర్ద ప్రభుత్వ సంస్థయైనప్పటికీ రాష్ట్ర ప్రభుత్వంతో పాటు పనిచేసే కార్మికులు, ఆఫీసర్లు, కాంట్రాక్టు కార్మికులు భాగస్వాములుగా ఉన్నారని తెలిపారు. 2019లో విశాఖ పర్యటనకు వచ్చిన స్టీల్ శాఖ మంత్రి ధర్మేంధ్ర ప్రధాన్ కార్మిక సంఘాలతో చర్చించే ఏ నిర్ణయమైనా తీసుకుంటామని వాగ్ధానం చేశారని, ఇప్పుడు దానికి భిన్నంగా రహస్య ఒప్పందాన్ని ఎందుకు చేశారని ప్రశ్నించారు. ఈ ఒప్పందంతో విశాఖ ఉక్కును పోస్కోకు గానీ, దాని బినామి సంస్థకు గానీ కట్టబెట్టాలని ముందునుండి బిజెపి కేంద్ర ప్రభుత్వం కుట్ర చేసిందని స్పష్టమౌతోందని సిఐటియు పేర్కొంది. ఈ దొంగచాటు ఒప్పందాన్ని ఎటువంటి పరిస్థితుల్లోనూ అమలు జరగనీయమని హెచ్చరించింది.