May 18,2021 22:11

ప్రజాశక్తి-ఉక్కునగరం (విశాఖ)
పోరాటాల ద్వారానే హక్కులు సాధించుకోవచ్చని విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ చైర్మన్‌ డి.ఆదినారాయణ పేర్కొన్నారు. విశాఖ స్టీల్‌ప్లాంట్‌ ప్రయివేటీకరణకు వ్యతిరేకంగా విశాఖ ఉక్కు పరిరక్షణ కమిటీ ఆధ్వర్యాన కూర్మన్నపాలెం కూడలిలోని స్టీల్‌ప్లాంట్‌ ఆర్చి వద్ద చేపట్టిన రిలే నిరాహార దీక్షలు మంగళవారం నాటికి 97వ రోజుకు చేరుకున్నాయి. ముందుగా ఇప్పటివరకు కరోనాతో మరణించిన ఉద్యోగులకు నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ వేతన ఒప్పందం కోసం కార్మికులు ఎన్ని ప్రయత్నాలు చేసినా యాజమాన్యం మొండివైఖరి ప్రదర్శిస్తోందన్నారు. ఇప్పటికైనా కార్మికుల హక్కుల కోసం జరుగుతున్న పోరాటానికి మద్దతునివ్వాలని కోరారు. ఎన్ని కష్టాలు ఎదురొచ్చినా విశాఖ ఉక్కును కాపాడుకునే వరకూ ఉద్యమం కొనసాగుతుందని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో కో కన్వీనర్‌ గంధం వెంకట్రావు, జె.రామకృష్ట, టిపిపి, పిఇఎం, ఆర్‌ఇడి డిపార్ట్‌మెంట్‌ సభ్యులు బిఎంఎల్‌.నాయుడు, బి.మహేశ్వరావు, కె.అవతారం, సిహెచ్‌.శివకుమార్‌, బివి.సత్యనారాయణ, కె రామకృష్ట, శేషగిరి, మంత్రి గోపినారాయణ పాల్గొన్నారు.