Dec 03,2021 21:20

ప్రజాశక్తి-మార్కాపురం :రాబోయేది పోరాట కాలమని... పోరాటాలకు సిద్ధంగా ఉండాలని పార్టీ నాయకులకు, కార్యకర్తలకు సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు వై.వెంకటేశ్వరరావు సూచించారు. స్థానిక ఎస్‌వికెపి కళాశాల ప్రాంగణంలో రెండురోజులుగా జరుగుతున్న సిపిఎం పశ్చిమ ప్రకాశం జిల్లా 13వ మహాసభ శుక్రవారంతో ముగిసింది. చివరిరోజు మహాసభను సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు కె.ఉమామహేశ్వరరావు ప్రారంభించగా ముఖ్య అతిథిగా వై.వెంకటేశ్వరరావు ప్రసంగించారు. వెలుగొండ నిర్వాసితుల సమస్యలను రాష్ట్ర ప్రభుత్వం త్వరగా పరిష్కరించాలన్నారు. వెలుగొండకు నికర జలాలు కేటాయించేలా కేంద్రంపై రాష్ట్ర ప్రభుత్వం ఒత్తిడి చేయాలన్నారు. సిపిఎం, ప్రజా సంఘాలు ప్రజల సమస్యలపై స్పందించాలన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై ఒత్తిడి తెచ్చేలా ప్రజా ఉద్యమాలను నిర్మించాలన్నారు. క్షేత్రస్థాయిలో సిపిఎం బలోపేతం అయ్యిందంటే... ప్రజలకు ప్రయోజనం చేకూరుతుందని చెప్పారు. మొత్తం 13 తీర్మానాలను మహాసభ ఆమోదించింది. ఇందులో వెలుగొండ ప్రాజెక్టును వీలైనంత త్వరగా పూర్తి చేయాలని, పూర్తయిన మొదటి సొరంగం ద్వారా నీరు విడుదల చేయాలని, వెలుగొండ నిర్వాసితులందరికీ పునరావాసం కల్పించాలని తదితర తీర్మానాలను మహాసభ ఆమోదించింది.

హనీఫ్
హనీఫ్


పశ్చిమ ప్రకాశం కార్యదర్శిగా 'హనీఫ్‌'
సిపిఎం పశ్చిమ ప్రకాశం జిల్లా కార్యదర్శిగా సయ్యద్‌ హనీఫ్‌ ఎన్నికయ్యారు. కార్యదర్శివర్గ సభ్యులుగా ఎం.రమేష్‌, డి.సోమయ్య, వి.ఆంజనేయులు, ఊసా వెంకటేశ్వర్లు ఎన్నుకోబడ్డారు. 15 మందితో జిల్లా నూతన కమిటీ ఏర్పాటైంది.