Oct 14,2021 21:54
  • ఢిల్లీ అల్లర్ల నిందితులపై అభియోగాలు నమోదు చేస్తూ కోర్టు వ్యాఖ్య

న్యూఢిల్లీ : గతేడాది ఫిబ్రవరిలో ఢిల్లీలో రేగిన అల్లర్ల కేసులోని తొమ్మిది మంది నిందితులపై ఢిల్లీ కోర్టు అభియోగాలను మోపింది. పోలీసులు ఆలస్యంగా ప్రత్యక్ష సాక్షుల వాంగ్మూలాలను నమోదు చేశారన్న సాకుతో మొత్తంగా ప్రాసిక్యూషన్‌ కథనాన్ని తోసిపుచ్చడం 'న్యాయాన్ని సరిగా నిర్వర్తించకపోవడమే' కాగలదని ఢిల్లీ కోర్టు పేర్కొంది. పోలీసులు ప్రత్యక్ష సాక్షుల వాంగ్మూలాలను రికార్డు చేయడలో ఉద్దేశపూర్వకంగా లేదా కుట్రపూరితంగా జాప్యం చేశారని భావించలేమని అదనపు సెషన్స్‌ న్యాయమూర్తి వీరేందర్‌ భట్‌ పేర్కొన్నారు. అల్లర్లు జరిగిన తర్వాత వున్న పరిస్థితుల కారణంగానే అలా జరిగిందని అన్నారు. ప్రత్యక్ష సాక్షుల కథనాలు విశ్వసించదగ్గవి కాదని డిఫెన్స్‌ న్యాయవాది పేర్కొనడం పట్ల న్యాయమూర్తి అభ్యంతరం తెలిపారు. సంఘటన జరిగిన నెల రోజుల తర్వాత స్టేట్‌మెంట్‌ను నమోదు చేశారని అన్నారు. అల్లర్లు, గృహ దహనాలు జరిగిన తర్వాత అనేక రోజులపాటు భయానక వాతావరణం నెలకొందని న్యాయమూర్తి పేర్కొన్నారు. దీంతో భయపడిన ప్రత్యక్ష సాక్షులు సాక్ష్యమివ్వడానికి ముందుకు కూడా రాలేదని అన్నారు. ఈ పరిస్థితులన్నింటినీ దృష్టిలో వుంచుకోవాలని, ప్రాథమిక దశలోనే ఈ స్టేట్‌మెంట్లను విశ్వసించకపోతే న్యాయం నిరాకరించబడినట్లేనని వ్యాఖ్యానించారు. తొమ్మిది మంది నిందితులు చట్ట విరుద్ధంగా గుమికూడి కోట్లాది రూపాయల ఆస్తుల లూటీకి, ధ్వంసానికి పాల్పడినట్లు అభియోగాలు ఉన్నాయి. గత ఏడాది ఫిబ్రవరి 25న పెద్ద సంఖ్యలో ఇళ్లు, దుకాణాలు, పాఠశాలలు, వాహనాలను తగలబెట్టారన్న అభియోగాలను ఢిల్లీ కోర్టు ఖరారు చేసింది. ఛార్జిషీట్‌లో భాగంగా పేర్కొన్న సిసి టివి వీడియో పుటేజి గత ఏడాది ఫిబ్రవరి 24వ తేదీకి సంబంధించినదని, ఈ సంఘటన 25న జరిగిందని డిఫెన్స్‌ న్యాయవాదులు పేర్కొన్నారు. రికార్డు అయిన మొత్తం సమాచారాన్ని పరిశీలించిన మీదట ఈ అభియోగాలకు ప్రాథమిక ఆధారాలున్నట్లు కోర్టు భావిస్తున్నదని న్యాయమూర్తి తెలిపారు. నిందితులపై ఐపిసిలోని పలు సెక్షన్ల కింద అల్లరు, మారణాయుధాలను ధరించి వీదుల్లో భయానక వాతావరణాన్ని సృష్టించడం, చట్ట విరుద్ధంగా గుమికూడడం, చోరీ, మోసం,ధ్వంసం, ఇళ్లపై దాడి చేయడం అక్రమంగా చొరబడడం వంటి అభియోగాలను కోర్టు నమోదు చేసింది.