పోలీసుల సంక్షేమానికి అధిక ప్రాధాన్యం జిల్లా పోలీసు సూపరింటెండెంట్ ఎం.రవీంద్రనాథ్‌బాబు

పోలీసుల సంక్షేమానికి అధిక ప్రాధాన్యం
జిల్లా పోలీసు సూపరింటెండెంట్ ఎం.రవీంద్రనాథ్‌బాబు
కలెక్టరేట్ : పోలీసులు, వారి కుటుంబాల సంక్షేమానికి అధిక ప్రాధాన్యత ఇస్తున్నామని జిల్లా పోలీసు సూపరింటెండెంట్ ఎం.రవీంద్రనాథ్‌బాబు అన్నారు. ప్రతి సంవత్సరం జిల్లా ఆర్మిడ్ రిజర్వు సిబ్బందికి నిర్వహించే యాన్యువల్ మోబిలైజేషన్ కార్యక్రమాన్ని గురువారం ఆయన జిల్లా ఎఆర్ అడిషనల్ ఎస్పి సత్యనారాయణ కలిసి ప్రారంభించారు. మొత్తం తొమ్మిది ప్లెటూన్లతో పెరెడ్ కార్యక్రమాన్ని నిర్వహించగా ఆది శ్రీనివాస్ పెరేడ్ కమాండర్‌గా వ్యవహరించారు. ఎస్పి ఆర్మిడ్ రిజర్వు సిబ్బంది నుంచి గౌరవ వందనాన్ని స్వీకరించారు. అనంతరం పోలీసు అధికారులతో కలసి సిబ్బంది టర్నవుట్‌ను ఎస్పి పరిశీలించారు. అనంతరం ఎస్పీ సిబ్బందినుద్దేశించి మాట్లాడారు. యాన్యువల్ మొబిలైజేషన్లో భాగంగా కొన్ని రోజులపాటు వివిధ అంశాలపైన పోలీసులు ప్రతిరోజూ నిర్వహించే విధుల్లో భాగంగా చేయాల్సిన పనులు, క్రమశక్షణ, సత్ప్రవర్తన తదితర అంశాలపైన అవగాహనా శిక్షణా తరగతులను పోలీసు అధికారులు నిర్వహిస్తారన్నారు. దేహధారుడ్యస్థాయిని పరిశీలించుకోవడం, వత్తి నైపుణ్యాన్ని పెంపొందించుకోవడానికి ఇది ఒక మంచి అవకాశమన్నారు. గత సంవత్సర కాలంలో యావత్ భారతదేశ, ప్రపంచ దేశాలన్నీ కూడా యూనిఫాం సర్వీసుల సిబ్బంది అంతా కూడా కరోనా మహమ్మారి నియంత్రణలో భాగంగా విధుల్లో పాల్గొన్నారన్నారు. వీరోచితంగా పోరాడి ముందు వరుసలో నిలిచారన్నారు. ప్రజల రక్షణను దష్టిలో పెట్టుకుని ప్రాణాలకు సైతం లెక్కచేయకుండా మంచి విధులు నిర్వహించారని అభినందించారు. ఫ్రంట్ లైన్ వారియర్లుగా పోలీస్, మెడికల్, మున్సిపాలిటీ, ఇతర శాఖల వారి సేవలను దేశ ప్రధాని, రాష్ట్ర ముఖ్యమంత్రి కొనియాడారని గుర్తు చేశారు. జిల్లాలో ఎన్నో జాగ్రత్తలు తీసుకోవడం వల్ల మిగిలిన జిల్లాలతో పోల్చితే తక్కువ మంది కరోనా భారిన పడ్డారన్నారు. స్పెషల్ బ్రాంచ్ డిఎస్పి ధర్మేంద్ర, ఎఆర్ డిఎస్పి విజరు కుమార్, స్పెషల్ బ్రాంచ్ సిఐ నాగేంద్రకుమార్, డిసిఆర్బి సిఐ రమేష్, ఆర్‌బిలు వెంకట్రావు, శ్రీనివాసరావు, చంద్రశేఖర్, ఆర్ఎస్ఐలు, సిబ్బంది, మహిళా పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.