
అమరావతి: ఎపి శీతాకాల సమావేశాల తొలిరోజు గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. అధికారపార్టీ తీరును టిడిపి సభ్యులు తప్పుపట్టారు. ఒకానొక సమయంలో చంద్రబాబునాయుడు స్పీకర్ పోడియం ఎదుట కూర్చొని నిరసన తెలిపారు. తుపాను పరిహారంపై జరిగిన చర్చలో టిడిపి సభ్యుడు నిమ్మల రామానాయుడు చేసిన ఆరోపణలపై ముఖ్యమంత్రి జగన్ సమాధానమిచ్చారు. అనంతరం దీనిపై మాట్లాడేందుకు చంద్రబాబు ప్రయత్నించగా అధికారపక్ష సభ్యులు అడ్డుకున్నారు. దీనిని చంద్రబాబు తప్పుపట్టారు. టిడిపి సభ్యులతో కలిసి స్పీకర్ పోడియం ఎదుట బైఠాయించారు. దీనిపై జగన్ మాట్లాడుతూ చంద్రబాబు కావాలనే పోడియం ఎదుట బైఠాయించారని, రౌడీయిజం చేస్తున్నారని వ్యాఖ్యానించారు. ఆందోళన అంతకంతకూ కొనసాగడంతో స్పీకర్ తమ్మినేని సీతారామ్ ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు సహా ఆ పార్టీకి చెందిన 12 మందిని సస్పెండ్ చేశారు. సభా కార్యక్రమాలకు అడ్డు తగులుతున్నారంటూ టిడిపి ఎమ్మెల్యేలు కింజరాపు అచ్చెన్నాయుడు, నిమ్మల రామానాయుడు, ఏలూరి సాంబశివరావు, ఆదిరెడ్డి భవాని,గద్దె రామ్మోహన్, బెందాళం అశోక్, మంతెన రామరాజు, పయ్యావుల కేశవ్, అనగాని సత్యప్రసాద్, వేగుళ్ల జోగేశ్వరరావు, గోరంట్ల బుచ్చయ్యచౌదరిలను సస్పెండ్ చేశారు. ఒకరోజు వారిపై సస్పెన్షన్ వేటు వేసినట్లు స్పీకర్ ప్రకటించారు.