Nov 30,2020 21:36

పార్వతీపురం డిపో వద్ద నిరసన తెలుపుతున్న కార్మికులు

విజయనగరంకోట : కరోనా కాలంలో బస్సులు తిరగక, తమకు పనుల్లేక తీవ్ర ఆర్థిక ఇబ్బందులు పడుతున్నామని, ఈ కాలానికి తమకు వేతనాలను చెల్లించాలని ఎపిఎస్‌ ఆర్టీసి అద్దెబస్సు డ్రైవర్ల యూనియన్‌ డిమాండ్‌ చేశారు. ఈ మేరకు జిల్లాలోని విజయనగరం, పార్వతీపురం, సాలూరు డిపోల్లో కార్మికులు సిఐటియు ఆధ్వర్యాన ధర్నా చేశారు. విజయనగరం డిపో వద్ద జరిగిన నిరసననుద్దేశించి యూనియన్‌ అధ్యక్షులు జెఎస్‌ఎన్‌ రాజు మాట్లాడుతూ సంస్థనే నమ్ముకుని బతుకుతున్న కార్మికుల కుటుంబాలు కనీస అవసరాలు తీర్చకోలేక ఇబ్బందులో వున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. డ్రైవర్లందరికీ రీ మెడికల్‌ చేయాలన్నారు. బస్సు పాసులు పునరుద్ధరణ చేయాలన్నారు. ఈకార్యక్రమంలో డిపో కార్యదర్శి ఎస్‌ఎం.రావు, జిల్లా జాయింట్‌ సెక్రటరీ ఎం.కోటేశ్వరరావు, సిఐటియు నాయకులు కె.సురేష్‌, పలువురు అద్దె బస్సు డ్రైవర్లు పాల్గొన్నారు.
పార్వతీపురంటౌన్‌ : అద్దెబస్సు కార్మికులు 8 నెలలుగా జీతాలు లేక ఆకలితో అలమటిస్తున్నారని, బకాయి పడ్డ జీతాలు వెంటనే చెల్లించాలని సిటియు జిల్లా అధ్యక్షులు గొర్లె వెంకటరమణ, సిపిం జిల్లా కార్యదర్శి రెడ్డి శ్రీరామ్మూర్తి డిమాండ్‌ చేశారు. లాక్‌డౌన్‌ నాటి నుంచి జీతాలు చెల్లించాలని డిమాండ్‌ చేస్తూ సోమవారం స్థానిక ఆర్టీసీ డిపో ముందు నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బస్సు యజమానులకు ప్రభుత్వం రూ.50వేలు చొప్పున ఇచ్చానా, వారు మాత్రం డ్రైవర్లకు, కండక్టర్లకు ఒక్కరూపాయి కూడా చెల్లించకపోవడం బాధాకరమన్నారు. డిసెంబర్‌ 1నుంచి బస్సులు నడపమని చెప్పడంతో యజమానులు బస్సులు నడపండనిఒత్తిడి తెస్తున్నారని, తమకు జీతాలు చెల్లిస్తే గాని బండినడపమని అన్నారు. అలాగే పిఎఫ్‌, ఈఎస్‌ఐ సౌకర్యం కల్పించాలని, బస్సు పాసులను పునరుద్దరించాలని అన్నారు. కార్యక్రమంలో అద్బెబస్సు కార్మిక సంఘ రాష్ట్ర కార్యదర్శి కోరాడ చిట్టిబాబు, కె.వి.చారీ, అధ్యక్షులు వి.డి.ప్రసాదరావు, కార్మికులు పాల్గొన్నారు.
సాలూరు : తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ డిపో పరిధిలోని అద్దె బస్సు డ్రైవర్లు డిపో గేటు ముందు యూనియన్‌ గౌరవాధ్యక్షులు ఎన్వైనాయుడు ఆధ్వర్యాన డ్రైవర్లు ధర్నా చేశారు. కార్యక్రమంలో అద్దె బస్సు డ్రైవర్ల సంఘం నాయకులు ఎం.సత్యనారాయణ, ఎల్‌.వెంకటి, కె.రాంబాబు పాల్గొన్నారు.