Nov 24,2020 15:25

న్యూఢిల్లీ : మూడోదశలో రాష్ట్రంలో కరోనా కేసులు పెరగడానికి వాయు కాలుష్యం కూడా ప్రధాన కారణమని, పొరుగున ఉన్న రాష్ట్రాల్లో పంట వ్యర్థాలను తగుల బెట్టడంతో వాయు కాలుష్యం పెరిగిపోతుందని ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌ అన్నారు. ఈ విషయంలో ప్రధాని జోక్యం చేసుకోవాలని కోరారు. కరోనా కేసులు అధికంగా నమోదవుతున్న రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ప్రధాని మోడీ మంగళవారం వర్చువల్‌ సమావేశం నిర్వహించారు. మహారాష్ట్ర, కేరళ, పశ్చిమబెంగాల్‌, గుజరాత్‌, చత్తీస్‌ఘర్‌, రాజస్థాన్‌, ఢిల్లీ, హర్యానాల్లో గత కొన్ని రోజులుగా కరోనా విజృంభిస్తున్న సంగతి తెలిసిందే. దీంతో ఆయా రాష్ట్రాల్లో కరోనా పరిస్థితులు, కేసుల పెరుగుదలకు గల కారణాలు, కరోనా వ్యాప్తిని నివారించేందుకు ప్రణాళికలను రూపొందించేందుకు అవసరమైన చర్చలు జరిపారు. కరోనా మూడోదశలో నవంబర్‌ 10న అత్యధికంగా 8,593 కేసులు నమోదయ్యాయని, అనంతరం కేసుల సంఖ్య క్రమంగా తగ్గుతోందని కేజ్రీవాల్‌ అన్నారు. ఇదే విధంగా కేసుల తగ్గుదల కొనసాగుతుందని ఆశిస్తున్నట్లు తెలిపారు. సోమవారం 37వేల శాంపిల్స్‌ను పరీక్షించగా.. 4,454 కరోనా కేసులు నమోదు కాగా, 121మంది మరణించారు. గడిచిన 12 రోజుల్లో కరోనాతో పాటు వాయు కాలుష్యం తోడవడంతో.. ఆరుసార్లు మరణాల సంఖ్య వందను దాటిందని కేజ్రీవాల్‌ అన్నారు. ఈ నేపథ్యంలో పొలాల్లో బయో డి కంపోజర్‌ను ప్రోత్సహించడంతో తక్కువ ఖర్చుతో, సమస్యకు తేలికైన పరిష్కారం దొరుకుతుందని కేజ్రీవాల్‌ ప్రభుత్వాన్ని కోరారు. అలాగే ఆస్పత్రులలో కరోనా బాధితుల కోసం అదనంగా 1000 ఐసియు బెడ్‌లను అందించాలని కేంద్రాన్ని కోరారు.