Nov 28,2020 22:18

ొ 33 శాతం పైబడితేనే పరిహారం
ొ వైఎస్‌ఆర్‌ బీమా అందేనా ?
ొ ప్రాథమిక అంచనాల్లో మరింత పెరిగిన నష్టం
ప్రజాశక్తి - కృష్ణాప్రతినిథి

నివర్‌ తుపాను ప్రభావానికి పంటల నష్టం శనివారం మరింత పెరిగింది. జిల్లాలోని 46 మండలాల్లో నష్టం జరిగింది. 2 లక్షల 37 వేల 555 ఎకరాల్లో వరి, 178 ఎకరాల్లో మినుము, 113 ఎకరాల్లో వేరుశనగ పంటలు ముంపునకు గురయినట్లు వ్యవసాయశాఖ ప్రాథమిక అంచనా. ఉన్న పంటను సంరక్షించుకునేందుకు రైతులు ప్రయత్నిస్తున్నారు. పొలాల్లో నీటిని బయటకు పంపేందుకు బోదెలు వేయడం, పడిపోయిన పొలాలను తిరిగి నిలబెట్టి కట్టడం, నీటిలో పనలను రోడ్లుపైకి చేరవేయడం ద్వారా సంరక్షించుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. శనివారం ఉదయం నుంచి వాతావరణం కొంత అనుకూలించింది. సాయంత్రం తిరిగి జల్లులు మొదలవ్వడంతో రైతులు ఆందోళన చెందారు. నివర్‌ తుపానుతో రైతులకు పూడ్చలేని నష్టం వాటిల్లింది. నష్టానికి సంబంధించి క్షేత్రస్థాయి బృందాలు ప్రతి గ్రామంలోనూ తుది అంచనాలు రూపొందిస్తున్నాయి. విలేజ్‌ అగ్రికల్చర్‌ అసిస్టెంట్‌ (విఎఎ), గ్రామ రెవెన్యూ సహాయకులు (విఆర్‌ఒ), రైతు మిత్ర గ్రూపు కన్వీనర్లు, ప్రోగ్రసివ్‌ ఫార్మర్‌తో కూడిన బృందం క్షేత్రస్థాయిలో పరిశీలిస్తోంది. నిబంధనల ప్రకారం 33 శాతానికిపైగా పంట నష్టపోయిన వారి పేర్లను మాత్రమే పరిహారం నమోదుకు పరిగణలోకి తీసుకుంటారు. రైతు పేరు, ఆధార్‌ సంఖ్య, విస్తీర్ణం, సర్వే సంఖ్య, బ్యాంకు ఖాతా సంఖ్య తదితరాలతో కూడిన 33 కాలమ్‌ల ప్రొఫార్మాను ఈ బృందం పూర్తి చేయాల్సి ఉంటుంది. గతంలో 29 కాలమ్స్‌ మాత్రమే దీనిలో ఉండేవి. తాజాగా నాలుగు కాలమ్స్‌ను పెంచారు. డిసెంబర్‌ 10 తేదీకి జిల్లాలో తుది జాబితాను రూపొందించి ప్రభుత్వానికి అందించాల్సి ఉంది. ఒక బస్తాకు 75 కిలోల చొప్పున జిల్లాలో సగటు ధాన్యం దిగుబడులు ఎకరానికి 30 బస్తాలుగా పరిగణలోకి తీసుకుంటున్నారు. 33 శాతం నష్టం 20 బస్తాలలోపు దిగుబడులు వచ్చిన రైతుల పేర్లను మాత్రమే పరిహారానికి పరిగణలోకి తీసుకుంటారు. ఒక్కో రైతుకు ఎకరానికి రూ.6 వేల చొప్పున 5 ఎకరాలకు మాత్రమే పరిహారం అందిస్తారు. ఒక ఏడాదిలో ఒకసారి మాత్రమే ఇస్తారు.
మురిగిపోయిన మినుము విత్తనాలు
తాజాగా 7,200 క్వింటాళ్లకు వ్యవసాయ శాఖ ఇండెంట్‌
జిల్లాలో ఖరీఫ్‌లో వరిమాగాణులు సాగైన పొలాల్లో కోతలు కోసే సమయంలో రబీలో ఎక్కువ విస్తీర్ణంలో మినుము విత్తనాలు వెదజల్లుతారు. జిల్లాలో 90 వేల ఎకరాల్లో మినుము విత్తనాలను వెదజల్లారు. వర్షానికి నీరు నిలిచిపోవడంతో పొలాల్లోని విత్తనాలన్నీ మురిగిపోయాయి. ఎకరానికి సగటున 16 కిలోల విత్తనాలు వెదజల్లుతారు. కిలో రూ.90 చొప్పున రూ.1,440 విలువైన విత్తనాలను నష్టపోయారు. వెదజల్లే క్రమంలో కూలీ ఖర్చులు, వరి దారులు తీయడం తదితరాలకు అదనంగా ఖర్చవుతుంది. వరి పంటతోపాటు ఈ మేరకు కూడా రైతులకు నష్టం వాటిల్లింది. ముంపు సమస్య తగ్గగానే ముమ్మరంగా వరి కోతలు మొదలవుతాయి. ప్రస్తుతం కోతలు పూర్తయిన భూముల్లోనూ తిరిగి అపరాలు వెదజాల్లాల్సి వస్తుంది. ఈ క్రమంలో మినుము విత్తనాలకు కొరత ఏర్పడే పరిస్థితి ఉందని వ్యవసాయశాఖ అంచనా. ఈ నేపథ్యంలో జిల్లాకు 7,200 క్వింటాళ్ల విత్తనాలు తక్షణం అవసరమని సీడ్‌ కార్పొరేషన్‌కు ఇండెంట్‌ పెట్టింది. క్వింటా రూ.9,600 సీడ్‌ రేట్‌గా నిర్ణయించారు. దీనిలో రాయితీ ఎంత ఇవ్వాలనేది ప్రభుత్వం నిర్ణయించాల్సి ఉంది.
వైఎస్‌ఆర్‌ ఉచిత పంటల బీమా అందేనా ?
పంటల బీమా చెల్లింపునకు మొత్తం ఐదేళ్ల కాలంలో పంట దిగుబడులను ప్రామాణికంగా తీసుకుని దానిలో అత్యధిక దిగుబడులు మూడేళ్ల సగటును ప్రామాణికంగా తీసుకుంటారు. జిల్లాలో 30 బస్తాలు సగటుగా ఉన్నట్లు గణాంకశాఖ అధికారులు చెబుతున్నారు. బీమాలోనూ రెండు రకాలున్నాయి. ఒకటి పంట దిగుబడులు ఆసరా చేసుకుని, మరొకటి ప్రకృతి వైపరీత్యాలతో పెట్టుబడులు నష్టపోయిన సందర్భాల్లోనూ ఇస్తారు. అయితే గతంలో ప్రథానమంత్రి ఫసల్‌ బీమా పథకంలో ప్రీమియం మొత్తంలో 50 శాతం రైతు వాటా చెల్లించేవారు. రెండేళ్లుగా రాష్ట్ర ప్రభుత్వమే రైతులందరికీ వైఎస్‌ఆర్‌ ఉచిత పంటల బీమా పథకాన్ని ప్రవేశపెట్టింది. వరి ఒక్కో ఎకరానికి రైతులు రూ.20 నుంచి రూ.25 వేల వరకు పెట్టుబడి పెట్టారు. జిల్లాలో గ్రామాన్ని 250 ఎకరాలను యూనిట్‌గా తీసుకుని పంట నష్టం అంచనా వేసి బీమా చెల్లించాల్సి ఉంది. ఈ బీమా ఎంత వరకు రైతులకు వర్తింప చేస్తారనేది చర్చనీయాంశంగా ఉంది.