Nov 26,2021 07:33
  • ప్రాథమికంగా పదిన్నర లక్షల ఎకరాలు
  • కేంద్రానికి నివేదించింది 4.7 లక్షల ఎకరాలు

ప్రజాశక్తి ప్రత్యేక ప్రతినిధి- అమరావతి : ఇటీవలి భారీ వర్షాల పంట నష్టాలపై ప్రభుత్వం గీసి గీసి అంచనాలు రూపొందిస్తోంది. పంట నష్టాలపై వ్యవసాయ, ఉద్యానవన శాఖల నివేదికలకు, రాష్ట్ర ప్రభుత్వం తరఫున తక్షణ సాయం కోరుతూ ముఖ్యమంత్రి కేంద్రానికి రాసిన లేఖలో పేర్కొన్న దానికి మధ్య భారీ వ్యత్యాసం కనిపిస్తోంది. ఎదేనిగాని రాష్ట్ర ప్రభుత్వం కేంద్రాన్ని సహాయం అడిగే సందర్భాల్లో కాస్త ఎక్కువ నష్టాలను చూపించి ఎక్కువ నిధులు కోరడం పరిపాటి. కాగా ఈ ప్రభుత్వం తమ డిపార్టుమెంట్లు వేసిన ప్రాథమిక అంచనాల కంటే కూడా తక్కువ నష్టాలను కేంద్రానికి చూపించడంపై సర్వత్రా విస్మయం వ్యక్తమవుతోంది. కేంద్రాన్ని అంతగా నొప్పించకూడదన్న ఉద్దేశంతోనే తక్కువ పంట నష్టాలను ప్రధానికి సిఎం రాసిన లేఖలో పేర్కొని ఉంటారని ప్రభుత్వ వర్గాలు గుస గుసలాడుతున్నాయి. వరుస తుపాన్లు, వాయుగుండాలు, అల్పపీడనాల ప్రభావంతో వారం రోజుల నుండి రాయలసీమ, నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో కుంభవృష్టి కురుస్తోంది. రాష్ట్రంలో మిగతా అన్ని జిల్లాల్లోనూ ఎంతో కొంత మేర వానలు పడుతున్నాయి. ఖరీఫ్‌ పంటలు కోతలమీద ఉన్న తరుణంలో భారీ వర్షాలు పడుతుండటంతో పంట నష్టాలు భారీగానే ఉంటున్నాయి. వ్యవసాయ, హార్టికల్చర్‌ శాఖల ప్రాథమిక సమచారం మేరకు పదిన్నర లక్షల ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నాయి. కానీ పంట నష్టాలపై ప్రధానికి, కేంద్ర హోం మంత్రికి ముఖ్యమంత్రి రాసిన లేఖలలో మాత్రం 4.70 లక్షల ఎకరాల్లోని పంటలకు నష్టం వాటిల్లిందని పేర్కొన్నారు. దాదాపు రూ.1,400 కోట్ల విలువైన పంట నష్టం జరిగిందని తెలిపారు. ఎన్యూమరేషన్‌ పూర్తి కానందున సిఎం లేఖలో ప్రాథమిక సమాచారమే ఉంటుందని భావించినా, వ్యవసాయ, హార్టికల్చర్‌ విభాగాలకు అందిన ప్రాథమిక అంచనాలు వేరేగా ఉన్నాయి. వ్యవసాయశాఖ అంచనాల ప్రకారం 7 లక్షల ఎకరాల్లో ఖరీఫ్‌ పంటలు దెబ్బతిన్నాయి. రబీలో ఇప్పటికే సాగు చేసిన రెండున్నర లక్షల ఎకరాల్లో పంటలకు నష్టం వాటిల్లింది. మరో లక్ష ఎకరాల్లో హార్టికల్చర్‌ పంటలు దెబ్బతిన్నాయి. మొత్తం కలిపితే పదిన్నర లక్షల ఎకరాల్లో పంటలకు నష్టం జరిగింది. తక్షణ సహాయం కోసం కేంద్రానికి ముఖ్యమంత్రి రాసిన లేఖలో 4.7 లక్షల ఎకరాల్లోనే పంట నష్టం చూపించారు. ప్రభుత్వ విభాగాలు వేసిన ప్రాథమిక అంచనాల కంటే సగానికి సగం తగ్గింది. అసలే కేంద్రం రాష్ట్రానికి విపత్తు నిధులిచ్చే విషయంలో వివక్ష చూపిస్తుండగా, సాయం కోరే సమయంలో వాస్తవ నష్టాల కంటే అంచనాలను కుదిస్తే అసలుకే మోసం వస్తుందని ప్రభుత్వ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.