ఒంగోలు కలెక్టరేట్: వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలనే ఏకైక డిమాండ్‌తో ఒంగోలు నగరంలో ట్రాక్టర్ ర్యాలీ నిర్వహించారు. సుమారు ఐదు కిలోమీటర్ల మేర ర్యాలీ సాగింది. డప్పు కళాకారుల విన్యాసాలు, కళాకారుల ప్రదర్శనలు, చిన్నారుల పాటలతో ర్యాలీ ఉత్సాహంగా సాగింది. 200 మోటార్ బైక్‌లు ర్యాలీ అగ్రభాగాన సాగాయి. ట్రాక్టర్ల ర్యాలీకి వామపక్షాలు, ప్రజాసంఘాల నాయకులు సంఘీభావం తెలియజేశారు. రైతాంగ ఉద్యమానికి మద్దతుగా ఎఐకెఎస్సిసి పిలుపు మేరకు ప్రకాశం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఈ ర్యాలీని గురువారం చేపట్టారు. అనంతరం ఒంగోలు పివిఆర్ బాలుర ఉన్నత పాఠశాలలో జరిగిన బహిరంగ సభకు ఎపి రైతు సంఘం జిల్లా కార్యదర్శి వడ్డే హనుమారెడ్డి అధ్యక్షత వహించారు. తొలుత రైతాంగ ఉద్యమంలో అసువులు బాసిన 141 మంది రైతులకు సభ 2 నిమిషాలు మౌనం పాటించింది.ముఖ్య అతిథిగా విచ్చేసిన అఖిల భారత కిసాన్ సభ(ఎఐకెఎస్) జాతీయ సహాయ కార్యదర్శి విజ్జూ కృష్ణన్ మాట్లాడుతూ.. ఢిల్లీలో రైతాంగం చేపట్టిన ఉద్యమం పంజాబ్ రైతుల ఉద్యమం కాదని దేశంలోని రైతులందరి ఉద్యమమని తెలిపారు. అన్నదాతలపై మోడీ ప్రభుత్వం వాటర్ కెనాన్స్, టియర్ గ్యాస్‌ను ప్రయోగించినా శాంతియుతంగా ఉద్యమాన్ని కొనసాగిస్తున్నారన్నారు.దేశవ్యాప్తంగా 3600 కేంద్రాలలో చట్టాల ప్రతుల దగ్ధం చేపట్టారన్నారు.అంబానీ, అదానీ కోసం మోడీ ప్రభుత్వం వ్యవసాయ చట్టాలను తీసుకొచ్చిందన్నారు. నల్ల చట్టాలను రద్దు చేయాలని కోరుతూ ఉద్యమంలో అసువులు బాసిన రైతు కుటుంబాలకు ప్రధాని సంతాపం తెలియజేయలేదని విమర్శించారు.ఉద్యమంలో మరణించిన ప్రతి రైతు కుటుంబానికి కోటి రూపాయలు ఎక్స్‌గ్రేషియా చెల్లించాలని డిమాండ్ చేశారు. స్వామినాథన్ కమిషన్ సిఫారసులను అమలు చేయాలని, ఉత్పత్తి కంటే 50 శాతం అదనంగా కనీస మద్దతు ధర ఇవ్వాలని కోరారు. వ్యవసాయ చట్టాలు, విద్యుత్ సవరణ బిల్లును ఉపసంహరించుకునే వరకు పోరాటాన్ని కొనసాగిస్తామని తెలియజేశారు. ర్యాలీని విజయవంతం చేసిన రైతులు, ప్రజలు, వామపక్షాలు, ప్రజా సంఘాల నాయకులకు కృతజ్ఞతలు తెలియజేశారు. కౌలు రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బి.జమలయ్య మాట్లాడుతూ.. వ్యవసాయ చట్టాల రద్దు కోరుతూ 2024 వరకు పోరాటాన్ని కొనసాగించేందుకు రైతాంగం సిద్ధంగా ఉందన్నారు. సమావేశంలో ఎఐకెఎస్సిసి, ఎపిరైతు సంఘం, వ్యవసాయ కార్మిక సంఘం, కౌలు రైతు సంఘం, రైతు కూలిసంఘం, ప్రజాసంఘాల నాయకులు, తదితరులు పాల్గన్నారు. వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు తెలిపారు. 26న చేపట్టనున్న ట్రాక్టర్ ర్యాలీలను జయప్రదం చేయాలని కోరుతూ కరపత్రాలు పంపిణీ చేశారు. చిత్తూరు జిల్లా మదనపల్లిలో ఆటోలతో ప్రదర్శన నిర్వహించారు. మల్లికార్జున సర్కిల్, బెంగళూరు బస్టాండ్, సుందరయ్య సర్కిల్, సిటిఎం రోడ్డు, అంబేద్కర్ సర్కిల్ వరకూ ప్రదర్శన సాగింది.