
ప్రజాశక్తి-గుంటూరు : ఎపి పంచాయతీరాజ్ మినిస్టీరియల్ ఉద్యోగుల సంఘం జిల్లా యూనిట్ ఎన్నికలు, నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారాన్ని స్థానిక జెడ్పి ప్రాంగణంలో ఆదివారం నిర్వహించారు. అధ్యక్షులుగా జొన్నల పూర్ణచంద్రారెడ్డి, అసోసియేట్ ప్రెసిడెంట్‌గా తోట శ్రీనివాసరావు, జనరల్ సెక్రెటరీగా షేక్.అబ్దుల్ అజీజ్, ట్రెజరర్‌గా ఎం.ఎస్.ఆర్.కె ప్రసాద్ మరో 19 మందితో నూతన కార్యవర్గం ఏకగ్రీవంగా ఎన్నికైంది. వీరిని ఎపి జెఎసి ఛైర్మన్ ఎన్.చంద్రశేఖర్‌రెడ్డి ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా నిర్వహించిన సభకు ఎపి పిఆర్ మినిస్టీరిల్ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు బండి శ్రీనివాసరావు అధ్యక్షత వహించారు. ఎపి జెఎసి సెక్రెటరీ జనరల్ జోసఫ్ సుధీర్‌బాబు మాట్లాడారు. ఎన్నికలకు ఎపి ఎన్‌జిఒ రాష్ట్ర ఉపాధ్యక్షులు టివి.రామిరెడ్డి ఎన్నికల అధికారిగా వ్యవహరించారు. అసోసియేషన్ రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రెటరీ కూచిపూడి మోహనరావు, లాలపరెడ్డి, నాగరాజు పాల్గొన్నారు.