Feb 23,2021 20:40

శ్రీకాకుళం: శ్రీకాకుళం జిల్లాలో పంచాయతీ ఎన్నికల ఫలితాల చిచ్చు ఇంకా చల్లారలేదు. ఎన్నికల ప్రక్రియ ముగిసినా పలు గ్రామాల్లో ఉద్రిక్తత పరిస్థితులు కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల మండలం బుడగట్లపాలెంలో వైసిపి మద్దతుదారులు టిడిపికి చెందిన వారిపై దాడి చేయగా, జి.సిగడాం మండలం మెట్టవలసలో వైసిపి, టిడిపి నాయకుల మధ్య కొట్లాట చోటుచేసుకుంది. నాలుగో విడత పంచాయతీ ఎన్నికల్లో బుడగట్లపాలెం పంచాయతీ సర్పంచ్‌గా టిడిపి మద్దతుదారుడు అల్లిపిల్లి రాంబాబు గెలుపొందాడు. కౌంటింగ్‌ పూర్తయినప్పటి నుంచి గుర్రుగా ఉన్న వైసిపి నాయకులు మంగళవారం టిడిపి మద్దతుదారుల ఇళ్లపై కర్రలు, రాళ్లతో విరుచుకుపడ్డారు. ఇళ్లల్లోకి చొరబడి దాడులు చేయడంతో పాటు వస్తువులను ధ్వంసం చేశారు. ఈ దాడిలో పది మంది టిడిపి మద్దతుదారులు గాయపడ్డారు. క్షతగాత్రులు శ్రీకాకుళం రిమ్స్‌లో చికిత్స పొందుతున్నారు. డిఎస్‌పి మహేంద్ర ఆధ్వర్యాన పోలీసులు పరిస్థితిని అదుపులోకి తెచ్చారు.
జి.సిగడాం మండలం మెట్టవలస పంచాయతీలో టిడిపి మద్దతుదారుడు అమోజుల ఆరుద్ర 40 ఓట్లతో విజయం సాధించారు. దీన్ని జీర్ణించుకోలేని వైసిపి నాయకులు సామాజిక మాధ్యమాల్లో అసభ్యకర పోస్టులు పెట్టారు. వీటిపై టిడిపి నాయకులు ప్రశ్నించడంతో చెలరేగిన వివాదం కొట్లాటకు దారితీసింది. ఈ ఘటనలో మొత్తం పది మందికి గాయపడ్డారు. క్షతగాత్రులను రాజాం సిహెచ్‌సికి తరలించారు. సిఐ నవీన్‌ ఆధ్వర్యాన పోలీసులు గ్రామానికి చేరుకున్నారు. ఉద్రిక్తతల నేపథ్యంలో పోలీస్‌ పికెట్‌ను ఏర్పాటు చేశారు.