Oct 28,2021 18:34

పంచాయతీ అభివృద్ధే లక్ష్యం

ప్రజాశక్తి- యర్రావారిపాలెం
మండలంలోని విఆర్‌ అగ్రహారం పంచాయతీని అభివృద్ధి పథంలో నడిపించడమే లక్ష్యమని సర్పంచ్‌ వెంకటరమణారెడ్డి తెలిపారు. గతంలో ఎన్నడూ లేని విధంగా పంచాయతీకి అవసరమైన తాగునీరు, విద్యుత్‌ సరఫరా, వీధి లైట్లు, డ్రైనేజీ కాలువలు, సిసి రోడ్లు, అర్హులైన ప్రతి ఒక్కరికీ పింఛన్లు సకాలంలో అందిస్తున్నామని తెలిపారు. నిత్యం ప్రజలతో మమేకమై పంచాయతీలోని సమస్యలను పరిష్కరిస్తూ రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలు అమలు చేస్తున్నామని తెలిపారు. కరోనా సమయంలోనూ తన వంతు సాయంగా గ్రామ ప్రజలకు కూరగాయలు, పండ్లు, శానిటైజర్‌, మాస్కులు పంపిణీ చేశానని తెలిపారు. అంతే కాకుండా తరచూ వైద్య శిబిరాలను ఏర్పాటు చేస్తూ ప్రజలకు వైద్య సేవలను అందుబాటులో ఉంచుతున్నట్లు పేర్కొన్నారు. పార్టీలకు అతీతంగా ప్రజలకు సంక్షేమ పథకాల అందేలా చర్యలు తీసుకుంటామని, అర్హులైన వారికి లబ్ది చేకూరేలా చూస్తానని హామీ ఇచ్చారు. అలాగే ఉపాధి హామి, రైతుభరోసా కేంద్రాల ద్వారా గ్రామంలో వ్యవసాయ సంబంధింత పనులను పేదలకు కల్పించి ఉపాధి చేకూరేలా చేస్తానని తెలిపారు. అలాగే పంచాయతీలోని పేద విద్యార్థులకు అవసరమైన విద్యను ప్రభుత్వ పాఠశాలల ద్వారా అందిస్తానని, జగనన్న విద్యా దీవెన విద్యార్థులకు అందజేసి పిల్లలందరూ బడికి వెళ్లేలా చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన నాడు-నేడు పనుల ద్వారా పంచాయతీలోని బడుల్లో మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేసి కార్పొరేట్‌కు దీటుగా ప్రభుత్వ పాఠశాలను తీర్చిదిద్దుతామని అన్నారు.