Jan 25,2021 21:49

పల్లెపోరుకు సై 

ప్రజాశక్తి - విజయనగరం ప్రతినిధి : పంచాయతీ ఎన్నికలపై ప్రతిష్టంభన వీడింది. ఎన్నికలు నిర్వహించాల్సిందేనంటూ సుప్రీం కోర్టు ఆదేశాలు జారీచేయడంతో రాష్ట్ర ప్రభుత్వం అనివార్యంగా ఇందుకు సిద్ధపడాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీంతో, రాష్ట్ర ఎన్నికల సంఘం కూడా రీషెడ్యూల్‌ ప్రకటించింది. మరోవైపు జిల్లాలో రాజకీయ వాతావరణం వేడెక్కింది. గ్రామాల్లో రచ్చబండ రాజకీయాలు ఊపందుకున్నాయి. తాజా షెడ్యూల్‌ ప్రకారం ఫిబ్రవరి 13, 17తేదీల్లో మన జిల్లాలోని పంచాయతీ ఎన్నికల పోలింగ్‌ నిర్వహించాల్సివుంది. కానీ, జిల్లాలోని ఎన్నికల అధికారులు మాత్రం ఎలాంటి ప్రకటనా చేయలేదు. కనీసం కోడ్‌ ప్రస్తావ కూడా చేయకపోవడంతో ప్రభుత్వ అనుమతి కోసం ఇంకా ఎదురు చూస్తున్నట్టు తెలుస్తోంది. ఎన్నికల నిర్వహణకు కోర్టు నుంచి స్పష్టమైన ఆదేశాలు ఉండడంతో గ్రామాల్లో రాజకీయం వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. ఈనెల 8న నోటిఫికేషన్‌ విడుదల చేయడంతో ప్రభుత్వం హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేసిన విషయం విధితమే. కోవిడ్‌ వ్యాప్తిచెందే అవకాశముందన్న ప్రభుత్వ వాదనను తిరస్కరించింది. దీంతో, ప్రభుత్వం మరో అడుగు ముందుకు వేసి సుప్రీంకోర్టుకు వెళ్లినప్పటికీ ప్రభుత్వ వ్యూహం నెరవేరలేదు. ఎన్నికలు వాయిదా సరికాదని ధర్మాసనం స్పష్టం చేసింది. దీంతో, ఎస్‌ఇసి షెడ్యూల్‌లో స్వల్ప మార్పులు చేసింది. తాజా షెడ్యూల్‌ ప్రకారం... పార్వతీపురం రెవెన్యూ డివిజన్‌లో ఫిబ్రవరి 13న, విజయనగరం డివిజన్‌లో ఫిబ్రవరి 17న పోలింగ్‌ జరగనుంది. 13న జరగాల్సిన ఎన్నికలకు సంబంధించి 2వ తేదీ నుంచి 4వ తేదీ వరకు నామినేషన్లు స్వీకరిస్తారు. 5వ తేదీన నామినేషన్లు పరిశీలిస్తారు. 6న అభ్యంతరాలను పరిశీలిస్తారు. 7న అభ్యంతరాలపై తుది నిర్ణయం తీసుకుంటారు. 8వ తేదీన నామినేషన్ల ఉపసంహరణకు తుదిగడువు. 13వ తేదీ ఉదయం 6.30గంటల నుంచి మధ్యాహ్నం 3.30గంటల వరకు పోలింగ్‌ కొనసాగుతుంది. అదే రోజు సాయంత్రం 4గంటల నుంచి ఓట్ల లెక్కింపు మొదలవుతుంది. 
విజయనగరం డివిజన్‌ పరిధిలో ఫిబ్రవరి 17న పోలింగ్‌ జరుగుతుంది. 6వ తేదీ నుంచి 8వ తేదీ వరకు నామినేషన్లు స్వీకరిస్తారు. 9వ తేదీన నామినేషన్లు పరిశీలిస్తారు. 10న అభ్యంతరాలను పరిశీలిస్తారు. 11న అభ్యంతరాలపై తుది నిర్ణయం తీసుకుంటారు. 12వ తేదీన నామినేషన్ల ఉపసంహరణకు తుదిగడువు. 17వ తేదీ ఉదయం 6.30గంటల నుంచి మధ్యాహ్నం 3.30గంటల వరకు పోలింగ్‌ కొనసాగుతుంది. అదే రోజు సాయంత్రం 4గంటల నుంచి ఓట్ల లెక్కింపు మొదలవుతుంది. జిల్లా వ్యాప్తంగా 960 పంచాయతీలు ఉన్నాయి. వీటిలో ఎన్నింటింకి ఎన్నికలు నిర్వహిస్తారనేది స్పష్టం కావాల్సివుంది. దీంతోపాటు ఎన్నికల కోడ్‌ అమలు, నియమావళికి తదితర విధివిధానాలపై ఇప్పటి వరకు జిల్లా అధికారులు నోరు మొదపకపోవడం గమనార్హం.