Nov 26,2021 02:00

ప్రజాశక్తి-విశాఖపట్నం ప్రతినిధి
పంచాయతీలో మౌలికసదుపాయాలు, అభివృద్ధి పనులకు ఖర్చు చేయాల్సిన 14, 15వ ఆర్థిక సంఘం నిధులు ప్రభుత్వం దారి మళ్లించింది. వీధిలైట్లు వేయడానికి కూడా డబ్బుల్లేక పంచాయతీలు అవస్థలు పడుతున్నాయి. విశాఖ జిల్లాలో 39 మండలాల్లో 969 పంచాయతీలున్నాయి. ఈ పంచాయతీలకు జమైన 14వ ఆర్థిక సంఘం నిధులను ఏ సమాచారం లేకుండానే వీధిలైట్లు, వాటర్‌ వర్క్‌ ఛార్జీల విద్యుత్‌ బకాయిల కింద ప్రభుత్వం డిస్కాంలకు జమ చేసింది. 14వ ఆర్థిక సంఘం నిధుల్లో ఈ నెల 9న 115 పంచాయతీ నిధులు రూ.7.27 కోట్లు, 23న 627 పంచాయతీలకు సంబంధించి విద్యుత్‌ బకాయిల నిమిత్తం రూ.46.88 కోట్లు వెరసి రూ.54.55 కోట్లు డిస్కాంకు జమయ్యాయి. డిస్కాంకు 14వ ఆర్థిక సంఘం నిధులు జమ చేయడంలోనూ, 15వ ఆర్థిక సంఘం నిధులను ప్రభుత్వం దారిమళ్లించడంలోనూ నిబంధనలన్నీ తుంగలో తొక్కింది.
ఆర్థిక సంఘం నిధులు ఏయే పద్దుల కింద ఎలా వినియోగించాలనే మార్గదర్శకాలున్నాయి. 15వ ఆర్థిక సంఘం నిధులకు సంబంధించి టైడ్‌, అన్‌టైడ్‌ కింద పంచాయతీలు ఎలా ఖర్చు చేయాలనేది 2020 నవంబరు 2న విడుదల చేసిన జిఒ 680లో పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధిశాఖ ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి గోపాలక్రిష్ణ ద్వివేది స్పష్టంగా పేర్కొన్నారు. పంచాయతీ నిధులు ఏ పద్దు కింద ఖర్చు చేయాల్సి వచ్చినా, వినియోగించాల్సివచ్చినా వాటి వినియోగానికి సంబంధించి పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధిశాఖ కమిషనర్‌ నుంచి జిల్లా పంచాయతీ అధికార్లకు ఉత్తర్వులు రావాల్సివుంది. ఆ ఉత్తర్వులు అమలు జరిగేలా జిల్లా పంచాయతీ అధికారులు ఆయా పంచాయతీలకు సమాచారం నోట్‌ రూపంలో ఇవ్వాల్సివుంది. కానీ 14వ ఆర్థిక సంఘం నిధులు విద్యుత్‌ బిల్లులకు జమచేసే విషయంగానీ, 15వ ఆర్థిక సంఘం నిధులు వాడుకున్న విషయంగానీ ఏ స్థాయిలోనూ ఉత్తర్వులివ్వకుండా ప్రభుత్వం వాడుకుంది. 15వ ఆర్థిక సంఘం నిధులున్నాయని సర్పంచ్‌లు రహదారులు, కాలువలు, వీధిలైట్లు, తాగునీటి పథకాల మరమ్మతులు వంటి పనులు ప్రారంభించారు. జమైన కొద్ది రోజుల తరువాత పంచాయతీ ఖాతాలో నిధులను చూస్తే బ్యాలెన్స్‌ లేకపోవడంతో ఒక్కసారి అవాక్కయ్యారు. ఈ విషయం జిల్లా పంచాయతీ అధికారి దృష్టికి తీసుకొచ్చినా తమకు కూడా తెలీదని చెప్పడంతో సర్పంచ్‌లు నిరాశతో వెనుదిరుగుతున్నారు. 15వ ఆర్థిక సంఘం నిధులు 969 పంచాయతీలకు టైడ్‌ కింద రూ.85,07,98,955లు, అన్‌టైడ్‌ కింద 76,06,28,038 మొత్తం రూ.161,14,26,993 జమయ్యాయి. ఈ నిధులు వాడుకుంటున్నట్లు పంచాయతీలకు సమాచారమివ్వకుండానే ప్రభుత్వం తీసుకోవడంతో సర్పంచ్‌లు పనులు చేపట్టలేక, చేసిన పనులకు బిల్లులు చెల్లించలేక లబోదిబోమంటున్నారు.

చేసిన పనులకు బిల్లులు చేయలేని పరిస్థితి
మా పంచాయతీకి 14వ ఆర్థిక సంఘం నిధులు రూ.14 లక్షలు రాగా, వాటితో టోకూరు సీసాగుడ, భగ్మరవలస, ములియగుడ, రాయవలస గ్రామాల్లో డ్రెయినేజీ పనులు చేయాలని తీర్మానం చేశాం. కాని రాష్ట్ర ప్రభుత్వం ఈ నిధులను సిసి ఛార్జీల కింద డిస్కాంలకు జమ చేసింది. 15వ ఆర్థిక సంఘ నిధులు రూ.11.50లక్షలు వచ్చాయి. ఈ నిధులున్నాయని పూలగుడ, బోడగుడ, భగ్మరవలస గ్రామాల్లో రూ.6 లక్షలతో ఇంటింటికీ తాగునీటి కుళాయిలు ఏర్పాటు చేశాం. తీరా బిల్లులు పెడితే పంచాయతీ ఖాతాలో డబ్బుల్లేవు. ఈ నిధులను రాష్ట్ర ప్రభుత్వం దారిమళ్లించింది.
- కిల్లో మోస్య, సర్పంచ్‌, టోకురు పంచాయతీ, అనంతగిరి మండలం,
గ్రామాలను ఎలా అభివృద్ధి చేయాలి
మా పంచాయతీలో 14వ ఆర్థిక సంఘం నిధులు రూ.38 లక్షలు, 15వ ఆర్థిక సంఘం నిధులు రూ.76 లక్షలను ప్రభుత్వం వెనక్కి తీసుకుంది. సాధారణ నిధులను కూడా ప్రీజింగ్‌లో పెట్టింది. దీంతో పంచాయతీ ఖాతాల్లో పైసా లేదు. ఇలా అయితే గ్రామాలను ఎలా అభివృద్ధి చేయాలి. ఒక్క అభివద్ధి పనికీ నిధులు మంజూరు చేయకపోవడం దుర్మార్గం.
- పెట్టెలి దాసుబాబు, సర్పంచ్‌, పెదలబుడు పంచాయతీ, అరకులోయ మండలం
వీధి లైట్లు వేయలేని స్థితి
మా పంచాయతీకి 14వ ఆర్థిక సంఘం నిధులు రూ.21లక్షలు రాగా, ఆ మొత్తాని ప్రభుత్వం లాగేసుకుంది. 15వ ఆర్థిక సంఘం నిధులు రూ.28 లక్షలు రాగా రూ.7,73,500 ప్రభుత్వం దారిమళ్లించింది. గ్రామంలో తాగునీటి పైప్‌లైన్లు వేసినా బిల్లులు కాలేదు. తాగునీటి పథకాలు మరమ్మతులు చేయలేని స్థితి ఉంది. ఈ నిధులుంటే డ్రైనేజీలు నిర్మించాల్సి ఉంది. వీధిలైట్లు వేయడానికి కూడా అవకాశం లేకుండా పోయింది.
- సుంకర సూరిబాబు, సర్పంచ్‌, బుచ్చయ్యపేట
గతంలోనే నిధులు లాగేశారు
మా పంచాయతీ నుంచి 14వ ఆర్థిక సంఘం నిధులు రూ.40 లక్షల సర్పంచ్‌ ఎన్నికల ముందే వెనక్కి తీసుకున్నారు. ఇప్పుడు 15వ ఆర్థిక సంఘం నుండి రూ.11.97 లక్షలు ప్రభుత్వం విద్యుత్‌ ఛార్జీలు కింద జమ చేసింది. దీంతో గ్రామంలో తాగునీరు, విద్యుత్‌ లైట్లు వంటి పనులు చేయలేని స్థితి నెలకొంది.
- కోరుకొండ కామలక్ష్మి, సర్పంచ్‌, వడ్డాది పంచాయతీ, బుచ్చయ్యపేట మండలం
తీవ్ర అన్యాయం
మా పంచాయితీకి చెందిన 14వ ఆర్థిక సంఘం నిధులు రూ.10.80 లక్షలు, 15వ ఆర్థిక సంఘం నిధులు రూ.17.75 లక్షలు రాష్ట్ర ప్రభుత్వం వెనక్కి తీసుకుంది. ఇది తీవ్ర అన్యాయం. ఇలా అయితే పంచాయతీ అభివృద్ధి ఎలా చేస్తాం. ఇప్పటికే గ్రామాల్లో మంచి నీరు, సిసి రోడ్లు, డ్రైనేజీ వంటి కార్యక్రమాల చేయడానికి పంచాయతీలో తీర్మానం చేశాం. ఆర్థిక సంఘం నిధులు ఉన్నాయని పనులు మొదలు పెట్టాం. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఆ నిధులన్నీ దారి మళ్ళించడం వలన మధ్యలోనే ఆ పనులు నిలిపి వేయాల్సిన దుస్థితి ఏర్పడనుంది.
- గెమ్మెలి చిన్నబాబు, సర్పంచ్‌, సుంకరమెట్ట, అరకువేలి మండలం

మా ప్రమేయం లేకుండా లాగేసింది
15వ ఆర్థిక సంఘం నిధులు సర్పంచ్‌ల ప్రమేయం లేకుండా రాష్ట్ర ప్రభుత్వం ఖాళీ చేయడం దారుణం. ఇప్పటికే గ్రామంలో పలు అభివృద్ధి కార్యక్రమాలు సొంత డబ్బులతో చేపట్టాం. నిధుల్లేక కనీసం పారిశుధ్య పనులు చేపట్టే పరిస్థితి లేదు. - లింగన్నాయుడు, సర్పంచ్‌, బికె.పల్లి, కోటవురట్ల