Feb 12,2021 22:37

pariseelistunna collector

ప్లాస్టిక్‌ భూతాన్ని తరిమేయాలి : కలెక్టర్‌
కలెక్టరేట్‌ : ప్లాస్టిక్‌ భూతాన్ని తరిమేసే విధంగా ఇన్నోవేటివ్‌ ప్రాజెక్టులను తయారు చేయాలని జిల్లా కలెక్టర్‌ ఎఎండి ఇంతియాజ్‌ వార్డు సచివాలయ ఉద్యోగులకు సూచించారు. శుక్రవారం స్థానిక మాచవరం బైపాస్‌రోడ్డులో రెండోవార్డు సచివాలయాన్ని ఆయన ఆకస్మికంగా సందర్శించి పనితీరును పరిశీలించారు. సచివాలయం పరిధిలోని రోడ్లు, డ్రెయిన్లు, తాగునీటి పైపులైన్లు వంటి వాటి వివరాలు అడిగి తెలుసుకున్నారు. వివిధ పథకాల అర్హత గురించి సచివాలయ ఉద్యోగులను ప్రశ్నించారు. రిజిస్టర్ల నిర్వహణ గురించి ఆరా తీశారు. సచివాలయ పరిధిలో సిసిరోడ్లు 10.42 కి.మీ, బిటిరోడ్లు 2.40 కి.మీ ఉన్నాయని ఇంకా 1.036 కి.మీ మేర రోడ్లు నిర్మించాల్సి ఉందని, ఇందుకోసం 50 లక్షల రూ.లతో అంచనాలు తయారు చేసినట్లు, 2.42 కి.మీ మేర డ్రైన్లు నిర్మించాల్సి ఉందని ఇందుకోసం 78.58 లక్షల రూ.లతో అంచనాలు రూపొందించినట్లు, త్రాగునీటి పైపులైన్లు 500 మీటర్లు మేర ఏర్పాటు చేయవల్సి ఉంటుందని ఇందుకోసం 5 లక్షల రూ.లతో అంచనాలు రూపొందించినట్లు ఎమినీటిస్‌ సెక్రటరీ ఫణికుమార్‌ కలెక్టర్‌ కు నివేదించారు. ఈ సచివాలయ పరిధిలో 349 మంది సామాజిక పింఛన్లు పొందుతున్నారని, అమ్మఒడి పధకం క్రింద 395 మంది లబ్ధి పొందారని, వెల్ఫేర్‌ సెక్రటరీ కలెక్టర్‌ కు నివేదించారు. డ్రైనేజిలలో కలిసే వాటి గురించి శానిటేషన్‌ సెక్రటరీని అడుగగా ముఖ్యంగా సోప్‌ వాటర్‌, ప్లాస్టిక్‌ ఎక్కువుగా డ్రైన్లలో కలుస్తున్నాయని కలెక్టరుకు తెలిపారు. పట్టణ ప్రజలు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలలో డ్రైనేజి సమస్య ప్రధాన మైనదని, ఎందుకంటే సముద్రమట్టం కంటే పట్టణం దిగువ ఉండటంతో డ్రైనేజి సమస్య ఎక్కువుగా ఉంటుందని దానిని అధిగమించేందుకు చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌ సూచించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రపంచాన్ని పట్టి పీడిస్తున్న పర్యావరణానికి హానికరంగా తయారైన ప్లాస్టిక్‌ వ్యర్ధాలు నియంత్రణకై గత ఏడాది చేపట్టిన నేను సైతం కష్ణమ్మ శుద్ది లో కార్యక్రమం ద్వారా ప్లాస్టిక్‌ పై పోరాటం చేసిన విషయం కలెక్టర్‌ గుర్తు చేశారు. ప్లాస్టిక్‌ వినియోగాన్ని గణనీయంగా తగ్గించేందుకు పాలితిన్‌ క్యారీ బ్యాగ్‌ లు నిషేధించామన్నారు. ప్లాస్టిక్‌ వాడకాన్ని బాగా తగ్గించాలని ఈ దిశగా ఇన్నోవేటివ్‌ ప్రాజెక్ట్స్‌ తయారు చేస్తే తగిన విధంగా సపోర్టు చేస్తామని సచివాలయ సిబ్బందికి సూచించారు.