Nov 09,2020 21:19

ప్రవీణ్‌ ప్రకాష్‌కు మనబడి నాడు-నేడు పనుల ప్రగతిని వివరిస్తున్న అధికారులు

ప్రజాశక్తి - సీతంపేట / వీరఘట్టం / రేగిడి: రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు పక్కాగా అమలు కావాలని రాష్ట్ర ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి ప్రవీణ్‌ ప్రకాష్‌ అన్నారు. నాడు-నేడు పనులు, గ్రామ సచివాలయాల పనితీరు, భవనాల నిర్మాణాల ప్రగతిని పరిశీలించేందుకు సోమవారం జిల్లాలో ఆయన పర్యటించారు. సీతంపేటలో గిరిజన సంక్షేమ శాఖ గురుకుల పాఠశాల, వీరఘట్టం మండలం వండువ మండల పరిషత్‌ ప్రాథమిక పాఠశాలలో నాడు - నేడు పనులు, సీతంపేట మండలం పెద్దూరు, వండువలో సచివాలయ భవనం, హెల్త్‌ క్లినిక్‌, రైతు భరోసా కేంద్రాన్ని పరిశీలించారు. రేగిడి ఆమదాలవలస మండలం సంకిలి జెడ్‌పి ఉన్నత పాఠశాలను ఆకస్మిక తనిఖీ చేశారు. నాడు-నేడు కింద చేపట్టిన మరుగుదొడ్లలో ఉపయోగించిన పరికరాలు, నీటి సరఫరాను పరిశీలించారు. ట్యాప్‌ నుంచి నీరు నెమ్మదిగా సరఫరా కావడంపై సంబంధిత ఇంజినీర్లను ప్రశ్నించారు. ఆదివారం పనులు ముగించామని, టెస్టింగు చేయాల్సి ఉందని ఇంజినీర్లు బదులిచ్చారు. నవంబరు 3వ తేదీన పాఠశాలలు ప్రారంభం కావాల్సి ఉందని, అలా అయి ఉంటే పరిస్థితి ఏమిటని ప్రశ్నించారు. పై అధికారులు వచ్చి తనిఖీ చేస్తారని పనులు చేపట్టడం కాదని, పనిలో నిబద్ధత ముఖ్యమన్నారు. నాడు-నేడు కార్యక్రమంలో నిరంతర నీటి సరఫరాతో మరుగుదొడ్ల కల్పన, తాగునీరు, పాఠశాల మరమ్మతులు, విద్యుద్దీకరణ, ఫ్యాన్లు, విద్యుద్దీపాల కల్పన, ఫర్నిచర్‌, గ్రీన్‌ బోర్డు, పాఠశాలలకు ఆహ్లాదకర రంగులు, ఇంగ్లీషు ల్యాబ్‌లు, ప్రహరీ నిర్మాణం పనులు చేపట్టాల్సి ఉందన్నారు. కార్పొరేట్‌ పాఠశాలల కంటే అధిక స్థాయిలో ఉన్నామన్న భావన పిల్లల్లో కలగాలన్నారు. అధికారులు అభివృద్ధి కార్యక్రమాల్లో ఏ ప్రాంతానికి ప్రాధాన్యత ఇవ్వాలనే అంశాన్ని గుర్తించాలని స్పష్టం చేశారు. అభివద్ధి కార్యక్రమాలు వెనుకబడిన ప్రాంతాలు, వెనుకబడిన రంగాల్లో ప్రారంభం కావాలని సూచించారు.
పెద్దూరులో గ్రామ సచివాలయం, వైఎస్‌ఆర్‌ హెల్త్‌ క్లినిక్‌, రైతు భరోసా కేంద్రం పనులు పరిశీలించేందుకు వచ్చిన ఆయనకు గ్రామ ప్రజలు సవర నృత్యంతో ఘన స్వాగతం పలికారు. నృత్య బృందంలోని గిరిజన మహిళలకు ఆసరా, చేయూత తదితర పథకాల కింద అందిన ఆర్థికసాయాన్ని అడిగి తెలుసుకున్నారు. వండువ గ్రామ సచివాలయంలో సంక్షేమ కార్యక్రమాల వివరాలు పూర్తిస్థాయిలో లేకపోవడంతో ఎంపిడిఒను ప్రశ్నించారు. రెండో విడతలో పంపిణీ చేస్తున్న చేదోడు, వాహనమిత్ర, చేయూత తదితర కార్యక్రమాల లబ్ధిదారుల వివరాలను ఎందుకు ప్రదర్శించలేదని ప్రశ్నించారు. సచివాలయం గోడపై పథకాలకు స్థలాన్ని కేటాయిస్తూ వాటి వివరాలు పెట్టాలని ఆదేశించారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలు ప్రజలకు చేరవేయడంలో ప్రతి సచివాలయ ఉద్యోగి భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు. గ్రామ, వార్డు సచివాలయ జాయింట్‌ కలెక్టర్‌ తనిఖీలు నిర్వహిస్తూ వ్యవస్థ సక్రమంగా పనిచేసేలా కృషి చేయాలని ఆదేశించారు.
ఆకస్మికంగా ఉన్నత పాఠశాల తనిఖీ
సంకిలి జెడ్‌పి ఉన్నత పాఠశాలను ముఖ్య కార్యదర్శి ఆకస్మికంగా తనిఖీ చేశారు. 9, 10 తరగతుల విద్యా బోధనను, కోవిడ్‌ నిబంధనలు ఏమేరకు పాటిస్తున్నదీ పరిశీలించారు. ఇప్పటివరకు పూర్తి చేసిన సిలబస్‌ వివరాలు పరిశీలించారు. జగనన్న విద్యా కానుకలో పంపిణీ చేసిన బ్యాగులు, పుస్తకాలు, బూట్లను పరిశీలించిన ఆయన, విద్యార్థులు బూట్లు వేసుకోకపోవడంపై అధికారులు, ఉపాధ్యాయులను ప్రశ్నించారు. గత నెల 6వ తేదీన విద్యా కానుక పంపిణీ చేయగా, ఇప్పటివరకు పూర్తిస్థాయిలో అమలు కాకపోవడాన్ని ప్రశ్నిస్తూ తక్షణమే అమలుకు చర్యలు చేపట్టాలని ఆదేశించారు. అధికారులు ముఖ్యంగా ఐఎఎస్‌ అధికారులు పథకాల అమల్లో ప్రత్యేక చొరవ చూపాలన్నారు. ఐఎఎస్‌ అధికారులు అంటే ఆఫీస్‌ ఆన్‌ వీల్స్‌ అని, ప్రతి కార్యక్రమం అమల్లో ప్రత్యేక ముద్ర వేయాలన్నారు.
సామాజిక భవనం ఏర్పాటు చేయాలి
వండువలో సామాజిక భవనం ఏర్పాటుకు చొరవ చూపాలని ముఖ్య కార్యదర్శి ప్రవీణ్‌ ప్రకాష్‌కు పాలకొండ ఎమ్మెల్యే వి.కళావతి విన్నవించారు. గ్రామంలో రెండు వేల జనాభా కలిగిన పంచాయతీని సచివాలయంగా ఏర్పాటు చేశారని, దీనికి అనుసంధానంగా ఆడారు పంచాయతీ కూడా ఉందన్నారు. రెండు సచివాలయాలుగా ఏర్పాటు చేయాలని కోరారు. గ్రామంలో వెయ్యి టన్నుల సామర్థ్యం కలిగిన గోదామును మంత్రి కన్నబాబు భవనం ఏర్పాటుకు హామీ ఇచ్చారని, సమస్యలు పరిష్కరించేందుకు సత్వర చర్యలు చేపట్టాలన్నారు. ఎస్‌పి అమిత్‌ బర్దార్‌ సీతంపేటలో ప్రవీణ్‌ ప్రకాష్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. కార్యక్రమంలో కలెక్టర్‌ జె.నివాస్‌, జాయింట్‌ కలెక్టర్లు కె.శ్రీనివాసులు, సుమిత్‌ కుమార్‌, ఆర్‌.శ్రీరాములు నాయుడు, ఐటిడిఎ పిఒ సిహెచ్‌.శ్రీధర్‌, టెక్కలి సబ్‌ కలెక్టర్‌ సూరజ్‌ ధనుంజరు, సహాయ కలెక్టర్‌ ఎం.నవీన్‌, పాలకొండ ఆర్‌డిఒ టి.వి.ఎస్‌.జి కుమార్‌, పిఆర్‌ ఎస్‌ఇ ఎస్‌.రామ్మోహన్‌, వ్యవసాయ శాఖ జెడి కె.శ్రీధర్‌, గిరిజన సంక్షేమ శాఖ డీడీ ఎం.కమల, సంబంధిత మండలాల తహశీల్దార్లు తదితరులు పాల్గొన్నారు.