Aug 22,2021 11:52

సినీ తారలు సామాజిక, ఆర్థిక, జాతీయ పరిస్థితులపై అప్పడప్పుడూ స్పందించడం సర్వ సాధారణం... దీనికి సంబంధించి సోషల్‌ మీడియాలోనూ పోస్టులు పెట్టడమూ పరిపాటే.. అయితే తాజాగా ఆఫ్ఘన్‌ రాజధాని కాబూల్‌తోపాటు కీలక భూభాగాలను ఆధీనంలోకి తెచ్చుకున్న తాలిబన్లు యుద్ధం ముగిసినట్టు ప్రకటించిన సంగతి తెలిసిందే. దీంతో అక్కడ భయంకరమైన వాతావరణం కనిపిస్తోంది. ఎప్పుడు తమ ప్రాణాలు పోతాయోనని ప్రజలు గజగజ వణికిపోతున్నారు. వీలైనంత త్వరగా దేశం విడిచి వెళ్లిపోవాలని.. ఎయిర్‌పోర్టుకి పోటెత్తుతున్నారు. దీంతో కాబుల్‌ విమానాశ్రయం కిక్కిరిసిపోయింది. ఇందుకు సంబంధించిన దృశ్యాలు ప్రస్తుతం సామాజిక మాద్యమాల్లో వైరల్‌గా మారాయి. ఇవి చూసిన ప్రతీ ఒక్కరి కళ్లూ చెమ్మగిల్లుతున్నాయి. అయితే ఆఫ్ఘన్‌లో నెలకొన్న తాజా పరిస్థితులపై బాలీవుడ్‌ నటి రియా చక్రవర్తి స్పందించారు. 'ఆఫ్ఘన్‌ మహిళల, మైనార్టీలపై జరిగే దారుణ దృశ్యాలను చూస్తుంటే గుండె తరుక్కుపోతుంది!' అంటూ ఆమె పోస్టు చేశారు..

పితృస్వామ్యాన్ని బద్దలు కొట్టండి !

పేరు : రియా చక్రబర్తి
పుట్టిన తేదీ : జులై 01, 1992
పుట్టిన ప్రాంతం : బెంగళూరు, కర్ణాటక
ఇష్టమైన ఆహారం : సీ ఫుడ్‌
ఇష్టమైన నటులు : సల్మాన్‌ ఖాన్‌, మాధురీ దీక్షిత్‌
హాబీస్‌ : బైక్‌, కార్‌ రేసింగ్‌
తల్లిదండ్రులు : ఇంద్రజిత్‌ చక్రబర్తి,
సంధ్య చక్రబర్తి
సోదరులు : షోవిక్‌ చక్రబర్తి

      టాలీవుడ్‌లో కెరీర్‌ స్టార్ట్‌ చేసి, బాలీవుడ్‌లో అవకాశాలు దక్కించుకున్న అతి కొద్దిమంది తారల్లో కథానాయిక రియా చక్రవర్తి ఒకరు. ఎమ్మెస్‌ రాజు తనయుడు సుమంత్‌ అశ్విన్‌ సరసన 'తూనీగా తూనీగా' చిత్రంలో నటించిన రియా చక్రవర్తి హిందీ చిత్రసీమలో అవకాశాలు దక్కించుకుంది. సినీరంగ ప్రవేశానికి ముందు వీడియో జాకీగానూ చేసిన రియా 'ఎమ్‌ టీవీ' నిర్వహించిన 'టీన్‌ దివా' కార్యక్రమంలో రన్నరప్‌గా నిలిచి, గుర్తింపు సంపాదించుకుంది. ఈ క్రమంలో రాజు దృష్టిలో పడి, కథానాయికగా మారింది. 'తూనీగా తూనీగా' విజయం సాధించకపోవడంతో తెలుగులో అవకాశాలు కరువైన క్రమంలో అనూహ్యంగా 'మేరే డాడ్‌ కీ మారుతీ' అనే హిందీ సినిమాలో ఛాన్స్‌ వచ్చింది. దీంతో పాటు స్టార్‌ ప్రొడ్యూసర్‌ రోహన్‌ సిప్పీ నిర్మించిన 'సోనాలి కేబుల్‌' సినిమాలో కథానాయిక పాత్ర దక్కింది.
     కాగా ఇటీవల 'ది టైమ్స్‌' విడుదల చేసిన 'ది టైమ్స్‌ 50 మోస్ట్‌ డిజైరబుల్‌ ఉమెన్‌ 2020' జాబితాలో రియా చక్రవర్తి చోటు దక్కించుకుంది. రియా.. అమితాబ్‌ బచ్చన్‌, ఇమ్రాన్‌ హష్మీతో కలిసి 'చెహ్రే' చిత్రంలో నటించింది. కరోనా కారణంగా విడుదల వాయిదా పడిన సినిమా ఈ నెల 27న విడుదల కానుంది. బాలీవుడ్‌ నటుడు సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పుత్‌ ఆత్మహత్య కేసు తర్వాత రియా ఎన్నో వివాదాల్లో చిక్కుకుంది. సుశాంత్‌ ప్రేయసిగా ఉన్న రియా... అతని మరణానికి కూడా ఆమే కారణం అంటూ పోలీసులు అరెస్ట్‌ చేశారు. ఆ తర్వాత బెయిల్‌పై విడుదలైంది. దీంతో నిత్యం సోషల్‌ మీడియాలో యాక్టివ్‌గా ఉండే రియా మధ్యలో కొంత గ్యాప్‌ ఇచ్చింది. ప్రస్తుతం రియా మళ్లీ గత కొద్దిరోజులుగా ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా చురుగ్గా పాల్గొంటోంది. ఈ క్రమంలో ఆఫ్ఘన్‌లో నెలకొన్న సంక్షోభంపై బాలీవుడ్‌ హీరోయిన్‌ రియా చక్రవర్తి ఇన్‌స్టాగ్రామ్‌లో స్పందించారు. వారి పరిస్థితులపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఆ దేశ పౌరులు, ప్రధానంగా మహిళల స్థితిపై ఆవేదన వ్యక్తం చేశారు. ప్రపంచవ్యాప్తంగా మహిళలు వేతన సమానత్వం కోసం పోరాడుతోంటే.. ఆఫ్ఘన్‌ మహిళలు మాత్రం అమ్మకానికి గురవుతున్నారన్నారు. వారే ఆదాయంగా మారిపోయి, జీవన పోరాటం చేస్తున్నారన్నారు. ఆఫ్ఘన్‌ మహిళలు, మైనార్టీల పరిస్థితిని చూసి హృదయం బద్ధలవుతోందని పేర్కొన్నారు. ఈ సంక్షోభంలో అండగా నిలబడాలని, 'ప్రపంచ నేతలు అందరూ ఈ సమస్యను పరిష్కరించాలి' అని రియా గ్లోబల్‌ నాయకులను కోరారు. 'పితృస్వామ్యాన్ని బద్దలు కొట్టండి... మహిళలు కూడా మనుషులే' అని వ్యాఖ్యానించారు.
     ఇదిలా ఉండగా ఆఫ్ఘన్‌లో నెలకొన్న పరిస్థితులపై బాలీవుడ్‌కు చెందిన పలువురు నటులు, ఇతర సినీరంగ ప్రముఖులూ స్పందించారు. 'ప్రపంచం మౌనంగా చూస్తుండగా ఇంతటి సంక్షోభం.. మానవత్వానికి సిగ్గుచేటు' అంటూ నటుడు కరణ్‌ టాకర్‌ ఇన్‌స్టాగ్రామ్‌ స్టోరీలో రాశారు. అలాగే చిత్రనిర్మాత శేఖర్‌కపూర్‌ కూడా పరిస్థితిపై ఆందోళన వ్యక్తం చేశారు. ఆఫ్ఘన్‌ ప్రజల కోసం ప్రార్థిస్తున్నాననీ, విదేశీ శక్తుల వలస రాజ్యం ఆశలో ఆఫ్ఘన్‌ నాశనమైందని కపూర్‌ ట్వీట్‌ చేశారు. వీరితోపాటు నటి స్వరభాస్కర్‌, రిచా చద్దా, అనురాగ్‌ కశ్యప్‌, సనమ్‌ పురి, హన్సల్‌ మెహతాతో సహా ఇతర చిత్ర పరిశ్రమ పెద్దలూ తమ అభిప్రాయాలను పంచుకున్నారు.