Sep 28,2020 13:13

పెవాసం

'మ్మే అలిమేలా...! నే ఎల్తన్నా కానీ నువ్వీట్ని అమ్మేసి రా...!' అంటా సిక్కాన్ని కావిడి బద్దకి తగిలిచ్చుకొని, బుజమ్మింద పెట్టుకొని ఇంటిసాయికి కదిల్నాడు నరిసెమ్మ.
'ఆ అట్నే కానీ... నువ్వింటి కాడికి పొయ్యా... అంత సద్దన్నం తిని నీడన రొంతసేపు పొండుకో... ఈ సీటీ పేకాటల కాడికీ, కోడిపందేల సాయికీ పోమాక...' అంది మొగుడికి ఇతబోద సేస్తావున్నట్లు అలిమేలు.
'అట్నే లేయే... ఎప్పుడన్నా సూసినావా! వోటేపుకి పోటం... ఎందుకు సెప్తావు పొద్దస్తమానం..?' ఇసుక్కొన్నాడు బార్యని నరిసెమ్మ.
'వుంకేడపోతాడ్లే... వొయిసున్నప్పుడే వోటికి పోలా... వుప్పుడు పోతాడా...?' మనసులో అనుకొంది అలిమేలు. బైటికి మాతరం పతిరోజూ అట్టా వోర్నింగియ్యకపోతే మనసూరుకోదు ఆమెకి. అట్టా పెల్లాం వోర్నింగిచ్చిన పతిసారీ వొల్లు మండిపోతా వుంటాది నరిసెమ్మకి. ఇంటి సాయికి పోకముందే నిదర ముంచుకొచ్చేస్తా వుంది నరిసెమ్మకి.
ఆ రోజు ఆదివారం. సేపల అమ్మకం బాగా వుంటుంది. ఆ రోజుకి సేపలు సేతల్లో వుండాలంటే ముందురోజు రేతిరి నిదర్లేకుండా సెరువులో వొలెయ్యాల. అద్దరేతిరికి ముందర్నే లేసి ఆ సాయింత్రం సెరువులో వొదిలిన వొలని లాగి, దాంట్లో పడ్డ సేపల్ని తెల్లారేలోగా భార్యకిచ్చి పంపాల. ఆమె దాన్ని తీసకపొయ్యి వూల్లో వొకసోట కూసొని, అమ్ముతా వుంటాది. మిగతా వొలని కూడా లాగి పడ్డ సేపల్ని తీసుకొచ్చి బార్యకిస్తాడు. ఆమె దాన్ని కూడా అమ్ముకొని, ఏమద్దేనానికో ఇంటికి సేరతాది. ఈ ఆదివార రోజుల్లోనే ఇట్టా రేతిరి నిదర్లేకుండా పనిసెయ్యాల. తక్కిన రోజుల్లోనైతే తెల్లారిపొయ్యి వొలేసుకొన్నా సరిపోతాది. గెబగెబా ఇంటికి పొయ్యిన నరిసెమ్మ కావిడి బద్దనాడ పడేసి, మొకం కడుక్కొని సద్దన్నం తినేసి బైట సెట్టు కింద మంచం వోల్చుకొని, నిదర బొయ్యినాడు. మల్లీ నరిసెమ్మ కల్లు తెరిసేరేగి పొద్దు నడినెత్తి దాటి, కిందికి వోలతా వుంది. సేపలంతా అమ్మేసి ఇంటికాడి కొచ్చి అన్నం వొండతా వుంది అలిమేలు. అప్పుడే లేవాలనిపిచ్చలేదు నరిసెమ్మకి. అట్నే మంచంమింద ఒక పక్కకి వొత్తిగిల్లి పండుకొన్నాడు. ఆయినికి మనసులో ఏ ఆలోశెనలూ లేకుండా పశేంతంగా వుంది. ఇట్టాటప్పుడే ఆయినికి గెతం గుర్తుకొస్తా వుంటాది. వుప్పుడూ గెతం పాత సినిమాలో రీల్ల సుట్ట మాదిరి తిరిగి గుర్తు కొచ్చింది.
***
అసలీ నరిసెమ్మది ఆవూరూ కాదు ఆ పేంతం కూడా కాదు. ఏన్నో తూరుపు సాయిన సముద్రమూ, పులికాట్‌ ఏరూ కలిసే సోట నుండే కోడిమొన అనే వూరు. రాకెట్లు తయారుసేసి మొబ్బులోకి పంపిస్తా వుండే సీహరికోట కాడన్న మాట. వుప్పుడా వూర్ని నవాబు పేటంటున్నారు. అప్పట్లో అంటే నలబై యాబై ఏళ్లకి మద్దిలో ఆసోట్లో నరిసెమ్మ కులపోల్లు శానామంది వుండేవోల్లు. ఆ సుట్టు పక్కనున్న వూర్లకన్నా ఆన్నే సేపలెక్కువగా పడేయి. ఎందుకంటే వోనాకాలంలో ఏట్లో నీల్లు ఎక్కువైనప్పుడు నీల్లు సముద్రంలోకి పోతా వుండటాన తీపి నీల్లి కాడికి ఏడున్న సేపలన్నీ వొచ్చి సేరతాయి. పులికాటు సరస్సుకీ, సముద్రానికీ మద్దిలో వుండే ఇసక దిబ్బల మింద గుడిసి లేసుకొని బతికేవోల్లు. ఆ పేంతంలో కోడిమొన, ఆరంగం, తెత్తుపేట, దోండుపేట, జానపాలెం, పులింజేరి లాంటి ఇరవై ముఫ్పై వూర్లుండేయి. వోల్లంతా బైటి పెపంచానికి సంబంధం లేకుండా అటు సముద్రంలోకీ లేకపోతే ఇటు పులికాటులోకి పొయ్యి, కోరిన సేపలు తెచ్చుకొని తిన్నంత తిని మిగిలింది అమ్ముకొని పెల్లాం పిల్లల్తో సంతోషంగా వుండేవోల్లు. రాకెట్లు తయారుసేటానికి సరైన సోటు కోసం దేశమంతా సూసి ఈడ బాగుందని ఆ సీహరికోటకి అట్టా ఇట్టా వుండే వూర్లని కాలీ సెయ్యమన్నారు. ఆ మాటిన్న ఆవూల్లల్లో వుండే వోల్ల గుండెల్లో గుదిబండ పడి పొయ్యింది. 'సారూ ఎన్నో తరాల్నించి మేమీన్నే పుట్టి ఈ సముద్రంలో సేపలు పట్టుకొని, బతకతా వున్నాం. మేమెవురికీ బారం కాలా...! మేమెవరిమిందా ఆదారపడకుండా మా బతుకు మేం బతుకుతున్నాం. మీరిప్పుడొచ్చి కాలీ సెరుమంటే మేమేం సెయ్యాల? ఈ సముద్రాన్నీ, ఈ ఏట్నీ వొదిలిపెడ్తే మేం బతకలేం. అందర్లాగా జెనాన్ని మోసం సేటం మాకు సేతకాదు. దయిసేసి మమ్మల్నొదిలెయ్యండి' అని ఆడున్న వూరి పెద్దోల్లు ఆపీసర్ల కాల్లు పట్టుకోటం నరిసెమ్మకి బాగా తెల్సు. తెలవకపోటానికి వోడేం సిన్న పిల్లోడు కాదు గదా! అప్పుటికే పెల్లైపొయ్యిండే. అలిమేలుది కూడా ఆ వూరే! అట్టా ఆ వూర్లో వోల్లు ఆపీసర్ల నెంతగా బతిమాలినా వోల్లినుకోలా...! మావొల్ల కాదు. 'మేం జీతగాల్లమేగానీ మా సేతల్లో ఏం లేదు. గౌర్నమింటు సెప్పినట్టు మేం సెయ్యాల. మేం సెప్పినట్లు మీరినాల'. అని బలవొంతంగా కొద్ది డబ్బులు సేతల్లో పెట్టేసి కాలీ సెరుమని సెప్పి ఎల్లిపొరునారు. ఇప్పుట్లా రోడ్డు మిందికొచ్చి దర్నాలూ, టైకులూ సేసే రోజులు కావయ్యి. అప్పట్లో నాయికులూ లేరూ. ఇంత తెలివీ లేకపొయ్యె. వుప్పుడైతే ఇంటికీ, కొలాయికీ, కొబ్బరి సెట్టుకీ, కోడికీ, బర్రికీ, గొర్రికీ వుంకా జీవితాంతం బతికే వుత్తి కింతని లెక్కలు కట్టి, వొసూలు సేసుకొని మల్లీ వోల్లు కట్టిచ్చే ఇల్లల్లోనే సేరతా వున్నారు. ఏడన్నా వూర్లు కాలీ సేయాల్సి వొస్తే ... అప్పుట్లో ఏదో వోల్లిచ్చింది తీసుకొని, సెట్టు కొకరూ పుట్టకొకరుగా తలో దిక్కుకి పొరునారు. ఆడున్న ముప్పై నలబై వూర్లవోల్లు శానామంది నాయుడుపేట, సూల్లురుపేట, దొర్రారి సత్తరం, తడ, నెల్లూరు ఇట్టా వోల్లకి తోసిన వూల్లల్లో సేరి, తోసిన పని సేసుకొంటా నిలబడి పొరునారు. ఐతే పిలింజేరి వోల్లు మాతరం మదరాసుకి దగ్గర్లో పొన్నేరి కాడున్న పతేకాడుకి సగంమంది పోతే, మిగిలిన సగం మంది మల్లాంకి తూరుపు నున్న పులికాటు కిందనున్న సముద్రం కాడ సీనివాస పురమని వూరు కట్టుకున్నారు. వోల్లు మాతరమే సేపలేటసేస్తా వున్నారుగానీ మిగిలినోల్లు ఏదోవొక పని సేసుకొంటా తిరపడి పొయ్యినారు. నరిసెమ్మ అన్నదమ్ములూ ఎటు తోసినోల్లటెల్లిపోతే ఈయిన మాతరం అత్తామామల్తో కల్సి ఈ వూరికొచ్చి సేరినారు.
వొత్తిగిల్లిన నరిసెమ్మకి బుజం నొప్పి పుట్టేరేగి ఎల్లికిలా పండుకొని, రొండు సేతుల్నీ గుండెలమింద పెట్టుకొని, కల్లు మూసుకొన్నాడు. బెల్లంకాడ ఈగల మాదిరి ఆలోసెనలు మల్లీ నరిసెమ్మను సుట్టు ముట్టినాయి. ఈ నలబై ఐదేల్ల పెద్ద బతుకులో అత్తామామలూ, బామ్మర్దులూ అంతా పొయ్యినారు. నరిసెమ్మా, అలిమేల్లిద్దరే మిగిల్నారు. వున్నంతలో పిల్లల్ని సదివిచ్చినాడు. పిల్లలందరికీ పెల్లై పోంగానే, వోల్లకి నచ్చిన సోట్లోకెల్లి పొయ్యి బతకతా వున్నారు. సముద్రాన్నొదిలేసినా సేపలేట మానుకోని నరిసెమ్మ కులపోల్లకి దూరంగా వున్నా వోల్లతో సంబందాల్ని కలుపుకొని, మల్లీ వోల్లకి దగ్గరైనాడు. పెద్దకొడుక్కి వోల్లూరు నించొచ్చి నాయుడుపేటలో వుంటా వున్న ఇంటిపిల్లను తీశాడు. సిన్నకొడుక్కి కూడా దోండుపేట నించొచ్చి, సూల్లూరుపేటలో వుంటావున్న వాల్లింట్లో తీశాడు. కూతుర్ని తడలో వున్న వోల్ల కులపోల్ల అబ్బాయికిచ్చాడు. అందరికీ పిల్లలు పుట్టి, పెద్దోల్లైపోతా వున్నారు. ఎప్పుడన్నా పండగలకీ, ఇల్లల్లో జెరిగే ఏడుకలకీ పొయ్యినప్పుడు ఆ పిల్లలు సేతులొదలరు. కొడుకులూ, కోడల్లూ ఆ వూరొదిలి మాకాడి కొచ్చెయ్యి నాయినా అంతా ఈన్నే వుందామంటారు. కానీ నరిసెమ్మకే ఈ వూరొదిలి పెట్టటమంటే ఏందో పోగొట్టుకొన్నట్టుంటాది.
'ఎప్పుడో పెల్లైన కొత్తలో ఈ వూరి కొచ్చాం. నీకులమేందని అడగలా.. నీ మతమేందనీ అడగలా.. ప్రేమగా అక్కున సేర్చుకొంది. వున్నంతలో బతికుతున్నాం. ఆడకొచ్చినాక పుట్టిన పిల్లల్ని ఆన్నే పెంచి, సదివించినాం. రెక్కలొచ్చిన పిల్లలు పెల్లైనాక ఏరేదార్లు సూసుకొని, ఈ రోజుకీ తిండికీ, బట్టకీ లోటు లేకుండా సాగిపోతా వుంది' అంటాడు నరిసెమ్మ. ఆ వూల్లో పుట్టకపొయ్యినా అన్నా, మామా, బాబాయంటా ఆ వూరోల్లు పిలిసే పిలుపుకి పరవసించిపోతాడు నరిసెమ్మ. అట్టాటి వూర్నొదిలి ఈరోజు కొడుకులేందో పిల్సినారని ఎల్లిపోటం ఇష్టం లేదు నరిసెమ్మకి.
'య్యో.. ఏదింకా నిదరబోతా వున్నావా..? లేలే..!' అన్న బార్య కేకతో ఆలోసెనల దారం పుటుక్కుమంది నరిసెమ్మకి.
శ్రీశ్రీశ్రీ
'ఏమిటి...? ఇన్నేల్ల కాన్నించి ఈడ సంపాయించిందేముంది...? ఏం కావాల నీకు...? పిల్లలందర్నీ పెంచి సదివించినావు కదా..!? పిల్లలందరికీ పెల్లిల్లు సేసినావు కదా...!? వొక మనిసికింత కన్నా ఏం కావాలి...!?' అని నరిసెమ్మ అంతరాత్మ ఎదురు పశ్నేసింది. లేసి సేతులు కడుక్కొని, కొయ్యిపీట మింద కూసోగానే అలిమేలు అన్నంలో కూరొడ్డిచ్చి, అయిన ముందర పెట్టింది. అన్నం తింటా కూడా నరిసెమ్మ అదే ఆలోసిస్తా వున్నాడు.
'మ్మే... అలిమేలా...! మనం సొంతూరికెల్లి పోదామా..?'
'సొంతూరా..? అదేడుంది నీకు...!?' అంది అలిమేలు.
'అదేనే కోడిమొనా..!' అన్నాడు నరిసెమ్మ.
'కొంగమొన లేదా...!? కోడి మొనంట కోడి మొన...!? యాబై ఏల్లప్పుడే ఆడున్నోల్లనందర్నీ వూడ బెరికి తరిమేస్తే.. వుంకా నీకాడ సొంతూరంటా వుందా..!? ఐనా వుప్పుడు నువ్వు పొయ్యి ఏం సేస్తావంటా...!? సేపలేటాడే వొయిసా ఏంది నీది!? మనవొల్ల నాడిచ్చే వయసులో పొయ్యి సేపలు పడ్తావా? నీ పిచ్చి కాకపోతే...!' అంది అలిమేలు.
'అంతే నంటావా...?' అన్నాడు అన్నం ముద్దని నోట్లో పెట్టుకొంటూ నరిసెమ్మ.
'అంతేగాక వుప్పుడు నువ్వు పొయ్యి పీకేదేముందంటా...!? పిచ్చాలోసెనలు మానేసి, అన్నం తిని అట్టా వూల్లోకి పొయ్యి కాసేపా సావిట్లో కూసొని రాపో...!' అంటా తనూ అన్నం వొడ్డిచ్చుకొని, కూసొంది అలిమేలు.
'ఇదేందబ్బా ఇదిట్టా మండిపడ్తా వుంది?! ఇది వొరలో ఎప్పుడన్నా ఈ మాటొస్తే.. సిన్నపిల్ల మాదిరి ఏడుపు మొకంపెట్టేది. ఈ మద్దే.. ''మంచికో సెడుకో ఈ వూరొచ్చిపడ్డాం. ఈడ మనల్నెవురూ ఏమనట్లేదు. ఇంతకాలం బతికినాం. వొంట్లో వోపికున్నంత కాలం ఈన్నే వుందాం!'' అంటోంది'' అనుకున్నాడు నరిసెమ్మ.
అయినా బార్య సెప్పిందాంట్లోనూ నేయముందని పిచ్చింది నరిసెమ్మకి. 'ఈ వయసులో ఆడికి పొయ్యినా సేసేదేముంది? ఇంతకాలం ఈన్నే బతికినాము గదా...? ఈ సివర్రోజులూ ఈన్నే బతికితే సరిపోద్ది కదా...? వుంక దానికెందుకు ఆడికి పోవాలా? ఈడికి పోవాలా? అని ఆరాటపడ్డం. కాల్లూ సేతులూ ఆడిందాకా ఈన్నే వుంటే ఆనీక కొడుకులు తీసుకుపోరా...? సూద్దాం అప్పుడు దాకా వొస్తే ఏం జెరుగుతాదో...?' అని గెట్టిగా అనుకొని లేచాడు.
ఏట్లో నించి తీసుకొచ్చిన వొలని తీసుకొని, సెట్టు కిందేసుకొని దాన్ని సరిసెయ్యటం మొదలెట్టినాడు నరిసెమ్మ.

- ఆవుల వెంకట రమణ
94940 88110