Feb 23,2021 22:13

ప్రజాశక్తి - అమరావతి బ్యూరో : పెట్టుబడి కేంద్రీకరణ కోసం మోడీ ప్రభుత్వం ఎక్కడ లేని ఆతృత కనబరుస్తోందని సిపిఐ(ఎం) పొలిట్‌బ్యూరో సభ్యులు బి.వి. రాఘవులు విమర్శించారు. మంగళవారం నాడిక్కడి ఎంబి విజ్ఞాన కేంద్రంలో జరిగిన సిపిఐ(ఎం) రాష్ట్ర కమిటీ సమావేశంలో తాజా రాజకీయ పరిస్థితుల గురించి ఆయన వివరిస్తూ, కేంద్రం ఇటీవల తీసుకొచ్చిన బడ్జెట్‌ ప్రధానంగా పెట్టుబడి కేంద్రీకరణ (మెటా ప్రైవేటైజేషన్‌) చుట్టూనే తిరిగిందన్నారు. కంప్యూటర్‌ పరిభాషలో మెగాబైట్‌, గిగా బైట్‌ అన్న పదాల మాదిరిగానే మెటా ప్రైవేటైజేషన్‌ను మోడీ ప్రభుత్వం తెరపైకి తీసుకొచ్చిందని అన్నారు. మెగా ప్రైవేటైజేషన్‌ అంటే దేశ ఆర్థిక వ్యవస్థను అయిదారు బడా కార్పొరేట్‌ సంస్థల చేతుల్లో పెట్టడమేనని అన్నారు. కమ్యూనికేషన్స్‌, వ్యవసాయొత్పత్తుల మార్కెటింగ్‌ రంగాల్లో రిలయెన్స్‌ అంబానీ , విమానాశ్రయాలు, రేవులు వంటి రంగాల్లో అదానీ గుత్తాధిపత్యానికి, ఫైనాన్స్‌ రంగంలో రెండు అతి పెద్ద బ్యాంకుల ఆధిపత్యం కల్పించేలా మోడీ ప్రభుత్వం చట్టాలు, ప్రణాళికలు రూపొందిస్తోందని అన్నారు. నాలుగు కోర్‌ సెక్టార్లలో 10 సంస్థలు మినహా మిగతావాటన్నిటినీ అమ్మేయాలన్నదే నీతి ఆయోగ్‌ చెబుతున్న నీతి అని ఆయన విమర్శించారు. భారత ఆర్థిక వ్యవస్థను పదిమంది కుబేరులే నడిపించాలని, ఆ కుబేరులు యానిమల్‌ స్పిరిట్‌ (జంతు శక్తి) తో ఈ రంగాలను దున్నేయాలని మోడీ చెబుతున్నారని, వ్యవసాయ రంగంలో తీసుకొచ్చిన మూడు నల్ల చట్టాలు దీనిలో భాగమేనన్నారు. విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ ప్రైవేటీకరణ, బ్యాంకుల కుదింపును ఈ నేపథ్యంలోనే చూడాలని అన్నారు. దీనివల్ల సామాజిక న్యాయం, సంక్షేమం ప్రమాదంలో పడతాయని, చిన్న, మధ్య తరహా పరిశ్రమలు చితికిపోతాయని ఆయన హెచ్చరించారు. వ్యవసాయం, రేవులు, మైనింగ్‌ తదితర రంగాల్లో తీసుకొస్తున్న చట్టాలను మెటా కేపిటలిస్ట్‌ చట్టాలుగా ఆయన అభివర్ణించారు. జిఎస్‌టి,సర్‌చార్జి, సెస్సుల పేరుతో రాష్ట్రాల ఆర్థిక వనరులను కేంద్రం హరించివేస్తోందన్నారు. విద్య, వ్యవసాయ రంగాల్లో కేంద్రం మితిమీరినజోక్యం వల్ల రాష్ట్రాల హక్కులు కుదించుకుపోతున్నాయన్నారు. ప్రజాస్వామ్యంపై కూడా మోడీ ప్రభుత్వం దాడి చేస్తోందని, దిశారవి కేసు ఇందుకొక తాజా ఉదాహరణ అని ఆయన చెప్పారు.
భారత్‌ బయోటెక్‌ కంపెనీ తీసుకొచ్చిన కొవాగ్జిన్‌ టీకాను చూపి కరోనా జాతీయోన్మాదాన్ని రెచ్చగొట్టేందుకు బిజెపి యత్నిస్తోందని అన్నారు. సైన్స్‌కు హద్దులు, సరిహద్దులు ఉండవని, దీనికి కూడా జాతీయవాదం రంగు పులమడం బిజెపి సంకుచితత్వానికి నిదర్శనమన్నారు.