Oct 28,2021 19:31

pedana lo nirasana

పెట్రోల్‌ , డీజిల్‌ ధరలను తగ్గించాలి : వామపక్షాలు
ప్రజాశక్తి-కలక్టరేట్‌
కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం పెంచిన పెట్రోల్‌, డీజిల్‌, వంట గ్యాస్‌, నిత్యావసర సరుకుల ధరలను తగ్గించాలని కోరుతూ స్థానిక బుట్టాయి పేట సెంటర్‌ లో గురువారం సిపిఐ, సిపిఎం సిపిఐ(ఎంఎల్‌) పార్టీల ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా సిపిఎం తూర్పుకృష్ణా కమిటీ సభ్యులు కొడాలి శర్మ మాట్లాడారు. కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం అత్యంత అప్రజాస్వామికంగా వ్యవహరిస్తోందన్నారు. కేంద్ర ప్రభుత్వం ఈనెలలో ఇప్పటివరకు 18 సార్లు పెట్రోల్‌ డీజిల్‌ ధరలు పెంచిందన్నారు. రాబోయే నాలుగైదు రోజుల్లో వంట గ్యాస్‌ ధర మరొక రూ.100 పెంచేలా ఉందన్నారు. పెంచిన పెట్రోల్‌, డీజిల్‌, వంట గ్యాస్‌ ధరలను వెంటనే తగ్గించాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్‌చేశారు విమానాలకు వాడే ఆయిల్‌ ధరలు లీటర్‌ రూ.80 ఉండగా సామాన్యులు ప్రజలు వాడే లీటర్‌ పెట్రోలు డీజిల్‌ రూ.115కు చేరిందన్నారు. ఈ ప్రభుత్వం ప్రజలకు సబ్సిడీలు ఇవ్వకుండా పెట్టుబడిదారులకు, విలాసవంతులకు ప్రభుత్వ ఆస్తులు దోచిపెడుతోందన్నారు. సిపిఐ జిల్లా నాయకులు మోదుమూడి రామారావు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం పెట్రోల్‌, డీజిల్‌ రేట్లు పెంచటం వల్ల ప్రజలు వాడే నిత్యావసర సరుకుల ధరలన్నీ ఇబ్బడిముబ్బడిగా పెరిగిపోతున్నాయన్నారు. దాని వల్ల సామాన్య ప్రజలు బ్రతకటం కష్టంగా మారుతోందన్నారు. కేంద్ర ప్రభుత్వం వెంటనే పెంచిన పెట్రోల్‌ డీజిల్‌ రేట్లు తగ్గించాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్‌చేశారు. ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ జిల్లా నాయకులు లింగం ఫిలిప్‌, వై.ఈశ్వరరావు, సిపిఎం నాయకులు బూర.సుబ్రమణ్యం, సిహెచ్‌. జయరావు, బిఎస్‌ఎన్‌ఎల్‌ ఎంప్లాయీస్‌ యూనియన్‌ నాయకులు బసవ పున్నయ్య,ఎండి యునాస్‌, ఎం. పోలినాయుడు , ఈడే రామారావు పి. నాగయ్య, కే అంబా ప్రసాద్‌, తిరుపతయ్య, సిపిఐ (ఎంఎల్‌) పార్టీ నాయకులు జె జగన్‌ తదితరులు పాల్గొన్నారు.