Oct 28,2021 19:30

పతాక ఆవిష్కరణ అనంతరం అభివాదం చేస్తున్న చౌదరి తేజేశ్వరరావు, ఇతర సిపిఎం నాయకులు


ప్రజాశక్తి - శ్రీకాకుళం ప్రతినిధి: పెట్రోల్‌, డీజిల్‌, వంటగ్యాస్‌ ధరలను ఇష్టానుసారంగా పెంచి, అవి తగ్గాలంటే జిఎస్‌టి పరిధిలోకి రావాలని రాష్ట్రాలను కోరడం బిజెపి ఆడుతున్న నాటకమని సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు ఎం.వి.ఎస్‌ శర్మ అన్నారు. శ్రీకాకుళం నగరంలోని వైఎస్సార్‌ కళ్యాణ మండపంలో సిపిఎం శ్రీకాకుళం జిల్లా 17వ మహాసభలు గురువారం ప్రారంభమయ్యాయి. సిపిఎం సీనియర్‌ నాయకులు చౌదరి తేజేశ్వరరావు పార్టీ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం 'ప్రస్తుత రాజకీయ, ఆర్థిక పరిస్థితులపై నిర్వహించిన సెమినార్‌ శర్మ ప్రసంగించారు. పెట్రో ఉత్పత్తులపై వస్తున్న పన్నులే రాష్ట్ర ప్రభుత్వాలకు ప్రధాన ఆదాయ వనరుగా ఉన్నాయన్నారు. జిఎస్‌టిలోకి వెళ్తే వాటిని కేంద్రమే వసూలు చేసుకుని రాష్ట్రాల ఆదాయాన్ని కొల్లగొట్టాలని చూస్తోందని విమర్శించారు. జిఎస్‌టి పరిధిలోకి పెట్రో ఉత్పత్తులు తీసుకొస్తే ధరలు తగ్గుతాయన్నది భ్రమేనన్నారు. దేశంలో ఆహార ధాన్యాల నిల్వలు బఫర్‌ స్టాక్‌కు మించి ఉన్నా, మోడీ ప్రభుత్వం వాటిని పేదలకు పంచకుండా ఇథనాల్‌ తయారీకి ఉపయోగించి పెట్రోల్‌తో కలిసి వ్యాపారం చేయాలని చూస్తోందని చెప్పారు. ప్రజలకు ఇవ్వాల్సింది ఇవ్వకపోగా, పెట్రోల్‌ ధరలను పెంచి వారిపై దాడి చేస్తోందని విమర్శించారు. అధికారాన్ని సుస్థిరం చేసుకునే పనిలో వైసిపి, అధికారంలోకి వచ్చేందుకు టిడిపి ప్రయత్నిస్తున్నాయని తప్ప ప్రధాన ముద్దాయి బిజెపిని విడిచిపెట్టేశాయన్నారు. పార్టీ కార్యదర్శివర్గ సభ్యులు దడాల సుబ్బారావు మాట్లాడుతూ రామ మందిరం పేరుతో రూ.నాలుగు వేల కోట్లు వసూలు చేసి, 2024 ఎన్నికల్లో మందిరం నిర్మాణంతో ఎన్నికల్లో లబ్ధి పొందాలని బిజెపి చూస్తోందని చెప్పారు. రాష్ట్రంలో వైసిపి, టిడిపి, జనసేన పార్టీలు బిజెపి ప్రమాదాన్ని గుర్తించడం లేదన్నారు. మహాసభల సందర్భంగా పార్టీ సీనియర్‌ నాయకులు చౌదరి తేజేశ్వరరావు సాగించిన పోరాటాలపై ప్రజాశక్తి బుకహేౌస్‌ ప్రచురించిన 'చౌదరి తేజేశ్వరరావు అనుభవాలు-జ్ఞాపకాలు' పుస్తకాన్ని ఎం.వి.ఎస్‌ శర్మ ఆవిష్కరించారు. మహాసభలకు అధ్యక్షవర్గంగా కె.శ్రీనివాసు, పి.తేజేశ్వరరావు, జి.ఈ్వరమ్మ వ్యవహరించారు. రాష్ట్ర కమిటీ సభ్యులు బి.తులసీదాస్‌, జిల్లా కార్యదర్శి భవిరి కృష్ణమూర్తి తదితరులు పాల్గొన్నారు.