Mar 02,2021 22:58

ఆందోళన చేస్తున్న సిపిఎం నాయకులు

ప్రజాశక్తి - రాజాం / ఆమదాలవలస : పెట్రోల్‌, డీజిల్‌ ధరల పెంపుపై సిపిఎం, ప్రజాసంఘాలు రాజాం, ఆమదాలవలసలో మంగళవారం నిరసన ప్రదర్శనలు చేపట్టాయి. కేంద్ర ప్రభుత్వం పెంచిన పెట్రోల్‌, డీజిల్‌ ధరలతో నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్నంటుతున్నాయని మండిపడ్డాయి. పెంచిన పెట్రోల్‌, డీజిల్‌ ధరలను తగ్గించాలని డిమాండ్‌ చేశాయి. రాజాంలో సిపిఎం ఆధ్వర్యంలో నిర్వహించిన నిరసన ప్రదర్శనలో మండల కార్యదర్శి సిహెచ్‌.రామ్మూర్తి నాయుడు మాట్లాడుతూ కేంద్రంలో బిజెపి ప్రభుత్వం అధికారంలోకొచ్చాక కార్పొరేట్‌ అనుకూల విధానాలను అవలంభిస్తోందని మండిపడ్డారు. ప్రజలపై విపరీతమైన భారాలు మోపుతోందని విమర్శించారు. అంతర్జాతీయంగా క్రూడ్‌ ఆయిల్‌ ధరలు తగ్గినా, దేశంలో మాత్రం డీజిల్‌, పెట్రోలు, గ్యాస్‌ ధరలు పెరుగుతున్నాయన్నారు. ఆరు నెలలుగా కనీసం గ్యాస్‌ సబ్సిడీ కూడా ఇవ్వకుండా ఎగ్గొట్టేశారని ధ్వజమెత్తారు. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన మోటారు వాహన చట్టంతో రవాణా రంగానికి తీవ్ర నష్టం వాటిల్లితోందని ఆవేదన వ్యక్తం చేశారు. మరోవైపు టోల్‌గేట్‌ ఛార్జీలను విపరీతంగా పెంచారని చెప్పారు. పెంచిన పెట్రో, గ్యాస్‌ ధరలను తగ్గించాలని, నూతన మోటారు వాహన చట్ట సవరణను ఉపసంహరించుకోవాలని డిమాండ్‌ చేశారు. పెట్రోల్‌ ఉత్పత్తులను జిఎస్‌టి పరిధిలోకి తీసుకురావాలన్నారు. విశాఖ స్టీల్‌ప్లాంట్‌ ప్రయివేటీకరణను ఆపాలని డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో సిపిఎం మండల నాయకులు అనిల్‌కుమార్‌, సత్యారావు, శంకరరావు, సింహాచలం తదితరులు పాల్గొన్నారు.
ఆమదాలవలసలో...
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పోటీపడుతూ ప్రజలపై మోయలేని భారాన్ని మోపుతున్నాయని ప్రజాసంఘాల ఐక్యవేదిక కన్వీనర్‌ బొడ్డేపల్లి మోహనరావు విమర్శించారు. స్థానిక మున్సిపల్‌ వాణిజ్య భవన సముదాయం సమీపాన మెయిన్‌ రోడ్డుపై ప్రజాసంఘాల నాయకులతో కలిసి నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రపంచంలోని ఏ దేశంలో లేని విధంగా పెట్రోల్‌ ధరలను విపరీతంగా పెంచుతూ సామాన్య ప్రజల నడ్డివిరుస్తున్నారని విమర్శించారు. పెట్రోలియం ధరలతో పాటు నిత్యావసరాల ధరలు విపరీతంగా పెరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఎరువుల ధరలను పెంచి రైతులపై మోయలేని భారం వేస్తున్నారని ధ్వజమెత్తారు. పెంచిన ధరలను వెంటనే ఉపసంహరించుకుని ప్రజలకు ఉపశమనం కలిగించాలని ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో పలు ప్రజాసంఘాల నాయకులు పొన్నాడ వరహానర్సింహం, ఎస్‌.వి పాపినాయుడు, ఎం.మల్లేశ్వరరావు, డి.లక్ష్మణరావు, ఎన్ని రాజు తదితరులు పాల్గొన్నారు.