Jun 13,2021 07:35

అగర్తలా : బిజెపి పాలిత త్రిపురలో ప్రజాతంత్ర హక్కులపైన, వ్యక్తుల ప్రాణాలు, ఆస్తులను పరి పరిరక్షించుకునే హక్కుపైన అడ్డు అదుపులేకుండా సాగుతున్న దాడులను ఐక్యంగా తిప్పికొట్టాలని, ప్రజాతంత్ర హక్కులను కాపాడుకోవాలని సిపిఐ(ఎం) పిలుపునిచ్చింది. మంత్రి సమక్షంలోనే, ఆయన ఆదేశాలతోనే దాడులు జరుగుతున్నాయి. ఈ దాడులపై ఎన్ని సార్లు ఫిర్యాదు చేసినా, చివరికి గవర్నర్‌ను కలసి మొత్తుకున్నా ఒక్క కేసు కూడా నమోదు చేయలేదు. ఇంకోసారి ఇటువంటివి జరగకుండా చూస్తాను, రాజకీయ హింసను నిలుపుచేసేందుకు శాయశక్తులా ప్రయత్నిస్తానని గవర్నర్‌ చెప్పే రోటీన్‌ డైలాగ్‌లు విని విసిగిపోయిన సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యుడు ఎంఎల్‌ఎ భానూలాల్‌ సాహా మే 30వ తేదీన ఫేస్‌బుక్‌లో ఒక పోస్ట్‌ పెట్టారు. పెట్రోలు బాంబులు, కర్రలతో బయట నుంచి వస్తున్న దుండగులను ఐక్యంగా ఎదుర్కోవాలని ప్రజలకు ఆయన పిలుపునిచ్చారు. ప్రజలు తమ ప్రాణాల్ని, ఆస్తులను కాపాడుకునేందుకు మీ చేతిలో, దగ్గరలో ఏ వస్తువుంటే వాటితో తిరగబడండి, ఆత్మ రక్షణ కోసం ఇంట్లోని వస్తువులు ఉపయోగించడం నేరమేమీ కాదని ఆయన అన్నారు. ప్రాణాలు, ఆస్తులు కాపాడుకోవాలంటే ప్రతిఘటన ఒక్కటే మార్గం. ప్రజలంతా ఏకతాటిపై నిలిచి పాలక పార్టీ గూండాలను ప్రతిఘటించాలని కోరారు. భానూలాల్‌ సాహా పోస్ట్‌కు మద్దతుగా పార్టీ కేంద్ర కమిటీ సభ్యులైన బిజన్‌ధర్‌, జితేంద్ర చౌదరి విడివిడిగా ఫేస్‌బుక్‌ పోస్టులు పెట్టారు. బదర్‌ఘాట్‌లో సిపిఐ(ఎం) నాయకుల, కార్యకర్తల ఇళ్లను లక్ష్యంగా చేసుకుని పాలక బిజెపి గూండాలు సాగించిన దాడులను పిరికిపంద చర్యగా వారు అభివర్ణించారు. ఈ పోస్ట్‌కు మద్దతుగా జితేంద చౌదరి మాట్లాడుతూ, ఈ దాడుల్లో బాధితులుగా మారడం కన్నా తెగించి ఎదురు దాడి చేయాలని ఉద్బోధించారు. ముగ్గురు సిపిఎం నేతలు పెట్టిన పోస్టులపై ప్రస్తుతం త్రిపుర మీడియాలో ముఖ్యంగా ప్రింట్‌, ఎలక్ట్రానిక్‌ మీడియాలో చర్చ జరుగుతోంది. బిజెపి బాకాలుగా ఉన్న మీడియా సిపిఎం నేతల పోస్టును విమర్శిస్తుండగా, స్వతంత్ర మీడియా చాలా వరకు రాష్ట్రంలో అరాచకత్వం నెలకొన్నప్పుడు, ఇటువంటి పోస్టులు రావడం సరైనదేనని పేర్కొన్నాయి. ఈ పోస్టుల పట్ల పాలక బిజెపి స్పందన భయం గొలిపేదిగా ఉంది. ఎవరైతే పోస్టులు పెట్టారో వారిపై ఎఫ్‌ఐఆర్‌ దాఖలు చేయాలని చెప్పింది. దాంతో సిపిఐ(ఎం) నేతలపై 14 పోలీసు స్టేషన్లలో ఎఫ్‌ఐఆర్‌లు నమోదయ్యాయి. దర్యాప్తు నిమిత్తం మూడు పోలీసు స్టేషన్లకు సాహా హాజరయ్యారు. జితేంద్ర చౌదరి, బిజన్‌ ధర్‌ వేర్వేరు తేదీల్లో ఒకే పోలీసు స్టేషన్‌కు హాజరయ్యారు. ముఖ్యమంత్రితో సహా పలువురు బిజెపి నేతల రెచ్చగొట్టే ప్రసంగాలపై పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని పేర్కొంటూ ఫేస్‌బుక్‌ పోస్టుల్లో ఇచ్చిన పిలుపును సిపిఎం నేతలు గట్టిగా సమర్ధించారు. ఆత్మ రక్షణ ప్రతి ఒక్కరి హక్కని, ఇది చట్టంలో కూడా పొందుపరచబడిందని తెలిపారు. ప్రస్తుత నిరంకుశ, ఫాసిస్టు ప్రభుత్వ పాలనలో అట్టడుగు వర్గాల ప్రజల జీవించే హక్కును ఇది గుర్తు చేయడమేనని అన్నారు. రాష్ట్రంలో పూర్తిగా శాంతి భద్రతలు కుప్పకూలిన తరుణంలో, పోలీసు యంత్రాంగం ఏకపక్షంగా వ్యవహరిస్తున్న నేపథ్యంలో తాము ఈ పిలుపును ఇవ్వాల్సి వచ్చిందన్నారు. తొలుత కమ్యూనిస్టులను లక్ష్యంగా పెట్టుకున్న బిజెపి గూండాలు తర్వాత తమ పరిధిని విస్తరించారు. డాక్టర్లు, పారా మెడికల్‌ సిబ్బంది, నర్సులు, మీడియా సిబ్బంది, న్యాయవాదులు, మేధావులు, ఎవరైతే అసమ్మతి వ్యక్తం చేశారో వారందరినీ లక్ష్యంగా చేసుకున్నారు. ఒక్క మాటలో చెప్పాలంటే యావత్‌ రాష్ట్రం ఉక్కిరిబిక్కిరవుతోంది. ''ఎవరిపైనా దాడి చేయవద్దు, ఒకవేళ మీపై దాడి చేస్తే మిమ్మల్ని మీరు కాపాడుకోవడానికి చర్యలు తీసుకోండి'' అని సిపిఎం నేతలు కోరారు. ఈ పోస్టులు పెట్టిన తర్వాత మొత్తం పరిస్థితిలో గణనీయంగా మార్పు వచ్చింది. బిజెపి గూండాల దాడులను గ్రామస్తులు విజయవంతంగా తిప్పికొడుతున్నారు. కమలాపూర్‌ స్థానిక కమిటీ కార్యాలయాన్ని ఈ నెల 6న బిజెపి గూండాలు స్వాధీనం చేసుకోగా, తరువాత రోజు ప్రజలు, స్థానిక కార్యకర్తలు ప్రతిఘటించి తిరిగి స్వాధీనం చేసుకున్నారు. దక్షిణ త్రిపురలోని బెలోనియా సబ్‌డివిజన్‌ రాధానగర్‌ వద్ద బిజెపి గూండాలను గ్రామస్తులు ప్రతిఘటించారు. దీంతో, వారు బైకులు, ఆయుధాలను వదిలేసి పారిపోవాల్సి వచ్చింది.