Jun 11,2021 08:51

లిమా : పెరూ అధ్యక్ష ఎన్నికల్లో వామపక్షవాది పెడ్రో కాస్టిలో విజయం సాధించారు. పోటా పోటీగా జరిగిన ఎన్నికల్లో 50.2 శాతం ఓట్లతో కాస్టిలో తన సమీప ప్రత్యర్థి మితవాద, నయా ఉదారవాద విధానాలను గట్టిగా సమర్థించే కెయికో ఫ్యూజిమోరిని స్వల్ప తేడాతో ఓడించారు. ఆదివారం జరిగిన ఈ ఎన్నికల్లో మొత్తం 99శాతం మంది (2.4 కోట్ట మంది) ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. మొత్తం పోలైన ఓట్లలో ఫ్యుజిమొరికి 49.7శాతం (87,20, 337 ఓట్లు) ఓట్లు రాగా, యూనియన్‌ నేత, గ్రామీణ పాఠశాల టీచర్‌ అయిన కాస్టిలోకి 50.2శాతం ఓట్లు (87, 91, 778 ఓట్లు)వచ్చాయి. కాగా, దాదాపు 2క్షల ఓట్లు వున్న 802 పోలింగ్‌ స్టేషన్లలో ఫలితాలను రద్దు చేయాల్సిందిగా ఈ నెల 4న ఫ్యుజిమొరి జాతీయ ఎన్నికల ట్రిబ్యునల్‌ను కోరారు. మరో 3లక్షల ఓట్లను సమీక్షించాల్సి వుందని ఆమె పేర్కొన్నారు. అంటే దాదాపు 5లక్షల ఓట్లు ప్రశ్నార్ధకంగా మారాయని ఆమె ఇక్కడ పత్రికా సమావేశంలో అన్నారు. తొలి కౌంటింగ్‌లో ఫ్యుజిమొరి ఆధిక్యంలో వున్నారు. కానీ నెమ్మదిగా కాస్టిలోకి ఓటింగ్‌ పెరిగింది. ఈ ఎన్నికల్లో అవకతవకలు, అవినీతి జరిగాయని ఫ్యుజిమొరి ఆరోపించారు. 'ప్రజల ఇష్టాన్ని బహిష్కరించాలనే ఉద్దేశ్యం వున్నట్లు' తన వద్ద సాక్ష్యాధారాలు వున్నాయని ఆమె విలేకర్లతో వ్యాఖ్యానించారు. ఫలితాన్ని గౌరవించాలని ఇరువురు అభ్యర్ధులు ముందుగానే అంగీకారానికి వచ్చారు. కాగా ఓట్ల లెక్కింపులో ఎలాంటి అవకతవకలు జరగలదేని పెరూ అధికారులు తెలిపారు.