Oct 27,2021 22:57

- సామాజిక అవసరాలు తీర్చటంపై ప్రత్యేక దృష్టి
- అధికారులకు కలెక్టర్‌ ప్రవీణ్‌కుమార్‌ ఆదేశం
ప్రజాశక్తి-ఒంగోలు కలెక్టరేట్‌: 
సుదీర్ఘకాలం పెండింగ్‌లో ఉన్న సమస్యల పరిష్కారానికి నియోజకవర్గాల వారీగా ప్రత్యేక కార్యాచరణ ప్రణాళిక రూపొందిస్తున్నట్లు కలెక్టర్‌ ప్రవీణ్‌కుమార్‌ వెల్లడించారు. స్ధానిక కలెక్టర్‌ సమావేశ మందిరంలో బుధవారం ఒంగోలు నియోజకవర్గ సమగ్ర అభివృద్ధిపై ఆయన సంబంధిత అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ ప్రజలు సుభిక్షంగా జీవనం సాగించటానికి అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించాలని తెలిపారు. ఇందుకోసం నియోజకవర్గం, మండలం, గ్రామాల వారీగా సామాజిక సమస్యలు గుర్తించి సమగ్ర నివేదిక సిద్ధం చేయాలన్నారు. ముఖ్యంగా తాగునీరు, పారిశుధ్యంపై ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు. గ్రామాల అభివృద్ధికి ప్రధాన సమస్యగా సుదీర్ఘకాలం నుంచి పెండింగ్‌లో ఉన్న వాటిని గుర్తించాలన్నారు. భవన నిర్మాణాలు, మురుగునీటి వ్యవస్థ, రహదారులు, భూములు కేటాయింపు ఆర్థిక అంశాలతో ముడిపడిన సమస్యలను గుర్తించాలన్నారు. సామాజిక అవసరాలు తీరటానికి ప్రజలు ఆశిస్తున్న అంశాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు. గ్రామాల వారీగా సమగ్ర ప్రణాళిక రూపొందించాలని కలెక్టర్‌ పలు సూచనలు చేశారు. సమావేశంలో సంయుక్త కలెక్టర్‌(ఆసరా సంక్షేమం) కె.కృష్ణ, ఒంగోలు నగర పాలక సంస్థ కమిషనర్‌ కె.భాగ్యలక్ష్మి, గృహ నిర్మాణ శాఖ పీడీ సాయినాధ్‌ కుమార్‌, పిఆర్‌ ఎస్‌ఇ కొండయ్య, ప్రత్యేక అధికారి అర్చన, ఒంగోలు మండల తహశీల్దార్‌ నయీమ్‌ అహ్మద్‌ తదితరులు పాల్గొన్నారు.